ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల (climate changes) వల్ల అనేక దేశాలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. వాతావరణ ప్రతికూల మార్పులు పరిష్కరించడం ఒక్క దేశం వల్ల సాధ్యమయ్యేది కాదు. అందుకే ప్రపంచ నాయకులు, జాతీయ సంధానకర్తలు ఐదేళ్లకోసారి వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించడానికి సమావేశం అవుతుంటారు. అయితే ఈసారి స్కాట్‌లాండ్ (Scotland)లో నవంబర్‌లో ఐక్యరాజ్య సమితి (UN) నేతృత్వంలో శిఖరాగ్ర సమావేశం జరపనున్నారు. అంతర్జాతీయ చట్టం (International law), సంస్థలు ఐక్యమై ప్రకృతిలో వచ్చే మార్పులను పరిష్కరించేందుకు చర్చించనున్నారు. ఈ తరుణంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం COP26 (కాప్26) తన లక్ష్యాలను చేరుకోలేదని ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో తెలుసుకుందాం.
* COP26 అంటే ఏమిటి?
1992లో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC- యూఎన్‌ఎఫ్‌సీసీసీ) అనే అంతర్జాతీయ ఒప్పందానికి దేశాలు అంగీకరించాయి. యూఎన్‌ఎఫ్‌సీసీసీ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రపంచ సహకారం కోసం ప్రాథమిక నియమాలు, అంచనాలను ఏర్పాటు చేసింది. వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్ (global warming)యే కారణమని.. ఈ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వల్ల తలెత్తుతుందని.. అందుకే వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చాలా దేశాలు 1992లో అధికారికంగా గుర్తించాయి. 2015లో దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి ఆ ఒప్పందం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది.
ఆ ఒప్పందం విపత్తు వాతావరణ మార్పులను (Climate changes) నివారించడానికి గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్ (3.6 F) లేదా అంతకన్నా తక్కువ 1.5 C (2.7 F)కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీతో భాగస్వామ్యమై అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12, 2021 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో COP26ని నిర్వహిస్తోంది.
* వాతావరణ మార్పులపై ప్రపంచ నాయకులు (World leaders) ఎందుకు దృష్టి సారిస్తున్నారు?
మానవుల చర్యలవల్ల భూతాపం పెరుగుతోందని.. వాతావరణ మార్పు ఇప్పుడు విస్తృతంగా, వేగంగా తీవ్రతరమవుతోందని ఆగస్టు 2021లో విడుదలైన యూఎన్ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నివేదిక హెచ్చరించింది. వరదలు, తీవ్రమైన వడగాల్పులు, కరువులు, జాతులు అంతరించిపోవడం, మంచు పలకలు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి వాటికి వాతావరణ మార్పులు ఎలా ఆజ్యం పోస్తున్నాయో ఐపీసీసీ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
యూఎన్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నివేదికను మానవాళికి ఒక హెచ్చరికగా అభివర్ణించారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఇప్పటికే వాతావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగాయని.. అవి చాలా కాలం పాటు వాతావరణంలోనే ఉంటాయని.. దేశాలు తమ ఉద్గారాలను త్వరగా తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ.. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు (World temperatures) పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నాయకులు ఒకటై చర్చించడమే పరిష్కారంగా భావిస్తున్నారు.
* ఐక్యరాజ్య సమితి (UN) సమావేశమైన COP26లో ఏం జరగబోతోంది?
సమావేశం మొదటి రోజుల్లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వంటి 120 మంది దేశాధినేతలు.. వారి ప్రతినిధులు వాతావరణ మార్పులను తగ్గించడానికి తమ రాజకీయ నిబద్ధతను తెలుపుకోవడానికి సమావేశమవుతారు. దేశాధినేతలు వెళ్లిపోయాక పర్యావరణ మంత్రుల నేతృత్వంలోని దేశ ప్రతినిధుల బృందాలు కొత్త ప్రతిజ్ఞలు చేయడానికి.. కొత్త కార్యక్రమాలలో చేరడానికి ఈవెంట్స్ (Events), ఎక్స్చేంజ్ లలో పాల్గొంటారు. అలాగే కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రభుత్వేతర సంస్థలు, వ్యాపార నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అడవులు, వ్యవసాయం మొదలైనవాటిపై వాతావరణం మార్పులు ఎంత ప్రభావం చూపుతున్నాయో చర్చిస్తారు. ఈ సమావేశం అనేది అన్ని దేశాలు అంగీకరించిన ఒక తుది నిర్ణయంతో ముగుస్తుంది.
* COP26 ద్వారా ఏం సాధించగలదు?
పారిస్ (Paris) ఒప్పందం ప్రకారం దేశాలు COP26తో సహా ప్రతి ఐదు సంవత్సరాలకు వారి జాతీయ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా వారు 2030 నాటికి ప్రతిష్టాత్మక లక్ష్యాలను పెట్టుకునే అవకాశం ఉంది. వీటిని జాతీయంగా నిర్ణయించిన సహకారాలు లేదా ఎన్‌డీసీ(NDC)లని అంటారు. పారిస్ ఒప్పందం ప్రకారం దేశాలు తమ ఎన్‌డీసీలను నివేదించవలసి ఉంటుంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను (Greenhouse gas emissions) ఎలా తగ్గించుకోవాలో నిర్ణయించేందుకు ఎన్‌డీసీ ప్రపంచ నేతలకు సహాయపడతాయి. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి 2015లో ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఐతే ఈ శతాబ్దం మధ్య నాటికి సున్నా కార్బన్ ఉద్గారాలను చేరుకోవడమే COP26 ముఖ్య లక్ష్యం. అలాగే పేద దేశాలు క్లీన్ ఎనర్జీ ఉపయోగించేందుకు ఆర్థిక సహాయం చేస్తుంది.
* అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి దేశాలు నియమాలు పాటిస్తున్నాయా?
దేశాల సవరించిన లక్ష్యాలు చాలా బలహీనంగా ఉన్నాయని.. అవి శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 C (4.9 F) వరకు పెరిగేలా చేస్తాయని యూఎన్ సెప్టెంబర్ 2021లో హెచ్చరించింది. మరోవైపు ఇంధన సరఫరా కొరత వల్ల యూరప్, చైనాలు సహజ వాయువు, బొగ్గు, చమురు ధరలను పెంచాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కెల్లా చైనా దేశమే ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేస్తోంది.
గతేడాది, ఈ ఏడాదికి మధ్యకాలంలోని చైనా వాతావరణ మార్పులు తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రష్యా, ఆస్ట్రేలియా వంటి ప్రధాన శిలాజ ఇంధన ఉత్పత్తిదారులు తమ నిబద్ధతను బలోపేతం చేయడానికి ఇష్టపడటం లేదు. సౌదీ అరేబియా తన లక్ష్యాలను పటిష్టం చేసుకుంది కానీ చమురు, గ్యాస్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద వినియోగదారు, ఉత్పత్తిదారు, బొగ్గు దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలకు ఇంకా కట్టుబడి లేదు.
Today leaders from around the world are gathering in Glasgow for #COP26
They will come together to make clear their commitment to tackle climate change and signal ambition for the summit.
Learn more ?#TogetherForOurPlanet
— COP26 (@COP26) November 1, 2021
* COP26 దాని లక్ష్యాలను చేరుకోకపోతే ఏం జరుగుతుంది?
2030 నాటికి గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 45% తగ్గించాలనే లక్ష్యాన్ని COP26 చేరుకోదని చాలా మంది అంతర్గత వ్యక్తులు విశ్వసిస్తున్నారు. దేశాల బలమైన నిబద్ధతను కలిగి ఉండకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. అంటే 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను చేరుకోవడానికి ప్రపంచమంతా ఏకతాటిపై నడవదని.. 1.5సీ కంటే తక్కువ గ్లోబల్ వార్మింగ్ లక్ష్యం చేరుకోవడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
“If we act now, and we act together, we can protect our precious planet”
-- COP President @AlokSharma_RDG at the opening of #COP26 yesterday.
Read his full speech here:
? https://t.co/JxBNpSECS0 #ClimateAction | #TogetherForOurPlanet pic.twitter.com/mM6Cnbsgdp
— COP26 (@COP26) November 1, 2021
ఒకవేళ ఐక్యరాజ్యసమితి సమావేశం దాని లక్ష్యాన్ని చేరుకోకపోతే చిన్న ద్వీప రాష్ట్రాలు మునిగిపోవడం, నీటి అడుగున పర్యావరణ వ్యవస్థ(coral reefs) సర్వనాశనం కావడం, విపరీతమైన వడగాల్పులు, వరదలు, కార్చిచ్చు, విస్తృతమైన పంట దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఇంకా ఊహించని స్థాయిలో ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PM Narendra Modi, Review meeting, WEATHER, Weather report, World environmental day