Explained: భారత్‌లో Black Fungus ప్రమాదకరంగా మారుతోందా?.. మన దేశంలో ఇది మరో మహమ్మారిగా మారే అవకాశం ఉందా? 

ప్రతీకాత్మక చిత్రం

ఒకవైపు మహమ్మారి భయంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతుంటే.. కరోనా సెకండ్ వేవ్‌లో కొత్తగా ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ వ్యాధి కరోనాను జయించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది.

  • Share this:
భారతదేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ఇంకా తగ్గలేదు. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గడానికి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు మహమ్మారి భయంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతుంటే.. కరోనా సెకండ్ వేవ్‌లో కొత్తగా ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ వ్యాధి కరోనాను జయించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని వేల మంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మరణాల శాతం సైతం ఎక్కువగా ఉండటంతో, రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దీనికి చికిత్స పద్ధతులు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.

* బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి?
వాతావరణంలో ఉండే ఒక రకమైన ఫంగస్ ద్వారా మ్యుకోర్‌మైకోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీన్నే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. ఈ ఫంగస్ మట్టిలో, కుళ్లిన ఆకులు వంటి సేంద్రియ పదార్థాలలో సహజంగా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఇది శ్వాస తీసుకునేటప్పుడు గాలి ద్వారా శరీరంలో చేరుతుంది. ప్రజలు అనేక మార్గాల ద్వారా ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడవచ్చు. కలుషితమైన నీరు ఉండే ఆక్సిజన్ ట్యాంకులు, గాలిని శుభ్రం చేసే ఎయిర్ హ్యుమిడిఫయర్ వంటి యంత్రాల ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.

* బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతుందా?
బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముందు ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన శరీర కణజాలాన్ని వైద్యులు నిర్వీర్యం చేస్తారు. ఈ ఇన్‌ఫెక్షన్ మెదడుకు చేరితే ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. అందువల్ల వ్యాధి వ్యాపించిన కన్ను, దవడ, ముక్కు వంటి శరీర భాగాలను కొన్నిసార్లు తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ మెదడుకు చేరకుండా కాపాడవచ్చు. ఈ వ్యాధి మరణాల రేటు 54 శాతంగా ఉంటుందని సీడీసీ వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన తర్వాత, బాధితులు కొన్ని రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అయితే ఇది అంటువ్యాధి కాదని సీడీసీ తెలిపింది.

* కొత్తదేం కాదు
బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి కాదు. ఇంతకు ముందు మన దేశంలో సంవత్సరానికి కొన్ని డజన్ల కేసులు నమోదయ్యేవి. సాధారణంగా ఫంగస్ శరీరంలోకి చేరిన వెంటనే, మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొంటుంది. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకొని మందులు వాడుతున్న వారు, క్యాన్సర్ రోగులు మాత్రమే దీనికి ఎక్కువగా ప్రభావితమయ్యేవారు. కరోనా తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

* ఎవరికి ప్రమాదం ఎక్కువ?
కరోనా వైరస్ బారిన పడిన వారిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రేరేపితమయ్యి, కొన్నిసార్లు శరీరంలో అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీన్ని సైటోకిన్ స్ట్రోమ్ అంటారు. ఈ పరిస్థితిని నిలువరించడానికి, రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గించడానికి డాక్టర్లు కరోనా రోగులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కానీ ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఫలితంగా బాధితుల్లో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఫంగస్ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతోందని నిపుణులు చెబుతున్నారు.

* స్టెరాయిడ్స్ వాడకం తగ్గాలి
మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరికి ఫంగస్ ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారు వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా వీరికి కొన్ని ఆసుపత్రులు, వైద్యులు స్టెరాయిడ్లను ఎక్కువగా సూచిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందేవారు సైతం డాక్టర్ల సలహా లేకుండా సొంతంగా వీటిని వాడుతున్నారు. ఇవి ఫంగస్ వృద్ధికి అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల వారి శరీరం బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోలేక తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తోంది.

* ఎంతమందికి వ్యాధి సోకింది?
భారత్‌లో ఇప్పటి వరకు 5,424 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరిలో 4,556 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 55 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులేనని పేర్కొన్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువమంది ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారు. చాలా రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాయి. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఇన్‌ఫెక్షన్‌తో ఎంతమంది చనిపోయారనే వివరాలపై స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటి వరకు 200 కంటే ఎక్కువ మందిని బ్లాక్ ఫంగస్ బలితీసుకుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

* దీని చికిత్స ఉందా?
కొన్ని రకాల యాంటీ ఫంగల్ ఔషధాలతో బ్లాక్ ఫంగస్‌ను నయం చేయవచ్చు. దీనికి చికిత్సలో ఆంఫోటెరిసిన్ బి (amphotericin B) మందు బాగా పనిచేస్తుంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఫార్మా కంపెనీలను కేంద్రం కోరింది. ఇదే సమయంలో కరోనా చికిత్సకు స్టెరాయిడ్లను అవసరమైన వారే, అది కూడా వైద్యుల సలహాతోనే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. బ్లాక్‌ఫంగస్‌పై కేంద్రం ముందు నుంచే అప్రమత్తమైతే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కాదని కొందరు విమర్శిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: