WHAT IS BITCOIN AND WHAT YOU NEED TO KNOW ABOUT BITCOIN HERE IS ALL ANSWERS FOR YOUR DOUBTS GH SK
Explained: బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది? పూర్తి వివరాలు
వీడియోలు చూసి బిట్కాయిన్లు పొందండి.. అదిరే ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
Bitcoin: బిట్‌కాయిన్ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్గారిథమ్‌లను పరిష్కరించి, లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్లు ఈ ప్రక్రియలో విజయవంతంగా గెలుపొందితే.. వారికి కొన్ని బిట్కాయిన్లను రివార్డుగా అందజేస్తారు.
బిట్ కాయిన్.. ఇది ఒక్కటి ఉంటే చాలు.. మీరు లక్షాధికారే. ఓ 10 ఉంటే కోటీశ్వరుడయినట్లే లెక్క. అవును మరీ.. దీని విలువు మామూలుగా లేదు. ఒక్క బిట్ కాయిన్ విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. అందుకు చాలా రోజులుగా ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి? ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎలా ట్రేడింగ్ చేయాలి? భారత్‌లో దీనికి అనుమతి ఉందా? అని మనలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది ఒక రకమైన క్రిప్టో కరెన్సీ. ఇది టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వర్చువల్ కరెన్సీ. ఇందులో వర్చువల్ విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని ద్వారా కొన్ని రకాల లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అయితే చాలా దేశాల్లో దీన్ని లీగల్ టెండర్‌గా గుర్తించలేదు.
బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా అంగీకరించిన ఏకైక దేశం.. ఎల్ సాల్వెడార్. బిట్కాయిన్లను అన్ని రకాల లావాదేవీలకు అనుమతిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. బిట్కాయిన్లను సృష్టించే పద్ధతిని మైనింగ్ అంటారు. ఈ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం విపరీతమైన శక్తి అవసరమవుతుంది. దీంతో ఇందుకు అగ్నిపర్వతాల నుంచి శక్తిని ఉపయోగించే అంశంపై ఎల్ సాల్వెడార్ దేశం దృష్టి సారించింది.
ప్రపంచంలోని మొత్తం బిట్కాయిన్లలో సగానికి పైగా చైనాలోనే మైనింగ్ చేశారు. అయితే ఈ ప్రక్రియలో ఉపయోగించిన శక్తిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇలాంటి కార్యకలాపాలపై చైనా అణచివేత ధోరణి అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ మైనింగ్ అంటే ఏంటి, మైనర్లు (మైనింగ్ చేసేవారు) క్రిప్టోకరెన్సీని సేకరించడానికి ఇది ఎలా సహాయపడుతుందనే వివరాలు తెలుసుకుందాం.
* బిట్‌కాయిన్ మైనింగ్ అంటే ఏంటి?
బిట్‌కాయిన్ వ్యవస్థలో మైనింగ్‌ను కేంద్ర వ్యవస్థగా చెప్పుకోవచ్చు. కొత్త బిట్కాయిన్ల సృష్టి, బిట్‌కాయిన్ లావాదేవీలు, పర్యవేక్షణ వంటివన్నీ మైనింగ్ కిందకు వస్తాయి. బిట్‌కాయిన్ ఒక డీ-సెంట్రలైజ్డ్ కరెన్సీ. ఇది ఏ దేశానికీ చెందినది కాదు. దేశాల సెంట్రల్ బ్యాంకులు దీన్ని నియంత్రించలేవు. బిట్‌కాయిన్‌ను కలిగి ఉన్న వ్యక్తుల బృందమే దీన్ని పర్యవేక్షిస్తుంది. పేరులో కాయిన్ అని ఉన్నంత మాత్రాన, ఇది మన నాణేల మాదిరిగా ఉండదు. కంటికి కనిపించని ఈ వర్చువల్ కరెన్సీ.. కంప్యూటర్ కోడ్ల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఎవరికైనా పంపినప్పుడు లేదా చెల్లింపులకు వాడినప్పుడు.. కోడ్‌ను సృష్టిస్తుంది. ఈ లావాదేవీలు మొత్తం కంప్యూటర్ కోడ్ల ద్వారానే జరుగుతాయి.
బిట్‌కాయిన్ ద్వారా చేసే లావాదేవీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా రికార్డు అవుతాయి. బిట్ కాయిన్ నెట్‌వర్క్‌లో ఉండే అన్ని కంప్యూటర్లలో ఇవి కనిపిస్తాయి. అయితే ఈ లావాదేవీలు ఆన్లైన్ లెడ్జర్లో యాడ్ అవ్వడానికి ముందే, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంటే బిట్‌కాయిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీ బ్లాక్‌చెయిన్‌కు ఆటోమేటిగ్గా యాడ్ అవ్వదు. దీనికి ముందు సంబంధిత లావాదేవీ చట్టబద్దమైనదా కాదా అనేది తేలాల్సి ఉంటుంది. బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లోని మెజారిటీ కంప్యూటర్లు ఈ లావాదేవీని ధ్రువీకరించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.
బ్లాక్‌చెయిన్‌కు కొత్త బ్లాక్‌ను జోడించడాన్ని లేదా బిట్కాయిన్లను సృష్టించడాన్ని మైనింగ్ అంటారు. బిట్‌కాయిన్ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్గారిథమ్‌లను పరిష్కరించి, లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్లు ఈ ప్రక్రియలో విజయవంతంగా గెలుపొందితే.. వారికి కొన్ని బిట్కాయిన్లను రివార్డుగా అందజేస్తారు. బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లో లావాదేవీలు సజావుగా సాగే విధంగా చూడాల్సింది కూడా మైనింగ్ చేసేవారే.
2009లో బిట్‌కాయిన్‌ను సృష్టించినప్పుడు, ఒక బ్లాక్ మైనింగ్ చేసిన మైనర్‌కు 50 బిట్‌కాయిన్ లభించేవి. 2012లో ఇది 25 బిట్కాయిన్లకు పడిపోయింది. మైనింగ్ రివార్డులను ప్రతి నాలుగు సంవత్సరాలకు సగానికి తగ్గించాలని బిట్‌కాయిన్ ప్లాట్‌ఫాం నిర్ణయించడమే ఇందుకు కారణం. గత ఏడాది మేలో, బిట్ కాయిన్‌కు ఒక బ్లాక్‌ను జోడిస్తే అందే రివార్డు 6.25 బిట్‌కాయిన్‌గా ఉంది. ఒక బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు సుమారు 40,000 డాలర్లుగా ఉంది. అంటే మైనింగ్ ద్వారా ఒక బ్లాక్‌ను బిట్‌కాయిన్‌కు యాడ్ చేస్తే.. ఇప్పటికీ మైనర్లు పెద్ద మొత్తంలో రివార్డు గెల్చుకోవచ్చు.
* మైనింగ్ కోసం ఎందుకు ఎక్కువ శక్తి అవసరం?
కొత్త బిట్కాయిన్ల సృష్టి అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో కఠినమైన అల్గారిథమ్‌లను మైనర్లు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకు మనిషి మెదడు కంటే ఎన్నో రెట్ల గణాంక శక్తి అవసరమవుతుంది. బ్లాక్‌చెయిన్‌కు ఒక బ్లాక్‌ను జోడించడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రక్రియ ఎప్పుడు విజయవంతమవుతుందో కూడా తెలియదు. ఇందుకు శక్తిమంతమైన కంప్యూటర్ ప్రాసెసర్లను రోజంతా నడుపుతూనే ఉండాలి. ఈ కారణంగానే బిట్‌కాయిన్‌కు ఒక బ్లాక్‌ను జోడించినందుకు ఇచ్చే రివార్డు విలువ ఎక్కువగా ఉంటుంది.
మన దగ్గర ఉండే కంప్యూటర్లతో మైనింగ్ చేయడం అసాధ్యం. బిట్‌కాయిన్ మైనర్లు శక్తిమంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPU) ఉపయోగిస్తారు. వీటిని అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లేదా ASICలు అని కూడా అంటారు. ఇవి పనిచేయడానికి ఎంతో శక్తి అవసరమవుతుంది. ఒక బిట్‌కాయిన్ లావాదేవీ ఏకంగా 1,544 కిలోవాట్ల శక్తిని తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికాలో ఒక ఇంటికి 53 రోజుల పాటు అందించే విద్యుత్తుకు సమానం కావడం గమనార్హం. అందుకే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా స్వీకరించిన ఎల్ సాల్వెడార్ దేశం.. వాటి నిర్వహణకు అవసరమైన శక్తి కోసం కొత్త వనరులపై దృష్టి సారిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.