• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • WHAT IS BAIL HOW MANY TYPES OF BAILS ARE THERE IN INDIAN LAW MORE QUESTIONS AND ANSWERS ABOUT BAIL MK GH

Bail: బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి?

Bail: బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి?

ప్రతీకాత్మకచిత్రం

Bail: బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి? బెయిల్‌కు సంబంధించిన మరిన్ని ప్రశ్నలు, సమాధానాలు..

  • Share this:
ఏదైనా నేరానికి సంబంధించిన కేసులో పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేసిన తరువాత.. ముందుగా వినిపించే పదం బెయిల్. నేరారోపణలు మోపిన వ్యక్తిపై విచారణ జరగుతున్నప్పుడు కొన్ని నిబంధనలకు లోబడి వారిని జైలు నుంచి విడుదల చేయవచ్చు. అయితే విచారణ పూర్తవ్వడానికి ముందు లేదా కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు మాత్రమే బెయిల్ పొందే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా, నిబంధనలకు లోబడి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని బెయిల్ కల్పిస్తుంది. ఇందుకు అవసరమైనప్పుడు కోర్టులో హాజరవుతానని ప్రతివాది హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బెయిల్ నిర్ణీత సమయానికి మాత్రమే ఇస్తారు. బెయిల్‌కు సంబంధించిన మరిన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.

బెయిల్ అంటే ఏంటి? భారత్‌లోని బెయిల్స్‌ ఎన్ని రకాలు?
క్రిమినల్ కేసులో నిందితులను తాత్కాలికంగా విడుదల చేయడానికి బెయిల్ వీలు కల్పిస్తుంది. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉండి, సంబంధిత కేసుపై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వనప్పుడు మాత్రమే బెయిల్ పొందే వీలుంటుంది. మన దేశంలో రెగ్యులర్, మధ్యంతర, యాంటిసిపేటరీ బెయిల్.. మొత్తం మూడు బెయిల్స్ ఉన్నాయి.

మధ్యంతర బెయిల్ అంటే?
మధ్యంతర బెయిల్‌ను తక్కువ కాలానికి మంజూరు చేస్తారు. సాధారణ లేదా ముందస్తు బెయిల్ కోసం విచారణ జరగడానికి ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారు.

రెగ్యులర్ లేదా సాధారణ బెయిల్ అంటే?
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలీసు కస్టడీ ముగిసిన తరువాత, అవసరమైతే నిందితుడిని జైలుకు పంపుతారు. నిబంధనల ప్రకారం వీరు సాధారణ బెయిల్ పొందవచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ (సీఆర్‌పీసీ) లోని సెక్షన్ 437, 439 ప్రకారం.. విచారణకు హాజరవుతామనే హామీతో పోలీసు కస్టడీలో ఉన్నవారు విడుదల అయ్యేందుకు రెగ్యులర్ బెయిల్ అవకాశం కల్పిస్తుంది.

ముందస్తు బెయిల్ అంటే ఏంటి?
బెయిల్‌కు అవకాశం లేని నేరానికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేయవచ్చని భావించినప్పుడు ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 438 ప్రకారం.. ఒక కేసుకు సంబంధించి వ్యక్తులను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ రక్షణ కల్పిస్తుంది. సెషన్ కోర్టు లేదా హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చా?
ముందస్తు బెయిల్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంది. సాధారణంగా ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలోనే, కోర్టు కొన్ని నిబంధనలు, షరతులను విధిస్తుంది. వీటిని ఉల్లంఘించిన సందర్భాల్లో కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు. ఈ విషయంపై ఫిర్యాదుదారులు లేదా ప్రాసిక్యూషన్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిగిన తరువాత.. అవసరమైతే కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు.

ముందస్తు బెయిల్ ఉన్నవారు సాధారణ బెయిల్ తీసుకోవాలా?
ముందస్తు బెయిల్‌ తీసుకున్న వారు రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు దాన్ని రద్దు చేయకపోతే, కేసు విచారణ ప్రక్రియ ముగిసే వరకు ముందస్తు బెయిల్ చెల్లుతుంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ముందస్తు బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చవచ్చు.

అండర్‌ ట్రయల్ ఖైదీని ఎన్ని రోజుల వరకు అదుపులోకి తీసుకోవచ్చు?
వ్యక్తులపై మోపిన ఆరోపణలు నిజమేనని తేలితే కోర్టులు శిక్ష విధిస్తాయి. కానీ విచారణ పూర్తి కాకుండా పోలీసుల అదుపులో ఉండేవారికి.. నేరం రుజువైనప్పుడు కోర్టులు విధించే శిక్షలో సగం శిక్షను అనుభవించిన తరువాత బెయిల్ మంజూరు చేయాలి. సీఆర్‌పీసీలోని సెక్షన్ 436A ప్రకారం వారికి బెయిల్ మంజూరు చేస్తారు.

నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినవారు బెయిల్ పొందవచ్చా?
నాన్ బెయిలబుల్ నేరాలకు పాల్పడ్డవారు కూడా బెయిల్ పొందవచ్చు. అయితే ఇది నేరం తీవ్రత, కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. సెషన్స్ కోర్టు లేదా హైకోర్టుకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

 బెయిల్‌కు అవకాశం ఉండే నేరాలకు పాల్పడ్డవారు కచ్చితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలా?
బెయిలబుల్ నేరానికి పాల్పడ్డవారు కచ్చితంగా బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ఇందుకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీన్ని పోలీసులు ఇస్తారు.

కోర్టులు ఎప్పుడు బెయిల్ తిరస్కరించవచ్చు?
మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు నమ్ముతున్న నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేయవు. ఇంతకుముందు మరణశిక్ష, జీవిత ఖైదు, ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన నేరానికి పాల్పడిన వారికి.. గతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లో దోషిగా తేలిన వారికి బెయిల్ ఇవ్వరు.

బెయిల్ రద్దు అంటే ఏంటి?
బెయిల్ మంజూరు చేసిన తరువాత, దాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది. సీఆర్‌పీసీలోని సెక్షన్ 437 (5), సెక్షన్ 439 (2) ప్రకారం కోర్టులకు ఈ అధికారం ఉంది. బెయిల్ రద్దు చేయడానికి కారణాలను గుర్తించి, ఇప్పటికే ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు కోర్టులు ఆదేశాలు ఇవ్వవచ్చు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు