హోమ్ /వార్తలు /Explained /

Explained: అంబర్‌గ్రిస్‌ అంటే ఏంటి..? దానికి ఎందుకంత డిమాండ్.. ఫ్లోటింగ్ గోల్డ్ అని ఎందుకు పేరు..?

Explained: అంబర్‌గ్రిస్‌ అంటే ఏంటి..? దానికి ఎందుకంత డిమాండ్.. ఫ్లోటింగ్ గోల్డ్ అని ఎందుకు పేరు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సముద్రంలో (Sea) ఎనలేని మత్స్యసంపద ఉంటుంది. అప్పుడప్పుడు మునిగిపోయిన షిప్పులు, బోట్లకు సంబంధించి నిధులు వలకు చిక్కుతుంటాయి. కానీ తిమింగలం నుంచి వచ్చే అరుదైన పదార్ధం కొందర్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. దానినే అంబర్ గ్రిస్ (Ambergris) అంటారు.

ఇంకా చదవండి ...

సముద్రంలో ఎనలేని మత్స్యసంపద ఉంటుంది. అప్పుడప్పుడు మునిగిపోయిన షిప్పులు, బోట్లకు సంబంధించి నిధులు వలకు చిక్కుతుంటాయి. కానీ తిమింగలం నుంచి వచ్చే అరుదైన పదార్ధం కొందర్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. దానినే అంబర్ గ్రిస్ అంటారు. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే అంబర్‌గ్రిస్‌ (Ambergris) అనే సమ్మేళనానికి మార్కెట్‌లో భారీ విలువ ఉంటుంది. తిమింగళాల కడుపులో తయారయ్యే ఈ పదార్థాన్ని అవి వాంతి లేదా మలం ద్వారా బయటకు పంపుతాయి. ఇలా సముద్రంలో తేలియాడే అంబర్‌గ్రిస్‌ అప్పుడప్పుడు మత్స్యకారులకు దొరుకుతుంది. అయితే పుణే-పింప్రి చించ్‌వాడ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇటీవల ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 550 గ్రాముల అంబర్‌గ్రిస్‌ స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఫ్లోటింగ్‌ గోల్డ్ లేదా తేలియాడే బంగారం అని కూడా అంటారు.

ఎలా లభిస్తుంది..?

అంబర్‌ గ్రిస్‌ అంటే ఫ్రెంచ్‌ భాషలో గ్రే అంబర్‌ అంటే బూడిద కాషాయం అని అర్థం. మైనంలా ఉండే ఈ పదార్థం స్పర్మ్ తిమింగళాల (sperm whales) జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా తయారవుతుంది. చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు. భారీ స్థాయిలో ఉండే సముద్ర జీవులను స్పర్మ్ వేల్స్ మింగినప్పుడు, వాటిల్లో ఉండే కఠినమైన, పదునైన వస్తువులను బయటకు పంపించేందుకు, వాటి కదలికలను మెరుగుపరిచేందుకు అంబర్‌గ్రిస్ సాయం చేస్తుంది. కొన్నిసార్లు ఈ అంబర్‌గ్రిస్‌ మలం తరహాలో బయటకు వస్తుంది. దానికి తీవ్రమైన మలం వాసనతో పాటు తీవ్రమైన సముద్రపు వాసన కూడా ఉంటుంది.

నీలి తిమింగలాలతో పోల్చితే స్మర్మ్ వేల్స్‌ ఆకారంలో చిన్నవి. కానీ వీటి మెదడు భారీ స్థాయిలో ఉంటుంది. ఈ సృష్టిలో అత్యంత భారీ మెదడు కలిగిన ప్రాణులుగా స్మర్మ్ వేల్స్‌కు గుర్తింపు ఉంది. వీటి కడుపులో నుంచి అప్పుడే వెలువడే అంబర్‌ గ్రిస్ లేత పసుపు వర్ణంలో కొవ్వుతో ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది మైనంలా మారి ముదురు గోధుమ రంగు సంతరించుకుంటుంది. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన కూడా ఉంటుంది.

ఎందుకంత విలువ..?

స్వచ్ఛత, నాణ్యతను బట్టి ఈ అంబర్‌గ్రిస్‌ కిలోగ్రాము విలువ రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఇటీవలి దీన్ని స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్..

ఇది అత్యంత అరుదుగా లభిస్తుంది కాబట్టి దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధర పలుకుతుందని అధికారులు అంటున్నారు. సెంట్లు, పర్ఫ్యూమ్‌లు, ఇతర పరిమళాల తయారీలో అంబర్‌గ్రిస్‌ను ఉపయోగిస్తారు. పాత కాలపు సంస్కృతిలో దీన్ని ఆహారంలో రుచి కోసం వాడారు. మద్యం, పొగాకుతో కలిపి కూడా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం, అలాంటి అవసరాలకు దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.

చాలా దేశాల్లో నిషేధం..

అంబర్‌గ్రిస్‌ వ్యాపారం, అమ్మకంపై దాదాపు 40 దేశాల్లో నిషేధం ఉంది. పుణేలో స్వాధీనం చేసుకున్న అంబర్‌గ్రిస్‌ కర్ణాటక తీర ప్రాంతం నుంచి సేకరించినది అయి ఉంటుందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంబర్‌గ్రిస్‌ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లోనే లభిస్తుంది. మధ్య ప్రాచ్య దేశాలు, కొన్ని యూరోపియన్‌ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి బాగా డిమాండ్‌ చేస్తుంది. దీన్ని లైంగిక ఉద్దీపన కోసం ఔషధాల్లో ఉపయోగిస్తారనే సమాచారం కూడా ఉంది.

భారతదేశంలో చట్టపరమైన చర్యలు

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియాలో అంబర్‌ గ్రిస్‌ కలిగి ఉండటం, వ్యాపారం చేయడంపై నిషేధం ఉంది. కానీ చాలా దేశాల్లో దీన్ని వ్యాపార వస్తువుగా పరిగణిస్తారు. అంబర్‌ గ్రిస్ కోసం స్పర్మ్ వేల్స్‌ను వేటాడే అవకాశాలు సైతం ఉన్నాయి. చాలామంది చనిపోయిన స్పర్మ్ వేల్స్ కడుపులో నుంచి అంబర్‌ గ్రిస్‌ ను సేకరిస్తారు. అయితే భారతదేశంలో అటవీ జంతువుల సంరక్షణ చట్టం షెడ్యూల్‌ 2 కింద స్పర్మ్ వేల్స్ అనేవి రక్షిత జీవులు. అంతే కాదు వాటికి సంబంధించిన పదార్దాలు వాటి ఉప ఉత్పత్తులు సహా అంబర్‌ గ్రిస్‌ ను కలిగి ఉండటం అటవీ జంతువుల సంరక్షణ చట్టం, 1972 ప్రకారం అక్రమం.

ఇటీవల స్మగ్లర్లు అరెస్ట్..

పింప్రీ-చించ్‌ వాడ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 550 గ్రాముల అంబర్‌ గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.1 కోట్లు ఉంటుందని అంచనా. నాసిక్‌కు చెందిన నిందితులు అంబర్ గ్రిస్ ను కొనేవారి కోసం వెతుకుతూ పుణేకు వచ్చి, పోలీసులకు చిక్కారు. ఈ ఏడాది ఆగస్టు లో పుణే అటవీ విభాగం అధికారులు ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడు కేజీల అంబర్‌గ్రిస్‌ స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, తమిళనాడు, కేరళలో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో అంబర్‌గ్రిస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కూడా అంబర్ గ్రిస్ ను విక్రయించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published by:Purna Chandra
First published:

Tags: India news, International news

ఉత్తమ కథలు