Fungal Infection: ఫంగస్ ఇన్ఫెక్షన్లు​ ఎలా సోకుతాయి? ఇవి ప్రాణాంతకమా? ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

Fungal Infections: ఫంగస్​లు ఎలా సోకుతాయి? వీటి లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు తెలుసుకుందాం.

  • Share this:
ఓ పక్క కరోనా భయం వెంటాడుతుండగా.. ఇప్పుడు, బ్లాక్​ ఫంగస్​ టెన్షన్ పట్టుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు బ్లాక్​ ఫంగస్, వైట్​ ఫంగస్​, ఎల్లో ఫంగస్​ ఇలా రకరకాల ఫంగస్​ల బారీన పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపే ఈ ఫంగస్​లు ముప్పేట దాడి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఈ ఫంగస్​లు ఎలా సోకుతాయి? వీటి లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు తెలుసుకుందాం.

1. బ్లాక్​ ఫంగస్, వైట్​ ఫంగస్ అంటే ఏమిటి?
a. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఒక రకమైన ఫంగల్​ ఇన్ఫెక్షన్. ఇది వైరస్​ సోకిన కణజాలాల్లో బ్లాక్ రంగు చారలను ఏర్పరుస్తుంది. ఇక, వైట్ ఫంగస్ కూడా ఒక రకమైన ఫంగల్​ ఇన్ఫెక్షన్. ఇది సోకిన వ్యక్తి కణజాలల్లో తెలుపు రంగు చారలు కనిపిస్తాయి.

2. ఎలా సోకుతుంది?
a. ఇది ప్రధానంగా గాలిలో ఉండే ఫంగల్​ స్పోర్స్​ను పీల్చకోవడం ద్వారా సంక్రమిస్తుంది. ఇది చర్మంపై ఉండే గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

3. ఈ ఫంగస్​ ఎక్కడ నుండి సోకుతుంది?
a. ఇతర సూక్ష్మజీవుల మాదిరిగా, ఈ ఫంగస్​ కూడా గాలిలోనే ఉంటుంది. ఇది సాధారణంగా ముక్కు, శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

4. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందా?
a. అవును. ఫంగస్​ బీజాలు గాలిలో ఉంటాయి. అందువల్ల, దీని వ్యాప్తిని నివారించడం దాదాపు అసాధ్యం.

5. ఫంగస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించగలదా?
a. లేదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు.

6. మనందరికీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా?
a. బ్యాక్టీరియా లేదా ఫంగస్ గాలిలో ఉన్నందున అవి మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. అయితే, ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుటికీ మనలోని ఇమ్యూనిటీ ఫంగస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. ఈ ఇమ్యూనిటీ సూక్ష్మజీవులతో పోరాడుతుంది. ఇది ఫంగస్​ వ్యాప్తిని అడ్డుకుంటుంది. అందువల్ల, ఇమ్యూనిటీ లేని వారు బ్లాక్​ ఫంగస్​ బారిన పడే అవకాశాలు ఎక్కువ.

7. ఫంగస్​ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ?
a. తగినంత ఇమ్యూనిటీ లేని వ్యక్తులకు వైరస్​ సోకే ప్రమాదం ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, మధుమేహం, మూత్రపిండ సమస్యలు, కాలేయ వ్యాధి, సిఓపిడి, ఉబ్బసం, టిబి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ఉన్న వారిలో సహజంగా ఇమ్మూనిటీ తక్కువగా ఉంటుంది. వారికి వైరస్, ఫంగస్​​ సంక్రమణ ప్రమాదం ఎక్కువ. అదేవిధంగా, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, దీర్ఘకాలం యాంటీబయాటిక్​లు వాడే వారు, బలమైన పోషకాహారం తీసుకోని వారు, పొగాకు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారిలో కూడా ఫంగస్​ సోకే ప్రమాదం ఎక్కువ.

8. కరోనా సోకిన ప్రతి రోగికి​ ఫంగస్ సంక్రమిస్తుందా?
a. బ్లాక్​, వైట్​ ఫంగస్ అనేది చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్​ కరోనా నుంచి కోలుకున్న వారందరికీ సోకదు.

9. కరోనా రోగుల్లోనే ఈ ఇన్ఫెక్షన్​ ఎందుకు పెరుగుతోంది?
a. కరోనా సోకడం ద్వారా రోగి శరీరంలోని ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు కరోనా చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ రోగి రక్తంలోని లింఫోసైట్ల సంఖ్యను తగ్గిస్తాయి. మన శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్​, ఫంగస్ వంటివి చేరకుండా ఇవి రక్షణగా నిలుస్తాయి. లింఫోసైట్ల సంఖ్య తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్​ సంక్రమణ ప్రమాదం ఎక్కువ. ఇక మరోవైపు, కరోనా నుంచి కాపాడుకునేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్ ఫంగల్​ ఇన్షెక్షన్​ పెరిగేందుకు దోహదం చేస్తాయి. అందుకే వీటిని అవసరం మేరకే వాడాలి.

10. అయితే, కరోనా మందులను ఆపాలా?
a. కరోనా చికిత్సకు వాడే మందులు మీ ప్రాణాలను కాపాడతాయి. ఫంగస్​ సోకుతుందన్న భయంతో వీటికి దూరంగా ఉండకూడదు. అయితే, అవసరం లేకున్న వీటిని వాడటం మంచిది కాదు.

11. ఈ మందులు తీసుకున్నప్పటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించవచ్చా?
a. కరోనా లేదా ఇతర వ్యాధులకు వాడే మందులను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్‌ఎమ్‌పి) పర్యవేక్షణలోనే తీసుకోవాలి. వ్యాధి తీవ్రత లేకపోయినా సరే విపరీతంగా మందులు వాడితే ఇమ్యూనిటీ తగ్గి ఫంగల్​ ఇన్ఫెక్షన్​ వచ్చే అవకాశం ఉంటుంది.

12. ఫంగస్​కు ‘కద’ వంటి సహజ ఉత్పత్తులు కూడా కారణమా?
a. ఏదైనా అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తుంటాయి. కధ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఇవి యాంటీ బాక్టీరియల్, స్టెరాయిడ్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఇది అల్లోపతి మందు వలే పనిచేస్తుంది. దీనిలో జింక్, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఫంగల్​ ఇన్ఫెక్షన్​ పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందుకే, అవసరం మేరకే ఈ సహజ ఉత్పత్తులను వాడాలి.

13. కరోనా లేకున్నా సరే ఫంగల్​ ఇన్ఫెక్షన్​ సోకుతుందా?
a. అవును. కరోనా సోకనప్పటికీ బ్లాక్​ ఫంగస్​ సోకే ప్రమాదం ఉంది. తక్కువ ఇమ్యూనిటీ గల వ్యక్తులు దీని బారీన పడే అవకాశం ఉంది.

14. బ్లాక్ ఫంగస్ ఇన్​ఫెక్షన్ ప్రాణాంతకమా?
a. అవును. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చాలా అరుదైన ఇన్ఫెక్షన్​. ఇది ప్రాణాంతమైంది.

15. బ్లాక్​ ఫంగస్ లక్షణాలేంటి?
a. ఫంగస్​ సోకిన ప్రాంతాన్ని బట్టి, లక్షణాలను బట్టి ఈ ఇన్ఫెక్షన్​ సంభవిస్తుంది. వాటిని పరిశీలిద్దాం.
రినో ఆర్బిటాల్​ సెరీబ్రల్ ముకోర్మైకోసిస్
గాలిలోని ఫంగల్​ స్పోర్స్​ను పీల్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్​ సంభవిస్తుంది. ఇది ముక్కు, కళ్లు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత, మెదడుకు వ్యాపిస్తుంది. కాగా, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస వదలడంలో ఇబ్బంది, సైనస్‌లో నొప్పి, ముక్కులో రక్తస్రావం, ముఖం మీద వాపు, ముఖంపై సంచలనం లేకపోవడం, చర్మం రంగు మారడం వంటివి బ్లాక్​ ఫంగస్​ ప్రధాన లక్షణాలు.
పల్మనరీ మ్యూకోమైకోసిస్
గాలిలోని ఫంగల్​ స్పోర్స్​ను పీల్చుకున్నప్పుడు శ్వాసకోశ వ్యవస్థకు అది చేరుకుంటుంది. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, ఛాతీ నొప్పి, దగ్గు, దగ్గు ద్వారా రక్తం పడిపోవడం వంటివి ఈ ఫంగస్​ ప్రధాన లక్షణాలు.

16. బ్లాక్​ ఫంగస్ ఇన్ఫెక్షన్​ను గుర్తించే పద్ధతులేంటి?
a. బ్లాక్ ఫంగస్​ను క్లినికల్ టెస్ట్​, MRI సీటీ స్కాన్ వంటి పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు. దీని సంక్రమణను నిర్ధారించడానికి, బయాప్సీ చేయాల్సి ఉంటుంది.

17. దీనికి చికిత్సా ఉందా?
a. ఉంది. యాంఫోటెరిసిన్, పోసాకోనజోల్ వంటి కొన్ని యాంటీ ఫంగల్ మందులతో బ్లాక్​ ఫంగస్​ చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స డీబ్రిడ్మెంట్ అవసరం కూడా ఏర్పడుతుంది. దీని ద్వారా వైరస్​ సోకిన కణజాలాన్ని తొలగిస్తారు.

18. వైట్​ ఫంగస్ సంక్రమణ ప్రాణాంతకమా?
a. కాండిడియాసిస్ లేదా వైట్​ ఫంగస్ ప్రాణాంతకం కాదు.

19. వైట్​ ఫంగస్​కు చికిత్స ఉందా?
a. ఉంది. కాండిడియాసిస్ లేదా వైట్ ఫంగస్​ను చాలా తక్కువ ఖరీదైన మందులతోనే చికిత్స చేయవచ్చు.

20. ఫంగస్​ నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
a. ముక్కు, నోటి ద్వారా మన శరీరంలోకి ఫంగస్​ ప్రవేశించకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ ధరించడం ఉత్తమ మార్గం. మాస్క్​ను తరచుగా శుభ్రం చేయాలి. లేదా తరుచూ మారుస్తుండాలి. ఇక, ఏవైనా గాయాలైతే తక్షణమే నీటితో కడగాలి. RMP వైద్య పర్యవేక్షణలో కరోనా చికిత్స తీసుకోవాలి. ఎక్కవగా ఆవిరి పట్టడం, మందులు వాడటం వంటివి చేయవద్దు.
Published by:Shiva Kumar Addula
First published: