హోమ్ /వార్తలు /Explained /

Explained: బెంగాల్‌లో శాసన మండలి ఏర్పాటు సాధ్యమేనా? రాష్ట్రాలే ఏర్పాటు చేసుకోవచ్చా?

Explained: బెంగాల్‌లో శాసన మండలి ఏర్పాటు సాధ్యమేనా? రాష్ట్రాలే ఏర్పాటు చేసుకోవచ్చా?

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించినంత మాత్రాన శాసనమండలిని రద్దు చేయడం లేదా స్థాపించడం కుదరదు. వీటికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి.

పశ్చిమ బెంగాల్‌లో ఎగువ సభ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది. ప్రస్తుతం బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక.. మొత్తం ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండలి లేదా ఎగువ సభ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో శాసనమండలిని 50 సంవత్సరాల క్రితం, అప్పటి వామపక్ష పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇన్నేళ్ల తరువాత రాష్ట్రంలో మండలి ఏర్పాటుపై మమత పట్టుబడుతోంది. అయితే ఎగువ సభ ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య మరో యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.

* శాసన మండలి లేదా ఎగువ సభలు ఎలా ఏర్పడ్డాయి?

మన దేశంలో రెండు సభల ఏర్పాటుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటీష్ హయాంలో మోంటెగు- ఛెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటి ద్వారా 1919లో జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏర్పడింది. అనంతరం భారత ప్రభుత్వ చట్టం-1935లో.. ప్రావిన్సులలో రెండు సభల ఏర్పాటు అంశాన్ని చేర్చారు. ఈ చట్టం ప్రకారం 1937లో బెంగాల్‌లో శాసనమండలి ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తరువాత రాజ్యాంగం రూపొందించేటప్పుడు, రాష్ట్రాలలో రెండు సభలపై ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్యాంగ సభ(Constituent Assembly)లో శాసన మండలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంలో రాజ్యసభ ఉండాలని చెప్పినవారు సైతం, రాష్ట్రాల్లో ఎగువ సభ వ్యవస్థకు మద్దతు పలకలేదు.

రాష్ట్రాలలో ఎగువ సభ అనవసరమని బిహార్‌కు చెందిన ప్రొఫెసర్ కేటీ షా అప్పట్లో వాదించారు. మండలి సభ్యుల జీత భత్యాల ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడుతుందని చెప్పారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు శాసనం ద్వారా చేసే చట్టాలను.. పార్టీల ప్రతినిధులు మాత్రమే ఉండే ఎగువ సభ అడ్డుకునే అవకాశం సైతం ఉందని షా తెలిపారు. దీంతో అప్పట్లో బిహార్, బొంబాయి, మద్రాస్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలిని రాజ్యాంగ రూపకర్తలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రాల శాసనసభలో తీర్మానం ద్వారా కొత్త మండలిని ఏర్పాటు చేయడం.. లేదా ఇప్పటికే ఉన్న మండలిని రద్దు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక చట్టంపై రెండు సభల మధ్య విభేదాలు ఏర్పడితే, కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం శాసనసభలకు ఇచ్చింది. మండలి సభ్యుల సంఖ్యను సైతం రాజ్యాంగం పరిమితం చేసింది. శాసన సభలకు ఎన్నికైన సభ్యుల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే కౌన్సిల్‌లో ఉండాలని పేర్కొంది.

* పశ్చిమ బెంగాల్‌లో కౌన్సిల్ ఎప్పుడు రద్దు అయింది?

పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1969 వరకు ఉనికిలో ఉంది. కానీ అప్పటికి రెండేళ్ల ముందు ఎగువ సభలో జరిగిన సంఘటనలు, మండలి రద్దుకు దారితీశాయి. 1967లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో 14 పార్టీల కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అజోయ్ కుమార్ ముఖర్జీ, డిప్యూటీ సీఎం జ్యోతి బసుతో కలిసి ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ ఈ కూటమి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎనిమిది నెలల అనంతరం గవర్నర్ ధరం వీరా కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

ఈ క్రమంలో.. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ ఘోష్, మరోసారి కాంగ్రెస్ మద్దతుతో సీఎం పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు సభల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న మండలి మాత్రం, ఘోష్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం శాసనమండలి రద్దుకు దారితీసింది. 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తరువాత, రెండవ యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 32 పాయింట్ల కార్యక్రమం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. వీటిలో శాసనమండలిని రద్దు చేయడం కూడా ఉంది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మండలిని రద్దు చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం.. ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా శాసనమండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. లేదంటే అప్పటికే ఉన్న మండలిని రద్దు చేయవచ్చు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని 1969 మార్చిలో ఆమోదించింది. నాలుగు నెలల తరువాత, పార్లమెంటు ఉభయ సభలు ఈ చట్టాన్ని ఆమోదించాయి. పంజాబ్ కూడా అదే సంవత్సరం రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసింది.

* ఇతర రాష్ట్రాల్లో కౌన్సిల్‌లు ఉన్నాయా?

శాసనమండలి అనేది కాలక్రమంలో ఒక రాజకీయ అంశంగా మారింది. పార్టీలు, ప్రభుత్వాలు దీన్ని రాజకీయ సమస్యగానే చూస్తున్నాయి. తమిళనాడులో కౌన్సిల్‌ ఏర్పాటు అంశం 30 ఏళ్లుగా వివాదాస్పంగా ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వం 1986లో శాసన మండలిని రద్దు చేసింది. అప్పటి నుంచి కౌన్సిల్‌ను తిరిగి ఏర్పాటు చేయడానికి డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ చర్యలను అన్నా డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో సైతం, రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేస్తామని DMK మ్యానిఫెస్టోలో పేర్కొంది. 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సైతం ఇలాంటి హామీ ఇచ్చింది.

* ఏపీలో వివాదాస్పదం

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని 1958లో మొదటిసారి స్థాపించారు. ఆ తరువాత 1985లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఎగువ సభను రద్దు చేసింది. 2007లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మండలిని తిరిగి ఏర్పాటు చేసింది. గత సంవత్సరం టీడీపీ ఆధిపత్యం ఉన్న ఏపీ శాసనమండలి, ప్రభుత్వం రూపొందించిన మూడు క్యాపిటల్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సైతం శాసన సభ ఆమోదించింది.

* పార్లమెంటు ఆమోదిస్తేనే..

శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించినంత మాత్రాన శాసనమండలిని రద్దు చేయడం లేదా స్థాపించడం కుదరదు. వీటికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి. 2010లో అస్సాం అసెంబ్లీ, 2012లో రాజస్థాన్ అసెంబ్లీ సైతం తమ రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు చేయాలనే తీర్మానాలను ఆమోదించాయి. కానీ ఈ రెండు బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Mamata Banerjee, West Bengal

ఉత్తమ కథలు