• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • VIJAYAWADA KANAKADURGA TEMPLE EO POST CHANGING LIKE ROLLER COASTER AS 11 OFFICERS TRANSFERRED IN LAST 10 YEARS HERE ARE THE DETAILS PRN

Kanakadurga Temple: దుర్గమ్మ ఆలయం వివాదాలమయం... 10 ఏళ్లలో 11 మంది ఈవోలు...

విజయవాడ దుర్గగుడి (ఫైల్)

Andhra Pradesh: ఏ ఆలయంలో పనిచేసినా అధికారులకు దేవుడి కటాక్షం ఉంటుంది. కానీ దుర్గగుడిలో మాత్రం వివాదాలు బోనస్ గా వచ్చి చేరుతున్నాయి.

  • Share this:
    అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ. దుర్గమ్మని ఒక్కసారి దర్శిస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు భావిస్తారు. దుర్గమ్మ సేవలతో నిత్యం తరిస్తారు. భక్తులకు ఏమోగాని అధికారులకు మాత్రం దుర్గగుడి కలిసిరావడం లేదనే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన ఏ ఈవో కూడా పట్టమని రెండేళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. గత 10 ఏళ్లలో ఏకంగా 11 మంది ఈవోలు మారారు. ఏడాది దాటి రెండు మూడు నెలలయ్యే సరికి ఏదో వివాదం ఈవోలను చుట్టుముడుతోంది. దీంతో వారిపై బదిలీ వేటు పడుతోంది. ఇక్కడికి వచ్చిన ఈవోల్లో ఒక్కరు కూడా రెండు దసరా పండుగలు నిర్వహించలేదంటే అతిశయోక్తికాదు. గత ఆరేళ్లలో ఏకంగా ఏడుగురు ఈవోలు మారారు. వచ్చిన ప్రతి ఒక్కరూ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం.. అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతోంది. 2015లో దుర్గగుడి ఈవోగా వచ్చిన నర్సింగరావుకు.. ఉద్యోగులకు మధ్య వివాదం రేగింది. ఏకంగా ఓ అర్చకుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఉద్యోగులంతా ఈవోకు వ్యతిరేకంగా ఇంద్రకీలాద్రిపై ఆందోళనకు దిగడంతో ఆయన్ని బదిలీ చేశారు.

    నర్సింగరావు తర్వాత ఆలయానికి ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమించారు. ఐతే సూర్యకుమారి హయాంలో అంతా బాగానే ఉన్నా.. ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయనే ఆఱోపణలు కలకలం రేపాయి. ఇదే సమయంలో పాలకమండలితో వివాదాలు రావడంతో సూర్యకుమారిని బదిలీ చేయాల్సి వచ్చింది. సూర్యకుమారి తర్వాత దేవాదాయ శాఖ మకిషనర్ అనురాధాను ఇన్ ఛార్జ్ ఈవోగా నియమించగా.. కొన్నాళ్ల తర్వాత ఎం.పద్మ ఈవోగా వచ్చారు. ఐతే అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టుచీర మాయమవడం, పాలకమండలి సభ్యురాలిపైనే ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ వ్యవహారంతో పద్మను బదిలీ చేయాల్సి వచ్చింది.

    ఆమె తర్వాత ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది ప్రభుత్వం. కొన్నాళ్లపాటు ఎలాంటి వివాదాలు రాలేదు. ఐతే చీరల కౌంటర్లో ఓ ఉద్యోగి ఏకంగా రూ.70లక్షల స్కామ్ చేయడంతో వివాదం రేగింది. దీంతో ఆమె కూడా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఈవోగా సురేష్ బాబును ప్రభుత్వం నియమించింది. గతంలో ఏ ఈవోనూ చుట్టుముట్టనన్ని వివాదాలు సురేష్ బాబును చుట్టుముట్టాయి. ఆలయంలో సెక్యూరిటీ, శానిటైజేషన్ టెండర్లు, సరుకుల కొనుగోళ్లు, అన్నదాన విరాళాలు, చీరల కౌంటర్లలో అవకతవకలు, అమ్మవారి ఆస్తుల రిజిస్టర్ నిర్వహించకపోవడం లాంటి వివాదాలు రేగాయి. ఈవో సురేష్ బాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఆయన్ని బదిలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆదేశాలను ఉపసంహరించుకొని దేవాదాయశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

    స్థాయి పెంచినా మారని తీరు..
    దుర్గగుడికి 2010లో విజయ్ కుమార్ ఈవోగా వచ్చారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రఘునాథ్, ప్రభాకర్, త్రినాథరావు, నర్సింగరావు ఈవోలుగా పనిచేశారు. ఆ తర్వాత దుర్గగుడి స్థాయిని పెంచిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులే ఈవోలుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు వరుసగా నలుగురు ఐఏఎస్ అధికారులను ఈవోలుగా
    నియమించింది. ఐఆర్ఎస్ అధికారిణికి కూడా ఈవో బాధ్యతలు అప్పగించింది.

    వీరంతో ఈవోలుగా పనిచేసి సమయంలో అవినీతి ఆరోపణలు రాలేదు. ఇతర వివాదాల కాలణంగానే ఐఏఎస్ హోదా ఈవోలు బదిలీ అయ్యారు. ఐతే వీరి తర్వాత సురేష్ బాబును ఈవోగా నియమించిన ప్రభుత్వం ఐఏఎస్ ఈవో పద్ధతిని మార్చేసింది. ఇన్ ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న సురేష్ బాబును ఈవోగా నియమించారు. ఆ తర్వాత ఆయనకు ఆర్జేసీగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఐతే సురేష్ బాబు నియామకమే అక్రమమని ప్రతిపక్షాలు ఆరోపణలు కూడా చేశాయి. ఆయన చేసిన అక్రమాల వెనుక మంత్రి హస్తముందని కూడా విమర్శించాయి.
    Published by:Purna Chandra
    First published: