Home /News /explained /

VIJAYAWADA JUSTICE NV RAMANA INVOLVED IN KEY VERDICTS DURING HIS CAREER AS SUPREME COURT JUSTICE FULL DETAILS HERE PRN

Justice NV Ramana: నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ట్రాక్ రికార్డ్ ఇదే.. సంచలన తీర్పుల్లో కీలక పాత్ర..

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం

Chief Justice of India: సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. విద్యార్థి పోరాటం కోసం ఓ ఏడాది చదువును కూడా కోల్పోయారు.

  భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిల్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26న పదవీ విరమణ చేసేంత వరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. జస్టిస్ రమణ పూర్తిపేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం. జస్టిస్ రమణ 1983 ఫిబ్రవరి 10న బార్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు. కెరీర్‌లో ఎన్నో ప్రధాన తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం.

  * సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్, 2019
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని చెప్పిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. జస్టిస్ రంజన్ గొగోయ్, ఎన్.వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది.

  * నబమ్ రెబియా, బమాంగ్ ఫెలిక్స్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్, 2016
  ముఖ్యమంత్రి, మంత్రి మండలి, స్పీకర్‌లను సంప్రదించకుండా.. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, దీపక్ మిశ్ర, మదన్ బి లోకూర్, పీసీ హోష్, రమణలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. గవర్నర్ ఉత్తర్వులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, ఆర్టికల్ 174ల ఉల్లంఘన కిందికి వస్తాయని ధర్మాసనం పేర్కొంది.

  * ఆదిశైవ శివాచారియార్గల్ నల సంఘం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2016
  దేవాలయాల్లో అర్చకుల నియామకం ఆగమశాస్త్రానికి అనుగుణంగా, రాజ్యాంగ పరమైన ఆదేశాలు, సూత్రాలకు అనుగుణంగా ఉండాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. అర్చకులను నియమించడం లేదా తొలగించడం ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు రాదని వ్యాఖ్యానించింది.

  * ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్, 2020
  జమ్మూ కశ్మీర్‌లో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించాలన్న డిమాండ్‌పై జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ రమణ, ఆర్.సుభాష్ రెడ్డి, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ డిమాండ్‌పై ఇలా స్పందించింది.

  * మహిళలు చేసే ఇంటిపని, వారి భర్తలు ఆఫీసుల్లో చేసే పనులకంటే ఏమాత్రం తక్కువ కాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. జస్టిస్ రమణ 2001లో లతా వాధ్వా కేసులో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక కార్యక్రమంలో అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని పరిష్కరించారు.

  * ఎండీ.అన్వర్ వర్సెస్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, 2020
  మానసిక అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడం వంటి వ్యాధుల కారణంగా తమను తాము డిఫెన్స్ చేసుకునే వ్యక్తులు కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఎన్.వీ.రమణ, ఎస్.ఏ నజీర్, సూర్యకాంత్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మానసిక రుగ్మతలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 84ని నిర్వచిందింది. ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిరూపించాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

  * జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, 2017
  ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై రాష్ట్రాలు విధించే ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లుబాటును సమీక్షించిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. తొమ్మిదిమందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 7:2 మెజారిటీతో ఎంట్రీ ట్యాక్స్ విధానాన్ని సమర్థించింది. జస్టిస్ టీ.ఎస్.ఠాకూర్, ఎ.కె. సిక్రీ, ఎస్.ఎ. బాబ్డే, శివ కీర్తి సింగ్, ఎన్.వి.రమణ, ఆర్. బానుమతి, ఏ.ఎం.ఖాన్విల్కర్, జెజెలతో కూడిన ధర్మాసనం మెజారిటీ అభిప్రాయాన్ని వెల్లడించింది.

  * అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2020
  జమ్మూ కశ్మీర్‌లో టెలికాం, ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షల ఉత్తర్వులను వారం రోజుల్లో సమీక్షించాలని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని జస్టిస్ రమణ, ఆర్.సుభాష్ రెడ్డి, బీఆర్ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Supreme Court

  తదుపరి వార్తలు