హోమ్ /వార్తలు /Explained /

ప్రాణాంతకంగా మారుతున్న కొత్త వైరస్ స్ట్రెయిన్.. ఎవరూ ఊహించని విధంగా..

ప్రాణాంతకంగా మారుతున్న కొత్త వైరస్ స్ట్రెయిన్.. ఎవరూ ఊహించని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌లో నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య పాత, కొత్త వైరస్ వేరియంట్లు వ్యాపించాయి. దీంతో ఈ సమయంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులను విశ్లేషించామని అధ్యయన బృంద సభ్యుడు లియాన్ డానోన్ తెలిపారు

కరోనా వైరస్ వెలుగుచూసి సంవత్సరం దాటిపోయింది. వైరస్ వ్యాప్తి, తీవ్రతపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వేగంగా రూపాంతరం చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రమాదకారిగా మారుతోందని గత పరిశోధనల్లో గుర్తించారు. జన్యుక్రమం మార్చుకుంటున్న వైరస్ తీవ్రత ఊహించని విధంగా పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత ఏడాది బ్రిటన్‌లో కనుగొన్న UK వేరియంట్ కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువని పరిశోధకులు కనుగొన్నారు. పాత స్ట్రెయిన్ల కంటే UK వేరియంట్ 30 నుంచి 100 శాతం ప్రాణాంతకమని వారు గుర్తించారు. ఎక్సెటర్ యూనివర్సిటీ, బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు. దీన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనం కోసం పాత వైరస్ స్ట్రెయిన్, UK వైరస్ స్ట్రెయిన్ సోకిన వారిలో మరణాల శాతాన్ని పోల్చి చూశారు. B.1.1.7 అనే ఈ కొత్త రకం UK వేరియంట్‌ సోకిన 54,906 మంది రోగులను పరిశీలించారు. అదే సంఖ్యలో మామూలు వైరస్ స్ట్రెయిన్ సోకినవారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కొత్త స్ట్రెయిన్ కారణంగా 227 మంది చనిపోయారు. పాత వైరస్‌కు చికిత్స తీసుకుంటూ 141 మంది చనిపోయారని గుర్తించారు. దీన్ని బట్టి మరణాల ప్రమాదాన్ని అంచనా వేశారు.

* బ్రిటన్‌లో ఎక్కువ కేసులు

B.1.1.7 వైరస్ స్ట్రెయిన్‌ను బ్రిటన్‌లోని కెంట్ ప్రాంతంలో కనుగొన్నారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటిసారి దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి బ్రిటన్‌లో ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించారు. కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లో అనేక ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్) ఉన్నాయి. వీటిల్లో B.1.1.7 వైరస్ స్ట్రెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటోందని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన పరిశోధకుడు, అధ్యయన బృంద సభ్యుడు రాబర్ట్ చాలన్ చెప్పారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తే రానున్న రోజుల్లో ఇది తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు.

* పెరుగుతున్న వైరస్ సామర్థ్యం

బ్రిటన్‌లో నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య పాత, కొత్త వైరస్ వేరియంట్లు వ్యాపించాయి. దీంతో ఈ సమయంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులను విశ్లేషించామని అధ్యయన బృంద సభ్యుడు లియాన్ డానోన్ తెలిపారు. దీనివల్ల పాత స్ట్రెయిన్, కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రమాద శాతాన్ని పోల్చగలిగామని వివరించారు. కరోనా వైరస్ రూపాన్ని వేగంగా మార్చుకుంటోందని అధ్యయనంలో గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల రోగ నిరోధకతను తట్టుకుంటూ.. వైరస్ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందని లియాన్ చెబుతున్నారు.

* మరిన్ని ప్రయోగాలు అవసరం

కొత్త వైరస్ స్ట్రెయిన్ ఇప్పటికే 100 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్లను గుర్తించేందుకు విస్తృతంగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తాజా అధ్యయనం కొత్త వేరియంట్ వ్యాప్తిని నిరోధించే మార్గాలను గుర్తించిందని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ ప్రకటించింది.

First published:

Tags: Corona virus, Covid-19, UK Virus

ఉత్తమ కథలు