TO GIVE OR NOT TO GIVE BOOSTERS WHY EXPERTS SAY WE NEED TO GO EASY ON EXTRA SHOTS MK GH
Covid Vaccine: బూస్టర్ డోస్‌పై పలు దేశాల దృష్టి..మూడో టీకా డోసు అందరికీ అవసరమా..
(ప్రతీకాత్మక చిత్రం)
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఛైర్మన్ అదార్ పూనావాలా గత నెలలో అనేక మంది ఉద్యోగులతో కలిసి టీకా మూడో డోసు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్, ఇతర ప్రమాదకరమైన మ్యూటేషన్లను నియంత్రించేందుకు పలు దేశాలు ప్రజలకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించాలని నిర్ణయించాయి. ఈ బూస్టర్ డోస్‌ల వల్ల డెల్టా వేరియంట్ నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందని ఆయా దేశాలు బలంగా నమ్ముతున్నాయి. అయితే నిజంగా బూస్టర్ అవసరం ఉందా? రెండు డోసులతో కరోనాను నియంత్రించలేమా? అనే విషయంపై డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. ప్రజలందరికీ బూస్టర్ డోస్‌లు అవసరం లేదని వారి అధ్యయనంలో తేలింది.
ఇప్పుడు తీసుకుంటున్న రెండు డోసుల వ్యాక్సిన్ కరోనాపై బాగానే ప్రభావం చూపుతుందని పరిశోధనలలో వెల్లడైంది. వారి అధ్యయన ఫలితాలు ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం అనేక పేద దేశాలు తమ మొత్తం జనాభాకు వ్యాక్సిన్లను సమకూర్చడంలో ఇబ్బందులు పడుతున్నాయని, ముందుగా ఆయా దేశాలకు వ్యాక్సిన్లు సప్లై చేయాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను కోరింది.
బూస్టర్ డోస్‌లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజానీకానికి బూస్టర్ డోస్ ఇవ్వడం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ‘‘మనుషుల్లో క్షీణిస్తున్న రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాక్సిన్లు మంచి ఆప్షన్‌గా అనిపించవచ్చు. కానీ వ్యాక్సిన్ల ప్రభావం అందర్లోనూ ఒకేలా ఉండదు. ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి గల వారికి మాత్రమే బూస్టర్ డోస్ అవసరం ఉంటుంది. అయితే బూస్టర్ డోస్‌లు విస్తృతంగా ఇస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కలుగజేస్తాయి’’ అని సౌమ్య చెప్పారు.
ఒకే వ్యక్తి మూడు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకోవడం కన్నా సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయడమే ప్రస్తుత సమస్యకు ఏకైక పరిష్కారమని సౌమ్య తెలిపారు. బూస్టర్ డోస్ ఇవ్వడం కన్నా వ్యాక్సిన్ అందని ప్రాంతాలకు వీటిని సరఫరా చేయడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కొత్త వేరియంట్ల పుట్టుకను నివారించవచ్చని, తద్వారా కరోనాను పూర్తిగా అదుపులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.
డెల్టా వేరియంట్‌పై తక్కువ ప్రభావం
ప్రస్తుతం వాడుతున్న వ్యాక్సిన్లు కరోనావైరస్కు వ్యతిరేకంగా తక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే తక్కువ మందిపై చేసిన పరిశీలన కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ, టీకాలు తీసుకోవడం ద్వారా కరోనా ఉదృతి తగ్గిందనేది వాస్తవం. అయితే ఇబ్బడిముబ్బడిగా మూడో డోస్ తీసుకోవడం ద్వారా కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్ఫా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌పై టీకాల ప్రభావం కొంత తక్కువగా ఉన్నప్పటికీ, వ్యాక్సిన్లు మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బూస్టర్ డోసులు పూర్తిగా అవసరం లేదా?
బూస్టర్ డోసులు అసలు ఎవరికీ అవసరం లేదని చెప్పలేం. మొదటి రెండు డోసుల ద్వారా రోగనిరోధక శక్తి పెరగని వారికి బూస్టర్ షాట్లు అవసరమని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది చాలా కొద్ది మందిలోనే జరుగుతుంది. తక్కువ సమర్థత కలిగిన వ్యాక్సిన్లను స్వీకరించిన వారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మాత్రమే మూడో డోసు అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టీకాలను మొదటి, రెండో వేవ్‌ను అంచనా వేసి వాటికి వ్యతిరేకంగా రూపొందిచారు. అందువల్ల, ఇవి మూడో వేవ్‌పై ప్రభావం చూపిస్తాయా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
అంటే, బూస్టర్ డోస్‌లు కొత్త వేరియంట్‌పై పనిచేసే విధంగా ఉంటేనే ఫలితం ఉంటుంది. వాటిని కొత్త వేరియంట్లను లక్ష్యంగా చేసుకొని రూపొందించాలి. ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ల విషయంలో ఉపయోగించే వ్యూహాన్ని ఇక్కడ కూడా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
బూస్టర్ డోస్ వల్ల ఉపయోగాలున్నాయా?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే ఇప్పటికీ అనేక పేద దేశాల్లో సరైన రీతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడం లేదని, వీలైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి టీకాలు వేయవలసిన అవసరం ఉందని వారు నొక్కి చెబుతున్నారు. ఒకే వ్యక్తికి మూడు వ్యాక్సిన్లు ఇవ్వడం కంటే.. అసలు వ్యాక్సిన్ తీసుకోని వారికి ముందుగా ప్రాధాన్యతనివ్వడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని, తద్వారా మరిన్ని ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం చాలా దేశాలను కరోనా థర్డ్ వేవ్ వణికిస్తోంది. అందుకే అక్కడ ఇన్ఫెక్షన్ల పెరుగుదల ఎక్కువగా నమోదవుతోంది. దీంతో, బూస్టర్ డోస్ వేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కరోనా వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి, యాంటీబాడీలను పెంచుకోవడానికి ఇదొక్కటే పరిష్కారమని భావిస్తున్నాయి.
ఏయే దేశాలు బూస్టర్ డోస్‌లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి?
అనేక సంపన్న దేశాలు ఇప్పటికే బూస్టర్ షాట్లను అందించడానికి ప్రణాళికలు రూపొందించాయి. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతిఒక్కరికీ, ఇతర బలహీనమైన వ్యక్తులకు మూడవ డోస్ ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, అమెరికా కూడా తమ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి, అమెరికాలో ఉపయోగిస్తున్న మోడెర్నా లేదా ఫైజర్- వ్యాక్సిన్ల రెండు డోస్‌లు పూర్తయిన ఎనిమిది నెలల తర్వాత ఈ బూస్టర్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఛైర్మన్ అదార్ పూనావాలా గత నెలలో అనేక మంది ఉద్యోగులతో కలిసి టీకా మూడో డోసు తీసుకున్నట్లు పేర్కొన్నారు. "ఆరు నెలల తర్వాత, యాంటీబాడీస్ తగ్గుతాయి. అందుకే నేను ఈ బూస్టర్ డోసు తీసుకున్నాను. ఏడు నుంచి ఎనిమిది వేల మంది సిబ్బందికి సైతం మూడో డోస్ ఇచ్చాం. ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ (మూడవ డోస్) తీసుకోవాలనేది నా అభ్యర్థన" అని పేర్కొన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.