Andhra Pradesh: పనబాక పోటీలో ఉన్నట్టా? లేనట్టా? ఈ నెల 24న రానున్న క్లారిటీ: లీడర్లపై చంద్రబాబు నిప్పులు

పనబాక పోటీలో ఉన్నట్టా? లేనట్టా?

తిరుపతి సీటుపై తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే పూర్తిగా క్లాస్ పీకిటనట్టు తెలుస్తోంది. ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ రోజైనా పనబాక తెరపైకి వస్తారో లేదో అనే ఆసక్తి పెరుగుతోంది.

 • Share this:
  పంచాయతీ.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో టీడీపీ బోర్లా పడింది. ఇంకా ఒకటి, రెండు దెబ్బులు తగిలితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. అధిష్టానం మాట వినే నేతలు, కేడర్ కనుమరుగవుతారు. పార్టీని కాపాడేదెవరు అంటూ ఆపసోపాలు పడుతున్న వేళ.. టీడీపీకి మరో సవాల్ ఎదురవుతోంది. అదే తిరుపతి లోక్ సభ బై పోల్. ఈ ఉప ఎన్నిక టీడీపీకి డూ ఆర్ డై లాంటింది. ఓడితే ఇక టీడీపీ కనుమరుగైనట్టే అనే ప్రచారం పెరుగుతుంది. దానికి తోడు సీనియర్ లీడర్లను పక్కన పెట్టాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే నినాదా ఊపందుకుంది. అదే జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు భయపడుతున్నట్టు తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు తప్పని సరి అయ్యింది టీడీపీకి..

  అందుకే ఈ ఒక్క సీటుపై తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే పూర్తిగా క్లాస్ పీకిటనట్టు తెలుస్తోంది. ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిని ముందుగానే టీడీపీ ప్రకటించినా.. ఇప్పటి వరకు పనబాక లక్ష్మి తెరపైకి రాలేదు. అసలు ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారో లేరో తెలియక కేడర్ తికమక అవుతోంది. వైసీపీ నేతలు మాత్రం పదే పదే ప్రచారం చేస్తున్నారు. పనబాక పోటీ నుంచి తప్పుకున్నారాని.. టీడీపీకి అసలు అభ్యర్థే దొరకడం లేదని.. అందుకే ఆమెను బతిమాలుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విమర్శలు నిజమా కాదా అన్నది ఈ నెల 24న తేలిపోనుంది. ఆ రోజు పనబాకతో నామినేషన్ వేయించేందుకు టీడీపీ అధిష్టానం ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  తాజాగా తిరుపతి గెలుపు కోసం ఏం చేయాలి అనే దానిపై పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గల నేతలతో విడి విడిగా భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం పై చర్చించారు. దీనికితోడు, ఐదుగురుతో తిరుపతి ఉప ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ వేశారు చంద్రబాబు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బీద రవిచంద్ర, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని, తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని, రిజర్వేషన్లు, విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవన్నారు.

  వైసీపీ వైఫల్యాలపై కొన్ని ముఖ్య అంశాలను గుర్తించి వాటినే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా విభజించి, మొత్తం ఏడు నియోజకవర్గ వర్గాలకు 70 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇన్ చార్జ్ లుగా బాధ్యతలు ఇచ్చారు. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదన్నది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు.

  టీడీపీని గెలిపిస్తే, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల కోసం పోరాటం చేస్తామని.. టీడీపీ నేతలు హామీ ఇస్తామంటున్నారు. అలాగే ఈ నెల 24 న పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేసే ముందు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలను డూ ఆర్ డైగా భావించిన బరిలో దిగుతోంది టీడీపీ...

  ఇటు వైసీపీ సైతం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తిరుపతి ఉపఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న ఆ పార్టీ.. ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది.. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా ఏడుగురు మంత్రులను ప్రకటించింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, గూడూరుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంత్రి గౌతంరెడ్డిలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలు పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి రెండు పార్టీలు ఇక్కడ గెలుపు కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: