SWADES Skill cards- విదేశాల్లో ఉద్యోగం కోల్పోయారా? అయితే మీ కోసమే ఈ స్వదేశ్ స్కిల్ కార్డ్స్..

(ప్రతీకాత్మక చిత్రం)

స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్ మెంట్ సపోర్ట్ (SWADES) గా పిలిచే ఈ కార్యక్రమంలో భాగంగా వారి వివరాలను తీసుకొని వారికి ఓ కార్డును అందజేశారు. దీని ద్వారా ఒకవేళ వారికి తగిన ఉద్యోగం దేశంలోనే అందుబాటులో ఉంటే దాన్ని వారికి అందించేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

  • Share this:
కరోనా ప్రారంభమైన తర్వాత చాలా దేశాల నుంచి ఉద్యోగులు తిరిగి భారత్ కి చేరుకున్నారు. వందే భారత్ మిషన్ కింద ఎన్నో ఫ్లైట్లు ఏర్పాటు చేసి మరీ వారిని తిరిగి దేశానికి రప్పించింది ప్రభుత్వం. ఈ సమయంలో మన దేశానికి వచ్చిన ఉద్యోగుల వివరాలను తీసుకొని ఓ డేటాబేస్ సిద్ధం చేసింది ప్రభుత్వం. స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్ మెంట్ సపోర్ట్ (SWADES) గా పిలిచే ఈ కార్యక్రమంలో భాగంగా వారి వివరాలను తీసుకొని వారికి ఓ కార్డును అందజేశారు. దీని ద్వారా ఒకవేళ వారికి తగిన ఉద్యోగం దేశంలోనే అందుబాటులో ఉంటే దాన్ని వారికి అందించేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చిన వివరాలను తీసుకొని దాన్ని స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ మినిస్ట్రీ తో పంచుకుంది సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖ. ఈ మూడు మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ఇందులో భాగంగా 30,700 మంది రిజిస్టర్ చేసుకున్నారు.

దీని తర్వాత స్వదేస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరినీ వివిధ జాబ్ ఫెయిర్లలో అప్లై చేసుకోవడం, దగ్గర దేశాలకు పంపడం, స్కిల్ ఇండియా ఎంప్లాయిమెంట్ ఇనిషియేటివ్ ద్వారా వారికి ఉద్యోగాలు అందించడం వంటివి ఇంకా చేయాల్సి ఉంది.

ఏంటీ స్వదేశ్ (SWADES)?

SWADES కార్యక్రమంలో భాగంగా వందే భారత్ మిషన్ ద్వారా మన దేశానికి తిరిగి వస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇతర దేశాల్లో పని చేస్తే కరోనా కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు ఈ స్కిల్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి స్కిల్స్, అనుభవం ఆధారంగా ప్రత్యేకమైన డేటాబేస్ లో వారి సమాచారాన్ని పొందుపరుస్తారు. ఆ తర్వాత వారికి స్వదేస్ స్కిల్ కార్డును అందిస్తారు. ఈ రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు ముప్పైవేలకు పైగా నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 80 శాతం మంది అంటే 24,500 మంది గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారే కావడం విశేషం. ఈ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు ఉండడం విశేషం.

కరోనా కారణంగా కేవలం యూఏఈలోనే దాదాపు లక్ష మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక అంచనా. ఇందులో ఎక్కువగా నిర్మాణం, ఫైనాన్స్, ఆతిథ్య రంగాల్లో పనిచేసేవారు ఉన్నారు. ఆసియాలోనే మన దేశానికి చెందిన వారు అత్యధికంగా పనిచేసే దేశం ఇదే కావడం విశేషం. ఈ వివరాలన్నింటికీ స్కిల్ ఇండియా పోర్టల్ ASEEM (ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్) వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంచింది స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ. ASEEM అనేది వివిధ రంగాల్లో ఉన్న స్కిల్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైరెక్టరీ లాంటిది. మార్కెట్ డిమాండ్ కి తగినట్లుగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులను అందించడమే ఈ ప్లాట్ ఫాం ముఖ్యోద్దేశం. తద్వారా వారందరికీ ఉద్యోగాలు, జీవనోపాధి అందించేందుకు ఈ ప్లాట్ ఫాం పనిచేస్తోంది. ప్రస్తుతం ASEEM ప్రాజెక్ట్ లో 810 సంస్థలు రిజిస్టర్ అయి ఈ ప్లాట్ ఫాం ద్వారానే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి.

నిరుద్యోగులకు ఎలా ప్రయోజనం?

నిరుద్యోగుల వివరాలను డేటాబేస్ లో ఎంటర్ చేసి స్వదేస్ కార్డును అందించిన తర్వాత ఈ వివరాలను మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉన్న వివిధ సంస్థలతో పంచుకుంటారు. ఒకవేళ వారి అనుభవం, స్కిల్స్ కి సరిపడే ఉద్యోగం ఏదైనా అందుబాటులో ఉంటే నిరుద్యోగుల మొబైల్ కి మెసేజ్ రూపంలో, ఈ మెయిల్ కి ఆ సమాచారాన్ని అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఐదు వేల మందికి ప్రయోజనం దొరికిందట. వీరందరికీ ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇండస్ట్రీ అనలిస్టుల ప్రకారం 2020లో ఏడు మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారట. కరోనా వల్ల ఎదురైన ఆర్టిక సంక్షోభమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగులను ఎంపిక చేసేందుకు ఉన్న హైర్ గ్లోబల్ హెచ్ ఆర్ సొల్యూషన్స్ సంస్థ సీఈఓ సమర్ షా దీని గురించి మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో 2020లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. దాదాపు తొంభై లక్షల మంది మన దేశానికి చెందినవారు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయిల్ అండ్ గ్యాస్, ఆతిథ్య రంగాల్లోనే పనిచేస్తున్నారు.చాలా మంచి అనుభవం, నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు సాధించగలిగారు. వైద్యం, టెక్నాలజీ రంగాలకు చెందిన అతి కొద్ది మందిని మాత్రమే వారు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన వారిని చాలామందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి ఈ స్వదేస్ కార్డులు బాగా ఉపయోగపడుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే మన దేశంలోనూ ఇలా అంతర్జాతీయంగా ఉద్యోగాలు చేసి అనుభవం పొందిన వారిని తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని వారు వెల్లడించారు.
Published by:Krishna Adithya
First published: