Trains Delay: దేశంలోని రైళ్లు ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి.. రైల్వేశాఖ ఏం చెబుతోంది ?

ప్రతీకాత్మక చిత్రం

Trains Delay: రైలు ఆలస్యంగా రావడం వల్ల అసౌకర్యానికి గురైన వ్యక్తికి.. రైల్వే శాఖ నష్టపరిహారం చెల్లించాలనే అదేశాన్ని భారత సుప్రీంకోర్టు సమర్థించింది.

  • Share this:
మనదేశంలో రైల్వేలు షెడ్యూల్ సమయానికి రావడం చాలా అరుదు. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి కానీ.. గతంలో అసలు రైలు ఆలస్యంగా వస్తుందనే సమాచారం సైతం అందక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆ ఆలస్యం 10, 15 నిమిషాలయితే ఫర్వాలేదు.. కానీ గంటల తరబడి నిరీక్షించాలంటే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇకపై ఆ సమస్య ఎదురు కాదు. ఎందుకంటే రైలు ఆలస్యంగా రావడం వల్ల అసౌకర్యానికి గురైన వ్యక్తికి.. రైల్వే శాఖ నష్టపరిహారం చెల్లించాలనే అదేశాన్ని భారత సుప్రీంకోర్టు సమర్థించింది. రైలు సమయానికి గమ్యస్థానానికి ఎందుకు చేరుకోలేదనే అంశంపై సరైన వివరణ ఇవ్వకపోతే, అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

* రైల్వే ఎందుకు చెల్లించాలి?
ఈ అంశం 2016 నాటిది. నార్త్-వెస్ట్రన్ రైల్వేలోని అజ్మీర్ నుంచి జమ్మూకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గమ్యస్థానానికి(జమ్మూ) నాలుగు గంటలు ఆలస్యంగా చేరింది. ఇందులో తన కుటుంబంతో పాటు ప్రయాణించిన ఓ ప్రయాణికుడు శ్రీనగర్‌కు వెళ్లే విమానాన్ని మిస్సయ్యాడు. దీంతో అసౌకర్యానికి గురైన అతడు రాజస్థాన్‌లోని అల్వార్‌ వినియోగదారుల ఫోరంలో అప్పీల్ చేశాడు. అతడి అసౌకర్యానికి గాను, నార్త్-వెస్ట్రన్ రైల్వే రూ.30,000 పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నార్త్-వెస్ట్రన్ రైల్వే న్యూదిల్లీలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో అప్పీల్ చేసింది. ఇక్కడ కూడా రైల్వేకు రిక్తహస్తమే మిగిలింది. దీంతో కేసును సదరు రైల్వే విభాగం సుప్రీంకోర్టు ముందుంచింది. అయితే ఆలస్యానికి తగిన కారణాన్ని అందించడంలో విఫలమైతే సదరు పిటిషన్ దారులకు రైల్వే శాఖ పరిహారం చెల్లించాలని తాజా తీర్పులో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ప్రతి ప్రయాణికుడి సమయం విలువైనదేనని, దీన్ని వివాదంగా పరిగణించకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆలస్యానికి సంబంధించిన కారణం గురించి వివరిస్తూ.. ‘ఆలస్యం అనేది వారి (రైల్వే) నియంత్రణలో లేనప్పటికీ, రైళ్లు షెడ్యూల్ సమయానికి రాలేకపోవడానికి గల కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. లేదంటే రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రైల్వే ప్రమాణాల ప్రకారం ఏదైనా రైలు షెడ్యూల్ చేసిన సమయానికి 15 నిమిషాలకు మించినా గమ్యస్థానానికి చేరుకోవడంలో విఫలమైతే, దాన్ని ఆలస్యంగా భావించాలని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

* ఎన్ని రైళ్లు ఆలస్యంగా వస్తున్నాయి?
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారత్‌కు ఉందని 2018 నాటి కాగ్ రిపోర్ట్ పేర్కొంది. 13 వేల రైళ్లు 1.2 లక్షల కిలోమీటర్ల నెట్వర్క్ ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న 7 వేల స్టేషన్లలో రోజూ 2.2 కోట్ల మంది ప్రజలు వీటిలో ప్రయాణిస్తున్నారని స్పష్టం చేసింది. ఇందుకోసం కాగ్ తన ఆడిట్ లో 10 జోనల్ రైల్వేల్లోని 15 ప్రధాన స్టేషన్లను కవర్ చేసింది. దీంతో పాటు నెల రోజుల కార్యకలాపాల డేటాను విశ్లేషించింది.

హౌరా, ఇంటర్‌సిటీ, అహ్మదాబాద్ మినహా ఎంపిక చేసిన అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లు 15 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ప్రతి రైలు 15 నుంచి 26 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ రైళ్ల ఆలస్యమైతే గణనీయంగా ఉంది. దిల్లీ మినహా ఎంపిక చేసిన అన్ని స్టేషన్లలో గూడ్స్ రైళ్లు సగటున 21 నుంచి 100 నిమిషాల వరకు ఆగిపోయాయి.

2019లో పార్లమెంటులోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఆ ఏడాది మార్చిలో నెలలో సగటున 389 రైళ్లు ప్రతిరోజూ ఆలస్యంగా నడిచాయని రైల్వే మంత్రిత్వశాఖ చెప్పింది. ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య 628కి, మేలో 517కి చేరిందని స్పష్టం చేసింది. ఆలస్యాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 2018 మార్చిలో రైళ్లు ఆలస్యమైన నిమిషాల సంఖ్య 36,72,043 నుంచి 27,30,830 వరకు తగ్గిందని, 2019 మార్చికి 25,04,263 నుంచి13,45,067కి తగ్గిందని స్పష్టం చేసింది.

* ఆలస్యానికి కారణమేంటి?
రైళ్లు వాటి రన్నింగ్ షెడ్యూల్ టైం కి కట్టుబడి ఉంటాయి. ఇంటర్నల్ సమస్యలే కాకుండా బాహ్య కారణాల వల్ల కూడా రైల్వేలు ఆలస్యంగా నడుస్తాయని సదరు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇందుకు లైన్ సామర్థ్యం, అసెట్ వైఫల్యం, సరిపోని మౌలిక సదుపాయాలు, ప్రయాణికులు- సరుకు రవాణా పెరుగుదల.. తదితర కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇవికాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులు (పొగమంచు, వర్షాలు, వరదలు, తుఫానులు), ప్రకృతి వైపరిత్యాలు లాంటి సహజ కారణాలు కూడా ఉన్నాయని చెప్పింది. వీటితో పాటు లెవల్ క్రాసింగ్ వద్ద భారీ ట్రాఫిక్ కూడా ఆలస్యానికి కారణంగా తెలిపింది. శాంతిభద్రతలు, రైల్వే ఆస్తుల దొంగతనం, పశువులు, మనుషులు అడ్డురావడం వల్ల ప్రమాదాలు, వీటిపైన కేసులు లాంటి తదితర ఇతర కారణాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

* ఆలస్యాన్ని నివారించడానికి రైల్వే ఏం చేస్తోంది?
భారతీయ రైల్వేలు 100 శాతం సమయపాలనను సాధించాయని ఈ ఏడాది జులై 1న రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దీనర్థం ఆ రోజు ఒక్క రైలు కూడా ఆలస్యం కాలేదని అవగతమవుతుంది. పలు నివేదికలు చెబుతున్నట్లుగా మహమ్మారి కారణంగా లాక్డౌన్, కొన్ని రైళ్లు మాత్రమే నడవడం వల్ల ఆలస్యంగా గణనీయంగా తగ్గింది. కేవలం 230 ప్యాసింజర్ రైళ్లు, 3 వేల లోడెడ్ ఫ్రైట్ రైళ్లు నడుపుతున్నప్పుడు 100 శాతం సమయపాలన వచ్చింది.

రైళ్లను ఆపరేట్ చేయడానికి ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పించారు. ఫలితంగా ఆలస్యమైతే జరిమానాలు విధిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు ఏడాది పొడవునా 95 శాతం సమయపాలన పాటించాలని, 15 నిమిషాలకంటే ఆలస్యమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నివేదించారు.
Published by:Kishore Akkaladevi
First published: