హోమ్ /వార్తలు /Explained /

New Antibody Therapy: వివిధ రకాల కరోనా వేరియంట్ల నుంచి రక్షించే ప్రత్యేక యాంటీబాడీలు.. గుర్తించిన తాజా అధ్యయనం

New Antibody Therapy: వివిధ రకాల కరోనా వేరియంట్ల నుంచి రక్షించే ప్రత్యేక యాంటీబాడీలు.. గుర్తించిన తాజా అధ్యయనం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా వేరియంట్‌లకు వ్యతిరేకంగా పనిచేసే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను కనుగొనడానికి పరిశోధకులు కొత్త పద్ధతిని అవలంభించారు. ముందు రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (RBD) అనే స్పైక్ ప్రోటీన్ ముఖ్య భాగంతో ఎలుకల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించారు.

ఇంకా చదవండి ...

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ, మూడో ఉద్ధృతి భయాలు ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. కొత్త రకం వేరియంట్లుగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్, సామర్థ్యాన్ని పెంచుకుంటూ బలోపేతమవుతోంది. టీకాలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి ప్రమాదకర వేరియంట్లను నిరోధించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల వేరియంట్ల నుంచి రక్షించే యాంటీబాడీని తాజాగా కనుగొన్నారు అమెరికా పరిశోధకులు. దీని సాయంతో వివిధ రకాల సార్స్ కోవ్-2 వైరస్‌ వేరియంట్లకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.

తక్కువ మోతాదులో అత్యంత రక్షణ కల్పించే ఈ యాంటీబాడీలతో కోవిడ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని ఇమ్యునిటీ జర్నల్‌లో ప్రచురించారు. వైరస్ ఉత్పరివర్తన చెందుతూ రూపాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో.. వాటిని నిరోధించే కొత్త యాంటీబాడీ చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం బాటలు వేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

ఎలా పనిచేస్తుంది?

కోవిడ్-19కి కారణమయ్యే సార్స్ కోవ్-2 మూల వైరస్.. స్పైక్ ప్రోటీన్‌ను ఉపయోగిస్తూ శరీర కణాలకు అంటుకుంటుంది. తద్వారా శ్వాస కోశ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. అయితే ఈ స్పైక్ ప్రోటీన్‌ శరీర కణాలకు అంటుకోకుండా ప్రస్తుత యాంటీబాడీలు నిరోధిస్తాయని తాజా పరిశోధన తేల్చింది. ఈ యాంటీబాడీలు వైరస్‌ను క్రియారహితంగా చేస్తూ, వ్యాధిని నిరోధిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వివిధ వేరియంట్లుగా ఉత్పరివర్తనం చెందింది. వీటి స్పైక్ జన్యువులలో సైతం ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా మూల వైరస్‌కు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన యాంటీబాడీలకు వైరస్‌లు లొంగట్లేదు. అయితే తాజాగా గుర్తించిన యాంటీబాడీలతో ఇలాంటి సమస్యలు ఎదురుకావని పరిశోధకులు తెలిపారు.

పరిశోధన ఎలా చేశారు?

కరోనా వేరియంట్‌లకు వ్యతిరేకంగా పనిచేసే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను కనుగొనడానికి పరిశోధకులు కొత్త పద్ధతిని అవలంభించారు. ముందు రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (RBD) అనే స్పైక్ ప్రోటీన్ ముఖ్య భాగంతో ఎలుకల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించారు. అనంతరం వాటి శరీరం నుంచి యాంటీబాడీలను ఉత్పత్తి చేసే కణాలను సేకరించారు. వాటి నుంచి RBDని గుర్తించే 43 యాంటీబాడీలను వేరుచేశారు. ఎలుకలను వ్యాధి నుంచి రక్షించడంలో అత్యంత ప్రభావవంతమైన రెండు యాంటీబాడీలను వీటి నుంచి వేరుచేశారు. వాటిని వివిధ వైరల్ వేరియంట్ ప్యానెళ్లపై పరీక్షించారు.


ఈ ప్యానెల్‌లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి నాలుగు ఆందోళన రకం వేరియంట్లు.. కప్పా, ఐయోటా వంటి దృష్టి సారించాల్సిన వైరస్ వేరియంట్లు ఉన్నాయి. SARS2-38 అనే యాంటీబాడీ, అన్ని వేరియంట్‌లను సులభంగా న్యూట్రలైజ్ చేసింది. దీంతోపాటు SARS2-38 హ్యూమనైజ్డ్ వెర్షన్.. కప్పా, బీటా వేరియంట్ల స్పైక్ ప్రోటీన్‌లను సమర్థంగా న్యూట్రలైజ్ చేసిందని పరిశోధకులు వెల్లడించారు.

First published:

Tags: Covid-19

ఉత్తమ కథలు