SRIKALAHASTHI TEMPLE IS VERY FAMOUS TO RAHU KETHU POOJA BUT SOME PROBLEMS POOJ STOPPED NGS TPT
Srikalahasthi: గ్రహ దోషాలు తొలగించే ఆలయానికే గ్రహణం పట్టిందా..? రాహు కేతు పూజలు నిలిచిపోవడానికి కారణం ఇదే..
శ్రీకాళహస్తికి గ్రహణం
Srikalahasthi: గ్రహ దోషాలు పోగొట్టే శ్రీకాళహస్తికే గ్రహణం పట్టింది అంటున్నారు స్థానికులు.. రాహు కేతు పూజల కోసం వచ్చిన వారిని.. తిరిగి అధికారులు వెనక్కు పంపించేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా..?
GT Hemanth Kumar, Tirupathi, News18. Srikalahasthi Temple: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరా ఆలయం. పంచభూత లింగాలలో వాయులింగమై వెలిశారు వాయులింగేశ్వరుడు. గ్రహణ కాలంలోనూ నిత్య పూజలు జరిపి... భక్తులకు గ్రహణ దోష నివారణ జరిపే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. వాయులింగేశ్వరుని దర్శనం చేసుకుంటే పాపాలు పోవడంతో పాటు.. సకల సౌభాగ్యలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కొండపై భక్తకన్నప్ప ఆలయం ఉంటే కింద భాగంలో స్వామి, అమ్మవార్ల ఆలయం ఉంటుంది. జ్ఞాన ప్రసునాంబ సమేత వాయులింగేశ్వర దర్శనం నవగ్రహాల వక్ర చూపు నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. దీంతో రోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయంలో రాహు-కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఒక్క రాయలసీమ నుంచే కాకుండా తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయం రాహు-కేతు పూజలకు ప్రసిద్ది కావడంతో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ఇక్కడ రాహు-కేతు పరిహార దోష పూజలు ఆ నిర్వహిస్తారు. ఆలయంలో వివిధ మండపాల్లో రాహు-కేతు పూజలు నిర్వహిస్తారు.. ఒక్కో మండపంలో ఒక్కో ధరతో ఆలయ అధికారులు వివిధ టిక్కెట్ల ద్వారా పూజలు నిర్వహిస్తుంటారు. రాహు-కేతు పూజలకు సామాన్య భక్తుల నుండి వివిఐపి వరకూ మంచి డిమాండ్ ఉంటుంది. 500 నుంచి 5000 రూపాయల వరకు టిక్కెట్లు దుబాటులో ఉంటాయి.
రాహు-కేతు పూజకు టిక్కెట్ తీసుకున్న భక్తులు పూజా సామగ్రిని తీసుకుని రావాల్సిన అవసరం లేదు. అందుకు కావాల్సిన పూజా కిట్ ఆలయ అధికారులే సమకూర్చుతారు.. ఈ పూజలో కొబ్బరికాయ, రెండు నిమ్మకాయలు, పువ్వులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, రెండు ఫ్యాకెట్ల ధాన్యం, ఎరుపు, నలుపు రవికలు వీటితో పాటుగా రాహు-కేతు ఆకారంలో రెండు సర్పాల రూపంలో వెండి ప్రతిమలను ఇస్తారు..ఇందులో అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన వస్తువు అంటే వెండి సర్పాల ప్రతిమలు.. రాహు-కేతు పూజలో భక్తులకు అందజేసిన పూజా సామగ్రిని ఆ నాగపడిగలపై సమర్పించాల్సి ఉంటుంది. అందుకే ఈ పూజ సంపూర్ణం కావాలంటే నాగపడిగలైన రాహు-కేతు వెండి ప్రతిమలు అత్యంత కీలకం.
ఇదీ చదవండి : తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి.. వారి చదువులు ఆపడం మంచిది కాదంటూ జగన్ కు లోకేష్ లేఖ
ఈ నాగపడిగలను తయారు చేసేందుకు ఆలయంలోనే మింట్ ఏర్పాటు చేసి వెండి కడ్డీలను ద్వారా నాగపడిగలను తయారు చేస్తారు. అయితే గత కొద్ది రోజులుగా ఆలయంలో రాహు-కేతు పూజలు నిర్వహించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే రాహు-కేతు పూజలకు అవసరం అయ్యే నాగపడిగలను ఎప్పటికప్పుడు తయారు చేసి పూజకు అందించాల్సిన బాధ్యత మింట్ సిబ్బందిపై ఉంటుంది. సామాన్య రోజుల కంటే శని, ఆది, సోమవారాల్లో రాహు-కేతు పూజలు నిర్వహించే భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది.
ఈ క్రమంలో వెండి నాగపడిగ ప్రతిమలను భక్తులకు అవసరం అయ్యే వరకూ అందిస్తూ వస్తుంటారు. మింట్ లో సిబ్బంది కొరత కారణంగా సోమవారం పూజలకు ఆటంకం కలిగింది. భారీగా భక్తులు చేరుకున్నా.. అందుకు తగ్గట్టు నాగపడిగలు లేక పోవడంతో పూజను రద్దు చేశారు . దీంతో గంటల తరబడి ఆలయంలో భక్తులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది..చంటి పిల్లలతో క్యూలైన్స్ లో భక్తులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. టిక్కెట్లు జారీ చేసి ఆలయంలో పూజ రద్దు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది అదే.. జేఎస్టీ కట్టాల్సి వస్తోంది అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ముందస్తుగా నాగపడిగల విగ్రహాల నిల్వపై దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆలయంలో అన్ని తానై స్ధానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నడిపిస్తుంటారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు వస్తున్నారు. ఇలా శ్రీవారి దర్శనంకు విచ్చేసిన భక్తులు రాహు-కేతు పూజల నిమిత్తం శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంటున్నారు. ముందస్తుగానే భక్తుల రాకను గుర్తించి నాగపడిక లోటు భర్తీ చేయాల్సిన స్ధానిక ఎమ్మెల్యే, ఆలయ పాలక మండలి సైతం పట్టించుకోక పోవడంతో ఆలయంలో భక్తులకు అవస్ధలు తప్పడం లేదు.
ఆలయంలో పాలక మండలి నియామకం వద్ద నుండి ఏ చిన్న పని జరగాలన్నా స్ధానిక ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిందే అన్న రీతిలో వ్యవహారం ఉంటుంది. అధికారులు వద్ద నుండి పాలక మండలి వరకూ నిర్లక్ష్యం వహించడంతో కారణంగా గంటల తరబడి భక్తులు క్యూలైన్ లో వేచి ఉండి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయంలో అన్ని కనిపించే ఎమ్మెల్యేకు నాగపడిగల కొరత మాత్రం ఎందుకు కనిపించలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాళహస్తి ఆలయం చైర్మన్ ఏం అన్నారంటే...?
నాగపడిగల కొరతపై ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్పందిస్తూ.. నాగపడిగల తయారి కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన మింట్ లో పది మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అయితే అందులో నలుగురు ఉద్యోగులు అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారని, మింట్ లో ఓ మిషన్ కూడా మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయంలో నాగపడిగల కొరతను తీర్చేందుకు ఈవో, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం మని, కాకుండా మరో ఐదు మందిని నూతనంగా మింట్ లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాంమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.