Great Destruction: ‘ఆ నాలుగు దేశాలతో ప్రపంచానికి ప్రమాదం.. విధ్వంసాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలి’.. తీవ్ర హెచ్చరిక

(ప్రతీకాత్మక చిత్రం)

ఇలాంటి నాలుగు దేశాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాటిని ఆపకపోతే వినాశనం నుంచి ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరిస్తున్నారు "పారిస్ ఈక్విటీ చెక్" పీర్ రివ్యూ శాస్త్రవేత్తల బృందం. ఈ జాబితాలో ఉన్న దేశాలు.. ఆస్ట్రేలియా, చైనా, రష్యా, బ్రెజిల్. ఈ నాలుగు జి-20 కూటమిలో సభ్య దేశాలు.

  • Share this:
వాతావరణ మార్పులు, భూతాపానికి మానవులు చేస్తున్న పనులే కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వివిధ దేశాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇలాంటి నాలుగు దేశాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాటిని ఆపకపోతే వినాశనం నుంచి ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరిస్తున్నారు "పారిస్ ఈక్విటీ చెక్" పీర్ రివ్యూ శాస్త్రవేత్తల బృందం. ఈ జాబితాలో ఉన్న దేశాలు.. ఆస్ట్రేలియా, చైనా, రష్యా, బ్రెజిల్. ఈ నాలుగు జి-20 కూటమిలో సభ్య దేశాలు. కానీ ఈ దేశాల భవిష్యత్తు ప్రణాళికలు మాత్రం భూ గ్రహంపై మనం ఊహించినదానికంటే ప్రమాదకరమైనవిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ రూపొందించిన ఇంధన విధానాలు భూమికి వినాశకరమైనవని పేర్కొంటున్నారు. ఎనర్జీ పాలసీలను అమలు చేయకుండా నాలుగు దేశాలను నిరోధించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు.

* ప్రపంచం మొత్తంపై ప్రభావం
ఈ నాలుగు దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాల వాతావరణ మార్పుల ఒప్పందాలపై ప్రభావం చూపుతున్నాయని పారిస్ ఈక్విటీ చెక్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీనికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను నిలిపివేస్తున్నాయని, భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఘోరంగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పారిస్‌లో జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద వాతావరణ మార్పుల సమావేశం 'కాప్ -26' లో కూడా ఈ సమస్యను లేవనెత్తాలని నిర్ణయించారు.

'COP-26' ప్రపంచ చరిత్రలో అతిపెద్ద వాతావరణ మార్పుల సమావేశం. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇందులో పాల్గొంటాయి. 2050 నాటికి ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గించాలనే లక్ష్యాన్ని దేశాలు నిర్ణయించాయి. కానీ ప్రపంచ దేశాల ప్రణాళికలు మాత్రం ప్రకృతిని దెబ్బతీసేలా ఉన్నాయని, అందువల్ల ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెప్పారు.

* హెచ్చరికలు బుట్టదాఖలు
కార్బన్ ఉద్గారాలను వెలువరించే ఎలాంటి పరిశ్రమలను తాము స్థాపించబోమని బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు అంతర్జాతీయ వేదికలపై భరోసా ఇచ్చాయి. కాలుష్యం, ఉష్ణోగ్రతను పెంచే ప్రాజెక్టులను ప్రోత్సహించమని తెలిపాయి. కానీ చైనా, రష్యా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మాత్రం దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు, హెచ్చరికలను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దేశాలలో బొగ్గును చాలా ఎక్కువ స్థాయిలో ఉపయోగిస్తున్నారని "పారిస్ ఈక్విటీ చెక్ పీర్ రివ్యూ గ్రూప్" నివేదిక చెబుతోంది.

‘ప్రపంచ దేశాలు కూడా ఇలాగే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను ఉపయోగించడం ప్రారంభిస్తే.. ప్రపంచ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియల్ వరకు పెరుగుతుంది. ఇది అతిపెద్ద విపత్తు. ఈ విషయంపై అన్ని దేశాలు బాధ్యత చూపిస్తుండగా, ఈ నాలుగు దేశాలు బాధ్యతా రహితంగా వెళ్తున్నాయి. కొన్ని మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయి’ అని నివేదిక వెల్లడించింది.

* 2050 నాటికి భయంకరమైన పరిస్థితులు
వాతావరణ మార్పులకు నేరుగా కారణమవుతున్న ఈ నాలుగు దేశాలలో వందలాది ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని.. మరికొన్ని ప్రాజెక్టులను సిద్ధం చేశాయని "పీర్ రివ్యూ గ్రూప్ పారిస్ ఈక్విటీ చెక్" అధ్యయనం గుర్తించింది. ఇలాంటి చర్యలు గ్లోబల్ వార్మింగ్‌కు ప్రత్యక్షంగా కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నాలుగు దేశాలు బాధ్యత తీసుకొని, ప్రాజెక్టులను వెంటనే ఆపకపోతే.. ఈ ఏడాది జరగనున్న COP-26 సమావేశానికి అర్థం లేదని రిపోర్టు పేర్కొంది. దీని వల్ల 2050 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 ° C తగ్గించాలనే COP-26 లక్ష్యం నెరవేరదని, ఫలితంగా 2050 నాటికి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

* జి-20 దేశాలకు బాధ్యత లేదా?
చైనా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌తో పాటు ఇతర జి-20 దేశాలు కలిపి ప్రపంచంలోని 85 శాతం కార్బన్‌ను విడుదల చేస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 20 దేశాలు కలిసి 85 శాతం కార్బన్ డయాక్సైడ్‌ను మన వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో ఈ నాలుగు దేశాల వాటా ప్రధానంగా ఉంటుంది. అందువల్ల జి-20 దేశాలు ప్రపంచం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని "ఆవాజ్" అనే అంతర్జాతీయ సంస్థ విమర్శించింది.

ఐక్యరాజ్యసమితి నిర్వహించే COP-26 సమావేశానికి ముందు.. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులపై జి-20 దేశాల సమావేశం జరిగింది. కానీ కార్బన్ ఉద్గారాలకు సంబంధించి సభ్య దేశాల మధ్య వివాదం తలెత్తింది. గణనీయంగా అభివృద్ధి చెందుతున్న తమ దేశ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేమని చైనా తేల్చి చెప్పింది. దీంతో రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ సహా అనేక ఇతర దేశాలు సైతం చైనా మార్గాన్నే అనుసరిస్తున్నాయి.

* భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు
ఇలాంటి పరిస్థితులు భయంకరమైనవని చెబుతున్నారు "పీర్ రివ్యూ గ్రూప్ పారిస్ ఈక్విటీ చెక్" బృందం ప్రధాన శాస్త్రవేత్త యాన్ రోబో డు పాంట్. ప్రపంచంలోని పెద్ద దేశాలు వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌పై తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా లేవని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వరదలు, సునామీలు, కరువులు, అతి వేడి, హీట్ వేవ్స్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటిని మానవులు తట్టుకోలేరని విశ్లేషించారు.

* పారిశ్రామిక విప్లవం తరువాత పెరిగిన ఉష్ణోగ్రత
పారిశ్రామిక విప్లవం తరువాత నుంచి ప్రపంచం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి కొనసాగింపుగా ప్రపంచ ఉష్ణోగ్రత 5 ° C పెరగడం ఖాయమని చెప్పారు. ‘దీనివల్ల ప్రపంచంలోని అన్ని వర్షారణ్యాలు ఎండిపోతాయి. ప్రపంచంలోని పావు భాగం నీటి కొరత ఎదుర్కొంటుంది. ప్రజలు దాహంతో మరణించే స్థాయికి పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది. మరోవైపు మంచు కరగడం వల్ల సముద్ర మట్టం ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతుంది. ముంపు ఫలితంగా ప్రాణనష్టం ఎదురవుతుంది’ అని శాస్త్రవేత్తల బృందం హెచ్చరిస్తోంది.

దీంతో పాటు ధ్రువాల వద్ద ఉండే "రిఫ్లెక్టివ్ ఐస్" కరగడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ ప్రపంచం మొత్తానికి వ్యాపించడం ప్రారంభమవుతుంది. లేదంటే సైబీరియాలో పెర్మాఫ్రాస్ట్ కరగడం వల్ల మీథేన్ వాయువు విడుదల అవుతుంది. ఆ తరువాత ఏం చేసినా, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను ఆపడం సాధ్యం కాదని పరిశోధకులు తెలిపారు. ఇదే సమయంలో 1.5 ° C ఉష్ణోగ్రతను తగ్గిస్తే, గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైన ప్రభావాలను నివారించవచ్చని చెప్పారు.

ఇప్పటి వరకు ప్రపంచ ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల వరకే పెరిగింది. దీనికే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు ఘోరంగా పెరిగాయి. చాలా దేశాలను భీకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ విషయంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
Published by:Krishna Adithya
First published: