హోమ్ /వార్తలు /Explained /

RBI Digital Currency: ఆర్బీఐ తీసుకురానున్న డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? బిట్ కాయిన్‌కి ఇది ఎలా భిన్నం?

RBI Digital Currency: ఆర్బీఐ తీసుకురానున్న డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? బిట్ కాయిన్‌కి ఇది ఎలా భిన్నం?

ఆర్బీఐ విడుదల చేయనున్న డిజిటల్ కరెన్సీ ఎలా ప్రత్యేకమైనది? (PC: moneycontrol)

ఆర్బీఐ విడుదల చేయనున్న డిజిటల్ కరెన్సీ ఎలా ప్రత్యేకమైనది? (PC: moneycontrol)

ఈ ఏడాది డిసెంబర్ నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతదేశ సొంత డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశ సొంత డిజిటల్ కరెన్సీని (Digital Currency) పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీఐ దీన్ని కొత్త రకం క్రిప్టోకరెన్సీగా (Crypto Currency), ఫిజికల్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా భావించట్లేదు. ఇది కూడా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మాదిరిగానే పని చేస్తుందని ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలుగా (CBDC) గుర్తించే వీటి రాకతో.. ఇప్పటివరకు నగదు వినియోగంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది.

* డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి?

పేరుకు తగ్గట్టు.. డిజిటల్ రూపంలో ఉన్న ఏదైనా కరెన్సీని డిజిటల్ కరెన్సీ అంటారు. వినియోగదారులు పేమెంట్లు చేయడానికి లేదా స్వీకరించడానికి ఒక మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వాలెట్ ఉంటుంది. కానీ ఇది డబ్బుకు భిన్నంగా ఉండదు. డిజిటల్‌గా ఉన్న రూ.100.. ఫిజికల్‌గా ఉన్న రూ.100 లాగా ఉంటుంది. CBDC అనేది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది కాగితం రూపంలో ఉండదు. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సావరిన్ కరెన్సీ. సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఇది కనిపిస్తుంది. నిర్దిష్ట అవసరాల కోసం వీటిని రూపొందిస్తున్నారు. CBDCని నగదుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

డిజిటల్ కరెన్సీ గురించి ఈ ఏడాది జులైలో మాట్లాడారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్. CBDC అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన లీగల్ టెండర్ అని చెప్పారు. ‘ఇది ఒక ఫియట్ కరెన్సీ (ప్రభుత్వం విడుదల చేసే కరెన్సీ) మాదిరిగానే ఉంటుంది. ఫియట్ కరెన్సీలా దీన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. దాని రూపం మాత్రమే భిన్నంగా ఉంటుంది. చెల్లింపులపై పర్యవేక్షణ, మెరుగైన లావాదేవీలు, సులభంగా ఉపయోగించడం వంటి ఎన్నో ప్రయోజనాలు వీటితో ఉంటాయి’ అని వివరించారు.

* CBDCలు కూడా బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీ మాదిరిగానే ఉంటాయా?

క్రిప్టోకరెన్సీ అనేది చెలామణిలో ఉన్న అధికారిక కరెన్సీ కాదు. సెంట్రల్ బ్యాంకులు కాకుండా వీటిని ప్రైవేట్‌గా సృష్టిస్తారు. కొన్ని రకాల చెల్లింపుల్లో దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే వీటిని ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు అధికారికంగా గుర్తించవు. లీగల్ టెండర్ కాని ఈ ఆస్తిని చట్టపరమైన సావరిన్ కరెన్సీగా దేశాలు గుర్తించట్లేదు. బిట్‌కాయిన్‌ను ప్రైవేటు వ్యక్తులు సృష్టించారు. ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది.

CBDCలు.. బిట్‌కాయిన్. ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీల మాదిరిగా ఉండవు. తక్కువ అస్థిరత (volatility), ఎక్కువ భద్రత వీటి సొంతం. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే బాధ్యత ఉండే అధికారిక ద్రవ్య సంస్థల (monetary institutions) మద్దతు వీటికి ఉంటుంది. క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. కానీ ఫియట్ కరెన్సీ అయిన CBDCలకు ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ మాదిరిగా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ఫార్మాట్ అవసరం ఉండదు.

* CBDC వల్ల భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రానున్నాయి?

బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవల సంస్థ HSBCలో గ్లోబల్ ఎకనామిస్ట్ జేమ్స్ పోమెరాయ్ CBDCల గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇవి ఒక తరంలో నగదును రీప్లేస్ చేయగలవని చెప్పారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థను మార్చగలవని తెలిపారు. ప్రపంచ వృద్ధికి తోడ్పడటంతో పాటు పేదరికాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని చెప్పారు.

డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడానికి సెంట్రల్ బ్యాంకులకు ప్రస్తుతం అనువైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా మహమ్మారి తరువాత డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. వైరస్ భయాలతో పాటు లాక్‌డౌన్‌ సమయంలో నగదు లభించడం కష్టమైనందువల్ల ప్రజలు కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్‌కు మారారు. అందువల్ల డిజిటల్ కరెన్సీల ప్రవేశానికి పెద్దగా అవరోధాలు ఎదురుకాకపోవచ్చు.

CBDCల ద్వారా ప్రజలు ఆర్థిక సేవలను సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇది ఆర్థిక సేవల్లో ప్రజలు భాగమయ్యేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు) తోడ్పడుతుంది. దీంతోపాటు పొదుపు అలవాట్లను కూడా పెంచుతుంది. మనీ ట్రాన్స్‌ఫర్‌ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల ఇతర ప్రాంతాల్లో నివసించే వారు తమ కుటుంబ సభ్యులకు సరక్షితంగా, సులభంగా, అదనపు ఖర్చులు లేకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

* CBDCS చెల్లింపులు ఎలా చేస్తారు?

ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న డిజిటల్ వాలెట్ పనిచేసే విధంగానే CBDC పనిచేస్తుంది. కానీ నగదుకు బదులుగా బ్యాంకు డిజిటల్ వెర్షన్‌ని మాత్రమే జారీ చేస్తుంది. క్యాష్ ఎకానమీలో.. ఖాతాదారులు తమ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుకు సమానమైన ఫిజికల్ నోట్లను బ్యాంకులు అందించగలగాలి. కానీ డిజిటల్ కరెన్సీ వల్ల నగదును ముద్రించడానికి బదులుగా, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీ జారీ చేస్తుంది. దాన్ని ఖాతాదారులు ఎలక్ట్రానిక్‌ రూపంలో స్వీకరించి, ఖర్చు చేయవచ్చు.

ఇది ప్రింటింగ్, స్టోరేజీ, బ్యాంక్ నోట్లను పంపిణీ చేయడానికి అవుతున్న ఖర్చులను తగ్గిస్తుంది. ఇంటర్‌బ్యాంక్ సెటిల్మెంట్ అవసరం ఉండదు. అంతర్జాతీయ లావాదేవీల విషయంలో CBDCలు ఎంతగానో ఉపయోగపడతాయి. నగదు ముద్రణ తగ్గడం వల్ల.. వాతావరణ మార్పులు వంటి సంక్షోభ పరిస్థితుల్లో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని సైతం డిజిటల్ కరెన్సీ తగ్గిస్తుంది.

* డిజిటల్ కరెన్సీలను ఏయే దేశాలు ప్రారంభించాయి?

అట్లాంటిక్ కౌన్సిల్ అనే అమెరికా సంస్థ ప్రకారం.. 2020 మే నెల వరకు కేవలం 35 దేశాలు మాత్రమే CBDCలపై సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ GDPలో 90 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 81 దేశాలు CBDCలపై దృష్టి సారించాయి. నగదుకు ప్రత్యామ్నాయ మార్గాలను దేశాల సెంట్రల్ బ్యాంకులు అన్వేషిస్తున్నాయని అట్లాంటిక్ కౌన్సిల్ వెల్లడించింది.

బహమియన్ శాండ్ డాలర్‌ అనేది ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మొదటి CBDC. ఇప్పటి వరకు ఐదు దేశాలు వీటిని ప్రారంభించాయి. స్వీడన్, దక్షిణ కొరియా వంటి 14 ప్రధాన దేశాలు CBDCలను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాయని అట్లాంటిక్ కౌన్సిల్ పేర్కొంది. ఈ రేసులో అమెరికా వెనుకబడి ఉండగా, చైనా ముందుందని వెల్లడించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) ఇప్పటికే చైనీస్ యువాన్ డిజిటల్ వెర్షన్‌ను ప్రారంభించి, నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

First published:

Tags: Cryptocurrency, Digital currency, Rbi

ఉత్తమ కథలు