Talibans Rule: అఫ్గానిస్థాన్‌లో అధికార మార్పిడి ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది? ఉగ్రవాద సంస్థలు బలం పుంజుకుంటాయా? భారత్‌ పెట్టుబడుల పరిస్థితి ఏంటి?

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అధికారం.. భారత్‌పై ప్రభావం ఎలా ఉండబోతున్నది? (PC: Twitter)

ఇండియా-అఫ్గానిస్థాన్ సంబంధాలు ఎలా మారబోతున్నాయి? అఫ్గాన్ అభివృద్ధికి భారతదేశం ఖర్చు చేసిన నిధుల పరిస్థితి ఏంటి? చాబహార్ ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి?

  • Share this:
అఫ్గానిస్థాన్‌ మరోసారి తాలిబన్ల పాలనలోకి వెళ్లింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో అధికార మార్పిడి ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో పాటు గత 20 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఈ ప్రయత్నాలు చేపట్టిన ప్రధాన శక్తుల జాబితాలో అమెరికా, నాటో దేశాలతోపాటు భారత్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు భారత్‌కు ఎదురుదెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌తో దౌత్యపరమైన సంబంధాలు నెరిపే పరిస్థితులు లేవు. అందువల్ల అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల ఏలుబడికి మారడం వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఇండియా-అఫ్గానిస్థాన్ సంబంధాలు ఎలా మారబోతున్నాయి? అఫ్గాన్ అభివృద్ధికి భారతదేశం ఖర్చు చేసిన నిధుల పరిస్థితి ఏంటి? చాబహార్ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏంటి? జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్ర సంస్థలు భారత్‌లో మళ్లీ బలం పుంజుకుంటాయా? వంటి వివరాలు తెలుసుకుందాం...

* అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్లు అధికారం చేపడితే భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన వెనువెంటనే భారత్‌పై గణనీయమైన ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు భారతదేశం వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉంది. గత నాలుగు-ఐదు రోజులుగా భారత్‌ ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా అలాంటి ప్రకటన జారీ చేయలేదు. అందువల్ల రానున్న రోజుల్లో తాలిబన్లతో భారత్ ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ధోరణిపైనే ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి.

మాజీ విదేశాంగ కార్యదర్శి వివేక్ కట్జూ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్‌ సమస్య విషయంలో భారతదేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. ఆగస్టు 12న దోహాలో జరిగిన సమావేశంలో భారతదేశం రాజనీతి ప్రదర్శించింది. దౌత్యపరంగా ఎటూ మొగ్గుచూపకుండా వేచిచూసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. రాబోయే కాలంలో అఫ్గాన్‌ విషయంలో భారత్‌ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని మరికొందరు నిపుణులు అంటున్నారు.

* గత 20 ఏళ్లుగా అఫ్గాన్‌లో భారత్ చేసిన పెట్టుబడుల పరిస్థితి ఏంటి?
అఫ్గానిస్థాన్‌లో మౌలిక వసతుల కల్పన, ఇతర అవసరాల కోసం భారత్‌ గత కొన్నేళ్లుగా ఎంతో డబ్బు ఖర్చు చేసింది. అయితే ఇవి పెట్టుబడులు కాదని, సహాయం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన దేశం అఫ్గాన్‌ కోసం ఖర్చు చేసిన మూడు బిలియన్ డాలర్ల మేర డబ్బు తిరిగి వస్తుందని భారత్ సైతం ఆశించట్లేదు. అక్కడి ప్రజల కోసం మన దేశం ఈ సాయం చేసింది. గత 20 సంవత్సరాలలో అఫ్గాన్‌లో భారతదేశం దాదాపు 500 చిన్న, పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసింది. వీటిలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, పిల్లల హాస్టల్‌లు, వంతెనలు ఉన్నాయి.

అఫ్గానిస్థాన్‌ పార్లమెంట్ హౌస్, సల్మా డ్యామ్, జరంజ్-దేలారం హైవే వంటి ప్రాజెక్టుల కోసం భారతదేశం నిధులు కేటాయించింది. అయితే వీటి వల్ల అందరికీ ఉపయోగమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ అంత భారీ సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులను తాలిబన్లు పూర్తిగా నాశనం చేస్తారని చెప్పలేం. వారి పాలనలో కూడా ఇవన్నీ అఫ్గాన్ ప్రజలకు ఉపయోగపడతాయి. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, అఫ్గానిస్థాన్‌లో చైనా, పాకిస్థాన్ జోక్యం పెరుగుతుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అఫ్గాన్‌ విషయంలో భారత్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఈ రెండు దేశాలు కోరుకుంటున్నాయి.

* భారత్ చేపట్టిన చాబహార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉండనుంది?
ఇరాన్‌లో నిర్మించిన చాబహార్ పోర్టు కోసం భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పోర్టు భారతదేశాన్ని అఫ్గాన్‌తో, ఇరాన్‌ను మధ్య ఆసియా దేశాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అఫ్గాన్‌తో ప్రత్యక్ష వాణిజ్య మార్గాన్ని రూపొందించాలని భారత్ భావించింది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే రానున్న రోజుల్లో చాబహార్ పోర్టు విషయంలో భారతదేశానికి ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాలిబన్ల ప్రభుత్వంలో కరాచీ- గ్వదార్ పోర్టుల ద్వారా అఫ్గాన్‌తో వాణిజ్యం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే, చాబహార్ పోర్టు కోసం భారత్ చేసిన పెట్టుబడులకు ప్రతిఫలం దక్కకపోవచ్చు.

* తాలిబన్ల ప్రభావంతో భారత్‌లో జైషే మొహ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్ర సంస్థలు మళ్లీ క్రియాశీలకంగా మారగలవా?
తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే తాలిబన్ల కీలక నేత ముల్లా బరదార్‌కు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందనే అంశంపై.. ఇతర ఉగ్ర సంస్థల బలోపేతం అంశం ఆధారపడి ఉండవచ్చు. ముల్లా బరదార్‌కు పాక్‌ నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. అతడి అండతో జైషే మొహ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్‌లో శిక్షణ పొందడం సులువైన పని. ఇన్నేళ్ల పాటు తాలిబన్లు.. అమెరికా, NATO దేశాలతో పోరాటంలో ఎంతో అనుభవం గడించారు. వారి శిక్షణలో జైషే, లష్కరే వంటి సంస్థలు బలోపేతమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ పరిస్థితులన్నీ భారతదేశానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. తాలిబన్ల ఏలుబడిలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలు బలం పుంజుకుంటే.. అన్ని ప్రపంచ దేశాలకు ముప్పు ఉంటుందనేది నిజం.

* ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ ముందున్న మార్గాలు ఏవి?
ప్రస్తుతానికి భారత్‌ ముందు ఎలాంటి విస్తృత మార్గాలు లేవు. రానున్న కొన్ని వారాలు లేదా నెలల్లో తాలిబన్లతో సంబంధాల విషయంలో మన దేశం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం తాలిబన్ల పాలలో కూడా అఫ్గాన్‌తో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగిస్తుందా లేదా మిత్ర దేశాలతో కలిసి నడుస్తుందా లేదా తటస్థ వైఖరిని అవలంభిస్తుందా అనేది తేల్చుకోవాలి. అయితే విధానపరమైన నిర్ణయాలతో అఫ్గాన్‌తో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ, దేశ భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం పెద్ద సవాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:John Naveen Kora
First published: