POST OFFICE RECURRING DEPOSIT FAQS TENURE RATE OF INTEREST APPLICATION FORM TAX BENEFITS BA
Post Office RD Scheme: పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి? ఎంత కాలం కట్టాలి? మధ్యలో తీసుకోవచ్చా? వడ్డీ ఎంత?
ప్రతీకాత్మక చిత్రం
Post Office RD FAQs | పోస్టాఫీసులో చాలా పథకాలు ఉంటాయి. అందులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా ఫేమస్. అయితే, దీనికి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉంటాయి. మీకు కూడా అలాంటి డౌట్స్ ఉంటే ఈ స్టోరీ చదవండి.
ఇండియా పోస్ట్ (India Post) తన కస్టమర్లకు తపాలా సేవలే కాకుండా జీవిత బీమా (Life Insurance), పొదుపు పథకాలు (Post Office Savings Scheme) వంటి పలు ఆర్థిక సేవలను అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పోస్టాఫీస్ అందిస్తున్న పొదుపు పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (Post Office Recurring Deposit Scheme) బాగా ప్రాచుర్యం పొందింది. ఇది తాత్కాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి బాగా దోహదపడుతుంది. వీటి ద్వారా నిర్దిష్ట కాలపరిమితి వరకు ప్రతి నెలా (EMI) స్థిరమైన డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లోనే ఎక్కువగా ఆర్డీ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయంటే.. దానికి కారణం పోస్టాఫీసులు బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు (Post Office RD Interest rate) ఆఫర్ చేయడమే! అయితే పోస్టాఫీసు ఆర్డీ అకౌంట్ గురించి పూర్తి వివరాలు అందరికీ తెలియకపోవచ్చు. డిపాజిటర్లు ఈ పొదుపు పథకం కనీస, గరిష్ట కాల పరిమితులు, తదితర విషయాల గురించి తెలుసుకోవడం అత్యావశ్యకం. ఆ వివరాలు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ కాలపరిమితి (Post Office Recurring Deposit Tenure)
ప్రస్తుతం మీరు పోస్టాఫీసులో ఆర్డీ అకౌంట్ తెరవాలని భావిస్తుంటే.. తదుపరి 5 సంవత్సరాల పాటు ఒక్క వాయిదా కూడా మిస్ కాకుండా డిపాజిట్లు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్ కనీస కాలపరిమితి 5 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నెలనెలా డిపాజిట్ చేయగలిగేవారు మాత్రమే పోస్టాఫీసు ఆర్డీ అకౌంట్ తీసుకోవడం ఉత్తమం. మెచ్యూరిటీ పూర్తయ్యేంత వరకు కాలపరిమితి మార్చుకోవడం సాధ్యపడదు. ఈ కాలపరిమితి ముగిశాక కూడా ఆర్డీ అకౌంట్‌ను కొనసాగించాలనుకుంటే.. నిర్ణీత కాలపరిమితిని గరిష్టంగా మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
పోస్టాఫీసు నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిన వారు భవిష్యత్తులో మరో ఐదేళ్ల పాటు తమ ఖాతాని కొనసాగించవచ్చు. అంతేకాకుండా, పెంచిన మరో 5 ఏళ్లు ఆర్డీ డిపాజిట్లపై కూడా మునుపటిలాగా త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీసు తన ఆర్డీ ఖాతా గరిష్ట కాలపరిమితిని 10 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఆర్డీ ఖాతా ఓపెన్ చేసిన 10 ఏళ్ల తర్వాత వడ్డీ రేటుతో సహా పదేళ్లలో జమచేసిన మొత్తాన్ని డిపాజిటర్లు పొందుతారు.
ఐదు సంవత్సరాల వరకు ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయడం గ్రామీణులకు, పేదలకు సాధ్యంకాకపోవచ్చు కాబట్టి.. పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్‌లో కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.100గా నిర్ణయించారు. అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేయదలుచుకుంటే.. 10 గుణిజాల్లో రూ.110, రూ.120.. ఇలా ఎంతైనా సొమ్ము జమ చేసుకోవచ్చు. అయితే ఈ డిపాజిట్లకు గరిష్ఠ పరిమితంటూ ఏదీ లేదు. రూ. లక్ష యాభై వేల వరకు ఎంతైనా మీరు డిపాజిట్ చేయవచ్చు.
ఆర్డీ అకౌంట్ డిపాజిట్ తేదీలు
పోస్టాఫీసు ఆర్డీని తెరిచే వ్యక్తి మొత్తం 60 డిపాజిట్లు చెయ్యాల్సి ఉంటుంది. అంటే 5 ఏళ్ల పాటు ప్రతి నెలా ఒక డిపాజిట్ చేయడం తప్పనిసరి. అకౌంట్ తెరిచినప్పుడు మొదటి డిపాజిట్ చేయాలి. అకౌంట్ ఓపెనింగ్ తేదీని బట్టి ఓ నిర్దిష్ట తేదీకి ముందుగానే తదుపరి నెల డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఏదైనా ఒక నెలలో 1-15వ తేదీ మధ్య అకౌంట్ ఓపెన్ చేస్తే.. మీరు వచ్చే నెల 15లోగా డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. అదే, 15వ తేదీ తర్వాత ఖాతా తెరిస్తే.. 16వ తేదీ నుంచి నెలాఖరు లోగా తదుపరి డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్లు చేయవచ్చని ఖాతాదారులు గమనించాలి.
ఇండియా పోస్ట్ లో ఎన్ని ఆర్డీ అకౌంట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టాఫీసు ఆర్డీలో పెట్టుబడి పెట్టిన తర్వాత.. మెచ్యూరిటీ వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అయితే ఆర్డీ ఖాతాను తెరిచే సమయంలో ఉన్న వడ్డీ రేటే చివరి వరకు వర్తిస్తుంది. ప్రస్తుతానికైతే ఆర్డీలపై 5.8 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నారు. ఈ వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికానికి సవరిస్తుంటారు.
పోస్టల్ ఆర్డీ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ.. అవసరమైన పత్రాలు: (Documents for Post Office RD Account Opening)
పరిమిత ఆదాయం కలిగి చిన్న మొత్తాల్లో పొదుపు చేయగలిగిన ప్రజలకు పోస్టల్ ఆర్డీ పొదుపు పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ ఖాతాని 18 ఏళ్లు నిండిన వారితో సహా సంరక్షకుడి సహాయంతో మైనర్లు కూడా ఓపెన్ చేయొచ్చు. ముగ్గురు పెద్దవారు కలిసి జాయింట్ గా ఒకే అకౌంట్ కూడా తెరవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్లు కూడా ఖాతా తెరవచ్చు. ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లోనే పోస్టాఫీసు ఆర్డీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
ఆఫ్ లైన్లో కూడా ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందుకు అధికారిక ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా ఆర్డీ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి.. అందులో మీ వివరాలన్నీ పేర్కొనాలి. లేదంటే మీరు నేరుగా ఈ సమీపంలోని పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఆర్డీ ఫారం తీసుకోవచ్చు. దాన్ని పూరించిన తర్వాత పాన్ కార్డు వంటి కేవైసీ పత్రాలు, పాస్‌పోర్ట్-సైజ్ ఫొటోలను పోస్ట్ ఆఫీస్‌లో అందించాలి. తరువాత కనీస డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తే మీ ఖాతా రెండు రోజుల్లో యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటో పే ఆప్షన్ ఎంచుకొని పోస్ట్ ఆఫీసులో మీకున్న మీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ గా ప్రతినెలా డబ్బు చెల్లించవచ్చు.
ఐదేళ్లలో చెల్లించాల్సిన 60 డిపాజిట్లను ముందుగానే చెల్లించిన వారు తమ ఖాతాను మరో ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఇందుకు ఫారం-4 లో మీ వివరాలు తెలిపి పోస్టాఫీసులో అందించాల్సి ఉంది. ఖాతా తెరిచిన సమయంలోనే ముందస్తుగా 6 లేదా అంతకన్నా ఎక్కువ లేదా 12 డిపాజిట్లను ఒకేసారి చెల్లించి రాయితీలను పొందొచ్చు. ఒకవేళ ఖాతా తెరిచాక ఆర్థిక సమస్యలు చుట్టుముడితే.. 12 నెలల డిపాజిట్లు జమ చేశాక.. సగం డిపాజిట్లకు సమానమైన లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ తీసుకున్న తర్వాత దానిపై అయ్యే వడ్డీ తోపాటు లోన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఖాతా తెరిచే సమయంలో లేదా తర్వాతనైనా నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీ తీరకముందే మరణించినట్లయితే.. వారు కట్టిన డిపాజిట్ మొత్తం నామినీకి అందుతుంది. ఖాతాదారుడు ఎవరి పేరుని నామినీగా పేర్కొన్నారో వారు డెత్ క్లెయిమ్ పెట్టుకుని మెచ్యూరిటీ ముగిశాక లేదా ముగియకముందే డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణిస్తే వారి నామినీ.. ప్రొటెక్టెడ్ సేవింగ్స్ స్కీమ్ కింద పూర్తి మెచ్యూరిటీ వ్యాల్యూ పొందవచ్చని ఇండియా పోస్ట్ నిబంధనలు పేర్కొన్నాయి. ఒకవేళ నామినీ పేరు రాయకపోతే.. ఖాతాదారుని వారసులు రూ.లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ లక్ష రూపాయలు సెటిల్ చేస్తుంది కానీ అంతకుమించి చెల్లించేందుకు.. లీగల్ రుజువులు చూపించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అధికారులు కావలసిన ఎవిడెన్స్ అడిగినప్పుడు.. వారసులు అందించాల్సి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.