దేశంలోని నిరాశ్రయులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY). 2022 నాటికి అల్ప ఆదాయ కుటుంబాలు, మధ్య ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారి కోసం 2 కోట్ల గృహాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రారంభించింది. ఈ పథకం భారతదేశంలోని మహిళలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రాథమికంగా గిరిజనులు (Schedule Tribes), ఆదివాసీలు (Adivasis) వంటి నిర్లక్ష్యానికి గురవుతున్న సమూహాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. PMAY మార్గదర్శకాల (PMAY Guidelines) ప్రకారం, ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహాలను పొందుతారు.
PMAY పథకం లక్ష్యాలు | |
1 | చట్టబద్ధత కలిగిన వ్యక్తుల నేతృత్వంలో గృహాలను నిర్మించడం, మెరుగుపరచడం |
2 | క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా బలహీన వర్గాలకు అందుబాటు ధరలో ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించడం |
3 | భూమిని వనరుగా తీసుకొని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న మురికివాడల నివాసితుల పునరావాసం |
4 | ప్రైవేట్, ప్రభుత్వ నిధుల సహకారంతో అందుబాటు ధరలో గృహాల నిర్మాణం |
PMYA పథకం లక్షణాలు
ఈ పథకంలో భాగంగా ప్రజలు హోమ్ లోన్ పొందవచ్చు. గృహ రుణాలపై భారత ప్రభుత్వం వడ్డీ రాయితీని అందిస్తుంది.
హోమ్ లోన్‌పై సబ్సిడీ వడ్డీ రేటు సంవత్సరానికి 6.50% గా ఉంటుంది. లబ్ధిదారులందరికీ 20 సంవత్సరాల లోన్ గడువుకు ఈ వడ్డీ సబ్సిడీ ఆఫర్ వర్తిస్తుంది.
PMAY CLSS సబ్సిడీ కింద రూ. 2.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు
PMAY ఇళ్ల కేటాయింపు సమయంలో.. గ్రౌండ్ ఫ్లోర్‌లను కేటాయించడంలో సీనియర్ సిటిజన్‌లు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు.
మహిళల పేరుతో ఇంటి నిర్మాణాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
PMYA పథకం కింద ఇళ్ల నిర్మాణం కోసం సుస్థిరమైన, పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతికతతో ఇళ్లను నిర్మిస్తారు.
ఈ పథకం దేశంలోని మొత్తం పట్టణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. మొత్తం మూడు దశల్లో లక్ష్యం సాధించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
PM ఆవాస్ యోజనకు చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని భారతదేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో అమలు చేస్తున్నారు.
PMAY పథకంలో సాధారణ డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉంటుంది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్ప ఆదాయ వర్గాల వారికి.. గరిష్టంగా రూ.6 లక్షల హోమ్ లోన్ మొత్తంపై వడ్డీరేటు ఆఫర్ వర్తిస్తుంది. 20 ఏళ్ల పాటు 6.5 శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది.
మధ్య ఆదాయ వర్గాలలోని MIG-1 విభాగం కిందకు వచ్చే వారికి.. గరిష్టంగా రూ.9 లక్షల హోమ్ లోన్ మొత్తంపై, 20 ఏళ్ల వరకు నాలుగు శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది.
MIG-2 విభాగానికి చెందిన వారికి.. గరిష్టంగా రూ.12 లక్షల లోన్ మొత్తంపై, 20 ఏళ్ల వరకు 3 శాతం వడ్డీ రేటు సబ్సిడీ వర్తిస్తుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలు (PMAY Benefits)
కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లేదా PMAY పథకాన్ని ప్రారంభించింది. ఈ గృహనిర్మాణ పథకానికి ముందు కూడా కొన్ని స్కీమ్స్ అమల్లో ఉన్నాయి. అయితే PMAY ద్వారా గృహ రుణాలపై భారీ సబ్సిడీ, తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీంతోపాటు ఇతర హౌసింగ్ స్కీమ్‌లతో పోలిస్తే కొన్ని భిన్నమైన ఫీచర్లలో పాటు అదనపు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అవేంటంటే..
పీఎంఏవై సబ్సిడీ ( PMAY Subsidy)
PMAY ఇచ్చే అతిపెద్ద ప్రయోజనం సబ్సిడీ రేటు. ఇటీవల గృహ రుణాల వడ్డీ రేట్లు 10% కంటే ఎక్కువకు చేరుకున్నాయి. దీంతో సామాన్యులు ఈ రుణాలు పొందడం అసాధ్యంగా మారింది. అయితే PMAY పథకంలో ఒక వ్యక్తికి దాదాపు 6.5% వరకు సబ్సిడీ లభిస్తుంది. అంటే నెలవారీ వాయిదాల్లో భారీగా తగ్గింపు ఉంటుంది. గతంలో ఇతర గృహనిర్మాణ పథకాలకు సబ్సిడీ దాదాపు 1% ఉండేది. ఇప్పుడు ఇది భారీగా పెరిగింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఈ సబ్సిడీ ఎంతో మేలు చేస్తుంది.
మహిళలు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాలు
వితంతువులు, లింగమార్పిడి చేయించుకున్నవారు, వికలాంగులు, తక్కువ ఆదాయ వర్గాల పరిధిలోకి వచ్చే వృద్ధులు, మహిళలు PMAY ద్వారా ప్రయోజనం పొందవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సమూహాలకు చెందిన వ్యక్తులు ఈ పథకం కింద ఇళ్లను పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు తమ సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఫ్లాట్‌లను పొందవచ్చు.
అందరికీ ఇళ్లు ఇవ్వాలని టార్గెట్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల గృహాలను ప్రభుత్వం నిర్మిస్తుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించాయి. మొత్తం జనాభాలో కేవలం 40% మంది మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ అన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మిగిలిన జనాభా కూడా వారి జీవితాలను ఆస్వాదించేలా, వారికోసం సొంత ఇంటిని నిర్మించడం ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత.
దేశాభివృద్ధి మీద ఫోకస్
PMAY, ఇతర గృహనిర్మాణ అభివృద్ధి పథకాలు ప్రజలకు మాత్రమే కాకుండా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల అభివృద్ధితో దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్, సంబంధిత పరిశ్రమలు వృద్ధి చెందుతాయి.
PMAYతో పాటు ప్రభుత్వం మరికొన్ని పట్టణ గృహ నిర్మాణ పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలు వెనుకబడిన వర్గాల ప్రజలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులకు కూడా భారీ ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా దరఖాస్తుదారులు రూ. 1 లక్ష వరకు గ్రాంట్ పొందవచ్చు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పన్ను ప్రయోజనాలు
PMAY పథకం కింద వర్తించే అన్ని గృహ రుణాలపై GSTని 12% నుంచి 8% వరకు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ మేరకు లబ్ధిదారులు ప్రయోజనం పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.