Home /News /explained /

PAKISTAN JACOBABAD RECORDS 52 DEGREES HIGHEST TEMPERATURE IT IS TOO SEVERE FOR HUMAN TOLERANCE GH SK

Explained: నిప్పుల గుండంలా జకోబాబాద్‌.. ఏకంగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత.. మనుషులు తట్టుకుంటారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జకోబాబాద్ కర్కట రేఖకు దగ్గర్లో ఉంది. అంటే వేసవి నెలల్లో సూర్యుడు ఈ ప్రాతంపైకి నిట్ట నిలువుగా వస్తాడు. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి వీచే వేడి, తేమతో కూడిన గాలుల కారణంగా నగరంలో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ దాటింది.

పాకిస్థాన్‌లో వేసవి తాపానికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దాయాది దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న జకోబాబాద్‌ ప్రాంతంపై వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో జకోబాబాద్ ఒకటి. ఈ నగర జనాభా రెండు లక్షలు. వేసవి వచ్చిందంటే చాలు.. ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడతారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ సీజన్‌లో వడదెబ్బతో హాస్పిటళ్లకు వెళ్లేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. మానవులు తట్టుకోగల ఉష్ణోగ్రతలను (Threshold Temperature) సైతం ఇటీవల ఈ నగరం అధిగమించిందని నివేదికలు చెబుతున్నాయి.

గత వారం జకోబాబాద్‌లో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ (126 ఫారన్‌ హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రాస్ అల్ ఖైమా ప్రాతం తరువాత.. అంత తీవ్ర స్థాయిలో మానవులు తట్టుకోలేని ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా జకోబాబాద్ రికార్డులకు ఎక్కింది. ఈ సీజన్‌లో వడగాడ్పులు, వడదెబ్బ కారణంగా అధిక సంఖ్యలో మరణాలు నమోదవుతుంటాయి.

* ఆ నగరంలో వేడి తీవ్రత ఎందుకు పెరుగుతుంది?
జకోబాబాద్ కర్కట రేఖకు దగ్గర్లో ఉంది. అంటే వేసవి నెలల్లో సూర్యుడు ఈ ప్రాతంపైకి నిట్ట నిలువుగా వస్తాడు. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి వీచే వేడి, తేమతో కూడిన గాలుల కారణంగా నగరంలో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఇంత తీవ్ర స్థాయిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మానవులకు ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రమాదకరమైన ఉష్ణోగ్రత పరిమితిని దాటిన రెండు నగరాలు జకోబాబాద్, రాస్ అల్ ఖైమా మాత్రమేనని పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సింధు లోయ వెంబడి ఉన్న ఈ ప్రాంతం వాతావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితమవుతోందని తేల్చారు.

ఈ పరిసర ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని సైతం పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, వాతావరణ మార్పులకు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాల జాబితాలో సింధు లోయ మొదటి స్థానంలో ఉంటుందని చెబుతున్నారు బ్రిటన్‌లోని లాగ్‌బొరో యూనివర్సిటీ వాతావరణ విభాగ నిపుణులు టామ్ మాథ్యూస్. తీవ్రమైన వేడి, నీటి వనరుల వినాశనం వంటి విపత్తులకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉండవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు.

* ఆ పరిమితి దాటిటే ప్రమాదం..
వాతావరణంలో వేడి, తేమ రెండింటినీ పరిశోధకులు ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ ద్వారా గుర్తిస్తారు. తడిగా ఉన్న వస్త్రంతో కప్పిన థర్మోమీటర్ ఉపయోగించి వీటిని కొలుస్తారు. ఈ రీడింగులు సాధారణ (పొడి బల్బ్) రీడింగుల కంటే తక్కువగా ఉంటాయి. సాధారణ బల్బ్ రీగింగ్‌లు తేమను పరిగణనలోకి తీసుకోవు. వేడి వాతావరణంలో అధిక స్థాయిలో ఉండే తేమ మరింత ప్రమాదకరం. వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీల సెల్సియస్ దాటితే.. చెమట ద్వారా శరీరం చల్లబడే వ్యవస్థ పనిచేయదు. ఈ ఉష్ణోగ్రత కొన్ని గంటల పాటు కొనసాగితే, మన శరీరంలోని అవయవాలు వైఫల్యం కావడంతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* జకోబాబాద్‌లో వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీలు దాటడం ఇదే మొదటిసారా?
ఈ నగరంలో మానవ శరీరం తట్టుకోలేని ఉష్ణోగ్రత (threshold temperature) అనేకసార్లు నమోదైంది. 1987 జులైలో మొదటిసారి.. ఆ తరువాత 2005 జూన్‌లో, 2010 జూన్‌లో, 2012 జులైలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రతిసారీ ఈ థ్రెషోల్డ్ టెంపరేచర్ కేవలం రెండు గంటల వరకు మాత్రమే ఉంది. అయితే 2010 జూన్, 2001 జూన్, 2012 జులైలో మాత్రం.. మూడు రోజుల సగటు వెట్ బల్బ్ టెంపరేచర్ 34 డిగ్రీల సెల్సియస్ దాటింది. వేసవి సీజన్‌లో ఇక్కడ సాధారణ (డ్రై బల్బ్) ఉష్ణోగ్రత తరచుగా 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది.

* జకోబాబాద్‌ వాసుల పరిస్థితి ఏంటి?
వేసవిలో నమోదవుతున్న భయంకరమైన ఉష్ణోగ్రతలతో జకోబాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చాలా మంది తక్కువ ఆదాయ వర్గాల వారే ఉంటారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే ఏర్పాట్లు చేసుకునే సామర్థ్యం వారికి లేదు. విద్యుత్ కోతల కారణంగా వారు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే సీజన్‌లో కరాచీ లేదా క్వెట్టాకు వారు వలస వెళ్తుంటారు. మరికొందరు మాత్రం సోలార్ ప్యానెళ్లతో ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ ఆప్షన్లు చాలా మందికి అందుబాటులో లేవు.

అయితే దాదాపు ఇలాంటి వాతావరణమే ఉండే రాస్ అల్ ఖైమాలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. సంపన్న దేశమైన యూఏఈలో విద్యుత్ కొరత లేదు. అక్కడి ప్రజలు వేడి తీవ్రతను తట్టుకునే మార్గాలను సొంతంగా ఏర్పాటు చేసుకోగలరు. కానీ జకోబాబాద్ వాసులు మాత్రం తక్కువ ధరల్లో లభించే కూలర్ల పైనే ఎక్కువగా ఆధారపడతారు.

* ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయా?
ఇప్పటి వరకు జకోబాబాద్, రాస్ అల్ ఖైమాలో మాత్రమే ప్రాణాంతక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత తీవ్ర స్థాయిలో కాకున్నా.. వెట్ బల్బ్ టెంపరేచర్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. గత సంవత్సరం సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లోని తూర్పు, వాయువ్య తీర ప్రాంతాలు, పాకిస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో సైతం వేసవి నెలల్లో 31 డిగ్రీల సెల్సియస్ వెట్ బల్బ్ టెంపరేచర్ నమోదైంది.

గత ఏడాది భారతదేశంలో నమోదైన సగటు వార్షిక ఉష్ణోగ్రత 25.78 డిగ్రీల సెల్సియస్. అయితే వివిధ సీజన్లలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ డేటా చెబుతోంది. 2015లో భారత్, పాక్‌లో వ్యాపించిన హీట్ వేవ్ కారణంగా 4,000 మందికి పైగా చనిపోయారు. అయితే ఎర్ర సముద్రం, కాలిఫోర్నియా, మెక్సికో తీర ప్రాంతాలు సైతం ఇలాంటి వేడి ఉష్ణోగ్రతకు హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయని గత అధ్యయనాలు వెల్లడించాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International, International news, Pakistan, Summer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు