Home /News /explained /

ONE SIDE COVID ANOTHER SIDE NIPAH KERALA STATE FACES TWO VIRUS AT A TIME CAN A PERSON CONTRACT BOTH VIRUS WHAT EXPERTS SAY NK GH

Nipah Virus: కేరళలో నిఫా వైరస్.. కరోనా సోకిన వ్యక్తికి నిఫా సోకుతుందా?

కరోనా సోకిన వ్యక్తికి నిఫా సోకుతుందా? (image credit - twitter)

కరోనా సోకిన వ్యక్తికి నిఫా సోకుతుందా? (image credit - twitter)

Nipah Virus: మన దేశంలో వ్యాధులు, వైరస్‌లు ఎక్కువగా సోకేది కేరళలోనే. కరోనా కూడా మొదట వచ్చింది కేరళలోనే. తాజాగా అక్కడ నిఫా వైరస్ కూడా ప్రబలుతోంది.

Nipah Virus: ఇప్పటికే కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న కేరళను కొత్తగా నిఫా వైరస్​కూడా కలవరపెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్​సోకి ఇప్పటికే ఓ 12 ఏళ్ల పిల్లాడు (boy death) చనిపోగా... మరో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి నిఫా (nipah spread) సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెప్పింది. వెంటవెంటనే మూడు కేసులు రావడంతో.... నిఫా వైరస్‌ను ప్రారంభ దశలోనే కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం నడుం బిగించింది. నిఫా సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ సందర్భంగా నిఫా గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం.

కాంటాక్ట్ ట్రేసింగ్:
నిఫా వ్యాప్తిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. "12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్​తోనే మరణించినట్లు నిర్ధారించాం. ఆ బాలుడితో కాంటాక్ట్​అయిన వ్యక్తుల ట్రేసింగ్​ మొదలుపెట్టాం. ఇప్పటివరకు 188 కాంటాక్టుల (contact tracing)ను గుర్తించాం. వారిలో 20 మంది హైరిస్క్‌లో ఉన్నట్లు కనుగొన్నాం. వారిలో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఉన్నట్లు గుర్తించాం. వారిలో ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా.. మరొకరు కోజికోడ్​మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. నిఫా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని చెప్పారు.

హైరిస్క్‌లో ఉన్న వ్యక్తులందర్నీ ఐసోలేషన్​(isolation) సెంటర్లకు తరలించామని వీణా జార్జ్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లాడు నివసించిన ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధి వరకు ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కేరళలోనే మూడు సార్లు నిఫా వైరస్:
నిఫా వైరస్ 2018లో కేరళలోనే తొలిసారి వెలుగులోకి వచ్చింది. 2018 మే 19న కేరళలోని కోజికోడ్ జిల్లాలో తొలి కేసు నమోదైంది. 2018 జూన్ 1 నాటికి నిఫా వైరస్ కారణంగా 17 మరణాలు, 18 నిఫా కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నాటికి వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేసినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 2019 జూన్‌లో, మరోసారి ఒకరిలో నిఫా వైరస్ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ట చర్యలతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు నిఫాతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇప్పటివరకు నిఫా మూడుసార్లు బయటపడింది.

ఇదిలా ఉంటే, కోవిడ్ (coronavirus)​కేసుల్లోనూ కేరళ దేశంలోనే ముందుంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే దాదాపు 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. నిత్యం దాదాపు 30 వేల పాజిటివ్​కేసులు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు కరోనా వైరస్​.. మరోవైపు నిఫా వైరస్‌తో కేరళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇవి రెండూ ఒకేసారి ప్రజలకు సోకితే పరిస్థితి ఏంటనే భయం అక్కడి వారిని వెంటాడుతోంది.

నిపుణులు ఏం చెబుతున్నారు?
కరోనా సోకిన వ్యక్తికి నిఫా సోకే ప్రమాదముందా?.. అనే విషయం ఆసక్తికరంగా మారింది. దీనిపై డాక్టర్ అమర్ ఫెటిల్, డాక్టర్ టిఎస్ అనీష్, డాక్టర్ టిఎన్ సురేష్‌లతో కూడిన వైద్య నిపుణుల బృందంతో PTI సంస్థ మాట్లాడింది. ఈ విషయంపై వీరు మాట్లాడుతూ ‘‘గతంలో కేరళలో నిఫా వైరస్‌ రెండుసార్లు వచ్చింది. 2018, 2019లో నిఫా తొలిసారి వెలుగు చూసినప్పుడు ఇంకా కరోనా వైరస్ లేదు. అందువల్ల కట్టడి చేయడం కాస్త ఇబ్బందిగా మారింది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పీపీఈ కిట్లు, మాస్క్‌లు వంటి రక్షణ పద్ధతులు అమల్లో ఉన్నందున నిఫా వ్యాప్తి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నిఫా ఇన్ఫెక్షన్ ప్రసారం సాధారణంగా చిన్న క్లస్టర్లు, తక్కువ జనాభా గల ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిఫా కట్టడికి ఇంటెన్సివ్ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా కీలకం” అని తెలిపారు.

నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఫెటిల్ నిఫా ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ “ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. కరోనా సోకిన రోగుల్లోనూ ఇది సోకే అవకాశం ఉంది. వారి పరిస్థితి తీవ్రంగా మారిన తర్వాత.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. దీని సంక్రమణ వ్యాప్తి బయట వాతావరణంలో కంటే ఆసుపత్రిలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నప్పుడు, హాస్పిటల్స్‌లో పేషెంట్‌తో ఉన్న వ్యక్తులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి” అని చెప్పారు.

ఇది కూడా చదవండి: భూమిపై కంటే ఆ ఉపగ్రహంపైనే నీరు ఎక్కువ... జీవుల కోసం లోతుగా ఆన్వేషణ

కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిఫా కట్టడికి కూడా ఉపయోగపడతాయని ఈ నిపుణుల బృందం తెలిపింది. నిఫా లక్షణాలున్న వారు ఎవరికి వారే ఐసోలేషన్‌కు వెల్లాల్సిన అవసరం ఉందని, వ్యాధి నిర్ణారణ కోసం ముందుకు రావాలని వీరు కోరారు. నిఫాకు ప్రస్తుతం నివారణ లేదా వ్యాక్సిన్ లేనందున ఐసోలేషన్ చికిత్స అందించడమే ఏకైక నివారణ పద్ధతి అని తెలిపారు. అయితే ప్రస్తుతం కోవిడ్ -19 రోగులకు నిఫా సంక్రమించే ప్రమాదం తక్కువగా ఉంటుందని వీరు ముగ్గురూ విశ్లేషించారు.
Published by:Krishna Kumar N
First published:

Tags: Coronavirus, Covid -19 pandemic, Kerala, Nipah

తదుపరి వార్తలు