ONE DONATED A KIDNEY THE OTHER WROTE A STORY HOW THE TWO BECAME BAD ART FRIENDS EXPLAINED HERE JNK GH
ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ‘బ్యాడ్ ఆర్ట్ ఫ్రెండ్’ కథ ఎవరిది? రచ్చకెక్కి పరువు తీసుకున్న ఇద్దరు మిత్రులు ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 'బ్యాడ్ ఆర్ట్ ఫ్రెండ్స్' వెనుక అసలు స్టోరీ ఏంటి? (ప్రతీకాత్మక చిత్రం)
గతవారం #BadArtFriend అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ టాపిక్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ అంశంపై పడింది. దీనిపై ఆన్లైన్ డిబేట్లు, మీడియా కథనాలు నడిచాయి. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక కథ ఇలా నెట్టింట వైరల్‌గా మారింది.
గతవారం #BadArtFriend అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ (Twitter Top Trendings) టాపిక్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ అంశంపై పడింది. దీనిపై ఆన్లైన్ డిబేట్లు, మీడియా కథనాలు నడిచాయి. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక కథ ఇలా నెట్టింట వైరల్‌గా (Viral News) మారింది. ఇందులో ఇద్దరు మహిళా రచయితలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. వారిద్దరూ స్నేహితులో కాదో తెలియదు కానీ.. కచ్చితంగా ‘బ్యాడ్ ఆర్ట్ ఫ్రెండ్’ కావచ్చని న్యూయార్క్ టైమ్స్‌కు (NewYork Times) ఈ విషయంపై ఆర్టికల్ రాసిన రాబర్ట్ కోల్కర్ చెబుతున్నారు. ఈ బ్యాడ్ ఆర్ట్ ఫ్రెండ్ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం.
ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు?
నెట్టింట ట్రెండింగ్‌గా మారిన ఈ కథలో ఒకరి పేరు డాన్ డోర్లాండ్ (Don Dorland). ఆమె ఒక అమెరికన్ రచయిత్రి. 2015లో ఆమె ఒక మూత్రపిండాన్ని దానం చేసింది. నాన్-డైరెక్ట్ డొనేషన్ విధానంలో ఆమె దానం చేసిన కిడ్నీని ఎవరికి అమర్చుతారో తెలియదు. ఎందుకంటే ఆమె తన కిడ్నీని ప్రత్యేకించి ఎవరికీ ఇవ్వలేదు. డొనేషన్ చైన్ సిస్టమ్ ద్వారా ఆ అవయవాన్ని లబ్ధిదారులకు కేటాయిస్తారు. అంటే ఆమె ఎవరో ఒక అపరిచితుడికి కిడ్నీ దానం చేసిందని అర్థం. ఇది నిస్సందేహంగా గొప్ప విషయమే. అయితే ఈ అవయవ దానం గురించి ఆమె తన ఫేస్బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది.
కిడ్నీని దానం చేసిన తరుణంలో డోర్లాండ్ ఒక ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్‌ని ప్రారంభించింది. తన కుటుంబ సభ్యులను, స్నేహితులను గ్రూప్‌లోకి ఆహ్వానించింది. తాను దానం చేసిన కిడ్నీ ఎవరికి వెళ్తుందో.. అనే అంశంపై ఈ ఫేస్బుక్ గ్రూప్‌లో భావోద్వేగ లేఖ రాసింది డోర్లాండ్. ఈ లేఖ మొత్తం వివాదానికి ప్రధాన కేంద్రంగా మారింది.
ఈ గ్రూప్‌లోని స్నేహితులలో ఒకరు సోనియా లార్సన్. ఆమె కూడా ఒక రచయిత్రి. డోర్లాండ్కు ఆమె బాగా తెలుసు. గతంలో రైటర్స్ వర్క్ షాప్‌లో వీరు చాలాసార్లు కలుకున్నారు. ముందు నుంచి వీరి మధ్య పరిచయం ఉంది కానీ.. స్నేహం లేదు. కొన్నాళ్లకు డోర్లాండ్, లార్సన్ను స్నేహితురాలిగా భావించిన తరువాత కిడ్నీ దానం గురించి తాను చేసిన పోస్టులపై ఎందుకు స్పందించట్లేదని అడిగింది. అయితే లార్సన్ అప్పటికే కిడ్నీదానం గురించి ఒక చిన్న కథ రాయాలని నిర్ణయించుకుంది. డోర్లాండ్ ఫేస్బుక్ గ్రూప్‌లో పెట్టిన పోస్టు ఆధారంగానే లార్సన్ ప్రేరణ పొందింది. ఈ కథలో అవయవ దానానికి సంబంధించిన అంశాలన్నీ డోర్లాండ్ ఫేస్బుక్ పోస్ట్ నుంచి సంగ్రహించింది.
నల్లజాతి వ్యక్తికి కిడ్నీ దానం చేసిన తెల్లజాతి మహిళ
2016లో తన కిడ్నీని దానం చేసిన రోజుకు సరిగ్గా ఒక సంవత్సరం తరువాత, లార్సన్ తన గురించి ఒక కథ రాసినట్లు డోర్లాండ్ గుర్తించింది. నల్లజాతి వ్యక్తికి కిడ్నీని దానం చేసిన ఒక తెల్లజాతి మహిళ గురించి లార్సన్ కథ రాసినట్లు తెలిసింది. 'ది కైండెస్ట్' (The Kindest) అనే ఈ కథలో.. డోర్లాండ్ నిజనీవిత విశేషాలే ఉన్నాయి. ఆమెకు ఈ విషయం తెలియకుండానే లార్సన్ ఈ కథ రాసింది.
2018లో అమెరికన్ షార్ట్ ఫిక్షన్ ప్రింట్ మ్యాగజైన్ ఈ కథను ప్రచురించిన తరువాత.. ఈ స్టోరీని చదవాలని నిర్ణయించుకుంది డోర్లాండ్. లార్సన్ కథలో ఒక తెల్లజాతి మహిళ మూత్రపిండ దాతగా ఉంది. ఆమె గ్రహీతకు రాసిన లేఖ గురించి ప్రస్తావన ఉంది. కథలోని లేఖలో ఉపయోగించిన పదాలు, వాక్యాలన్నీ.. డోర్లాండ్ ఫేస్బుక్ గ్రూప్‌లో కిడ్నీ గ్రహీతకు రాసిన భావోద్వేగ లేఖకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై లార్సన్ను ప్రశ్నించింది డోర్లాండ్.
ఈ కథ కోసం డోర్లాండ్ నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను ప్రేరణగా తీసుకుంది లార్సన్. రచయితలు, కళాకారులు నిజ జీవితం నుంచి, వాస్తవిక వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది కాల్పనిక రచనలు, కళలు రూపొందించడం సాధారణ విషయం. అయితే ప్రస్తుత కథలోని ఈ ప్రేరణను డోర్లాండ్ ప్రశ్నించింది. దీంతో ఆమె బ్యాడ్ ఆర్ట్ ఫ్రెండ్ అని ప్రచారం ఊపందుకుంది. కానీ డోర్లాండ్ మాత్రం.. లార్సన్ కథలోని లేఖ దోపిడీ (plagiarism) అని భావించి, దీనిపై న్యాయ పోరాటం చేపట్టాలని నిర్ణయించుకుంది.
ఈ అంశంపై వీరిద్దరూ వ్యాజ్యాలు దాఖలు చేసుకున్నారు. ఫలితంగా ఇరు పక్షాలు కౌంటర్లు దాఖలు చేయాల్సి వచ్చింది. లార్సన్, ఆమె స్నేహితురాలు కలిసి డోర్లాండ్పై సృష్టించిన పుకార్లు, విమర్శించిన గ్రూప్ టెక్ట్స్, ఈమెయిల్‌లు బయటకు వచ్చాయి. లార్సన్ కల్పించి రాస్తున్న కథలో డోర్లాండ్ను లక్ష్యంగా చేసుకుందని చాట్ల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆమెపై బెదిరింపులు, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇద్దరూ రచ్చ చేసుకోవడంతో వివాదం నెట్టింట వైరల్
అయితే ఇరు పక్షాలు ఈ విషయంలో తమ స్థాయిని తక్కువ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. లాయర్లను పెట్టుకొని మరీ బజారుకెక్కడం ప్రజలకు నచ్చలేదు. క్రమంగా ఈ విషయం ఇంటర్నెట్కు ఎక్కింది. కళ (ఆర్ట్), కాపీ కొట్టడం (plagiarism), ఫిక్షన్ కోసం వ్యక్తుల నిజ జీవితంలోని నైతికతకు పణంగా పెట్టడం, గ్రూప్ టెక్ట్స్, విలువ లేని స్నేహం.. ఇలాంటి విషయాలపై నెటిజన్లు చర్చలు నడిపారు. ఈ క్రమంలో #BadArtFriend హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.