కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicran) అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. దీంట్లో భారీ స్థాయిలో బయటపడిన మ్యుటేషన్లు వైరస్ (Virus) వ్యాప్తి రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఈ కొత్త రూపాంతరం చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు 50 మ్యుటేషన్లు ఉండటమే ఇందుకు కారణం. ఒమిక్రాన్ వేరియంట్‌కు చాలా వేగంగా పరివర్తన చెందగల సామర్థ్యం ఉంటుంది. దీంతో ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు (Corona Vaccines) ఈ కొత్త వేరియంట్‌పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత వ్యాక్సిన్ ఒమిక్రాన్‌పై తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని బ్రిటిష్ కంపెనీ మోడెర్నా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎందుకు పనిచేయవు? దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ అవసరమా? ఈ వేరియంట్‌కు మోడెర్నా సంస్థ తయారు చేసే mRNA వ్యాక్సిన్ ఏది? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఇప్పటికే ఉన్న టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎందుకు పనికిరావు?
ఒమిక్రాన్ అత్యంత వేగంగా మ్యుటేషన్ చెందగలదు. WHO దీన్ని ఆందోళనరకం వేరియంట్‌గా (వేరియంట్ ఆఫ్ కన్సర్న్) గుర్తించింది. దాని స్పైక్ ప్రోటీన్‌లోనే 30 మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే వైరస్ మానవ కణాలలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుత వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా దానితో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. అయితే ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లోని మరిన్ని మ్యుటేషన్లు (Mutations) ప్రస్తుత వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా ఉంటాయనే అంశంపై ఆందోళనలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లను చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన అసలు కరోనా వైరస్ (Corona Virus) జాతికి అనుగుణంగా రూపొందించారు. అయితే ఒమిక్రాన్ జాతి దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీంతో వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒమిక్రాన్ టీకా గురించి మోడెర్నా కంపెనీ ఎందుకు హెచ్చరిస్తోంది?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రస్తుత టీకాలు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని బ్రిటిష్ కంపెనీ మోడెర్నా తెలిపింది. పాతతరం కరోనా జాతులతో పోలిస్తే ఒమిక్రాన్ వంటి కొత్త జాతులపై ప్రస్తుత వ్యాక్సిన్లు తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చని సంస్థ CEO స్టీఫెన్ బెన్సెల్ చెప్పారు. కొత్త వేరియంట్‌కు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ డోసులు తయారు చేయడానికి ఫార్మా కంపెనీలకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని బెన్సెల్ హెచ్చరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో గుర్తించిన పదునైన ఉత్పరివర్తనాలకు అనుగుణంగా ప్రస్తుత వ్యాక్సిన్లను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్‌కు కొత్త వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై తక్కువ ప్రభావవంతంగా లేదా పూర్తిగా అసమర్థంగా ఉంటున్నాయనే వాదనలతో, కొత్తరకం వ్యాక్సిన్లపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌కు వ్యాక్సిన్ 2022 ప్రారంభంలో వస్తుందని బ్రిటీష్ కంపెనీ మోడెర్నా చెబుతోంది. ఈ సంస్థ ఇప్పటికే mRNA కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన మరో కంపెనీ ఫైజర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. అవసరమైతే ఆరు వారాల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయగలమని, మొదటి డోసులను 100 రోజుల్లో అందుబాటులో ఉంచగలమని తెలిపింది.
WHO ఇప్పటివరకు ఎన్ని కరోనా వ్యాక్సిన్లను ఆమోదించింది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది కరోనా వ్యాక్సిన్లను గుర్తించింది. వాటి వినియోగాన్ని ఆమోదించింది.
కరోనా వ్యాక్సిన్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది?
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఎనిమిది కరోనా వ్యాక్సిన్లను మూడు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ రకం. మరొకటి వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. మూడోది ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఈ టీకాలను తయారు చేసిన విధానం, పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది.
వివిధ రకాల కరోనా వ్యాక్సిన్లు ఎలా పని చేస్తాయి?
మెసెంజర్ RNA (mRNA) వ్యాక్సిన్లు:
ఈ వ్యాక్సిన్లు మెసెంజర్ RNA (mRNA) కోడ్లను కలిగి ఉంటాయి. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత ఇవి శరీరంలో కరోనావైరస్ ప్రోటీన్ వెర్షన్లను తయారు చేస్తాయి. అప్పుడు శరీరం వాటిని శత్రువులుగా గుర్తిస్తుంది. అనంతరం వాటిని ఎదుర్కోవడానికి రోగనిరోధక కణాలు ప్రోటీన్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసుకుంటాయి. ఇలా రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతాయి. అనంతరం వీరు నిజంగానే కరోనా వైరస్ బారిన పడితే, ఈ యాంటీబాడీలు వైరస్‌కి వ్యతిరేకంగా పోరాడి, ఇన్ఫెక్షన్ను నిరోధిస్తాయి.
Explained: ప్రమాదకరంగా కోవిడ్ కొత్త వేరియంట్లు.. వాక్సిన్‌లతోనే పిల్లలకు రక్ష?
వైరల్ వెక్టర్ వ్యాక్సిన్:
ఇది క్యారియర్ వ్యాక్సిన్. ఇందులో హాని చేయని అడెనోవైరస్‌ను జెనిటికల్ ఇంజనీరింగ్ చేసి, వైరల్ వెక్టర్‌గా రూపొందిస్తారు. ఈ వైరస్ వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి వెళ్లి కణాలకు చేరుకున్నప్పుడు, ఈ స్పైక్ ప్రొటీన్ కాపీలు తయారవుతాయి. మీ కణాల ఉపరితలాలపై స్పైక్ ప్రొటీన్లు ఏర్పడినప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను, తెల్ల రక్తకణాలను తయారు చేస్తుంది. కరోనా వైరస్ సోకినప్పుడు, ఈ యాంటీబాడీలు వైరస్‌తో పోరాడతాయి.
ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్:
వీటి తయారీలో చనిపోయిన లేదా ఇన్ యాక్టివేటెడ్ వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ ఇన్ యాక్టివేటెడ్ వైరస్ దానంతట అది అభివృద్ధి చెందదు. ఇది మిమ్మల్ని ఎలాంటి అనారోగ్యానికి గురిచేయదు. అయితే వ్యాక్సిన్ (Vaccine) ద్వారా ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు, సహజ ఇన్ఫెక్షన్ మాదిరిగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. తరువాత కరోనా వైరస్ సోకినా, రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా వైరస్‌పై దాడిచేసి ఇన్ఫెక్షన్ను నయం చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronacorona virus, Covid -19 pandemic, Delta Variant, Omicron corona variant