Multi Mode Hand Grenades: భారత సైన్యం అమ్ముల పొదిలో కొత్త అస్త్రం.. మల్టీమోడ్ గ్రెనేడ్ల కోసం ఆర్డర్.. వీటి ప్రత్యేకత తెలుసా?

భారత సైన్యంలో కొత్తగా రాబోతున్న ఈ హ్యాండ్ గ్రెనేడ్ల ప్రత్యేకతలు తెలుసా? (Representational Image)

భారత సైన్యం అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరనుంది. దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన మల్టీ-మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్‌(MMHG)ను త్వరలోనే భారత సైనికులకు ఇవ్వనున్నారు.

  • Share this:
భారత సైన్యం అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరనుంది. దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన మల్టీ-మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్‌(MMHG)ను ఆర్మీ ఉపయోగించనుంది. వీటి కోసం నాగ్‌పూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఒప్పదంలో భాగంగా రూ.400 కోట్లకు 10 లక్షల యూనిట్ల MMHG లను ఆర్డర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన వింటేజ్ 'మిల్స్ బాంబ్' రకం 36M హ్యాండ్ గ్రెనేడ్‌లను ఉపయోగిస్తోంది. వీటి స్థానంలో సరికొత్త, అత్యాధునిక హ్యాండ్ గ్రెనేడ్‌లను రక్షణ శాఖ ఆర్మీకి కేటాయించనుంది. ఈ నేపథ్యంలో MMGH ప్రత్యేకతలేంటి, ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న బాంబుల కంటే వీటికి ఎందుకు ప్రాధాన్యం దక్కిందనే వివరాలు తెలుసుకుందాం.

* ప్రస్తుతం ఎలాంటి గ్రెనేడ్లు ఉపయోగంలో ఉన్నాయి?
20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా మిలటరీ దళాలు ఫ్రాగ్మెంటేషన్ గ్రెనేడ్‌లను ఉపయోగించడం ప్రారంభించాయి. వాటి కేసింగ్‌లను.. పేలుడు తరువాత మరింత హాని కలిగించేందుకు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేలా రూపొందించారు. ఇవి పైనాపిల్ ఆకారంలో ఉండేవి. బయటి విభాగాలు, పొడవైన కమ్మీలు కేసింగ్ విచ్ఛిన్నానికి సహాయపడేలా వీటిని రూపొందించారు. ఆ తరువాత కాలంలో మరింత మెరుగైన డిజైన్లలో, పొడవైన కమ్మీలు, విభాగాలతో వీటిని అప్‌గ్రేడ్ చేశారు. పైనాపిల్ వంటి డిజైన్‌ను కూడా మంచి పట్టు కల్పించేలా మార్చేశారు.

భారత సైన్యం చాలా సంవత్సరాలుగా పాతకాలపు 36M హ్యాండ్ గ్రెనేడ్‌లను ఉపయోగిస్తోంది. ఈ నంబర్‌ను 'మిల్స్ బాంబ్' వేరియంట్‌కు గుర్తుగా భావిస్తారు. బ్రిటిష్ మూలాలు ఉండే ఈ గ్రెనేడ్‌లు పైనాపిల్ ఆకారంలో ఉంటాయి. వీటిని రైఫిల్ నుంచి కూడా కాల్చవచ్చు. భారత సాయుధ దళాల కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (OFB) 36M గ్రెనేడ్‌లను తయారుచేస్తోంది.

* మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ ప్రత్యేకతలు
MMHGని అభివృద్ధి చేసిన DRDOలోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL).. ఈ కొత్త గ్రెనేడ్‌లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ‘నేచురల్ ఫ్రాగ్మెంటేషన్ రకానికి చెందిన గ్రెనేడ్‌లను పదాతిదళాలు ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ 36M గ్రెనేడ్‌లనే ఉపయోగిస్తుంది. ఇందులో ఉండే కొన్ని సమస్యలు, అసమాన ఫ్రాగ్మెంటేషన్ (శకలాలు) నమూనా వంటివి.. గ్రెనేడ్లను విసిరేవారికి కూడా ప్రమాదకరంగా మారవచ్చు. ఈ లోపాలను అధిగమించడానికి మల్టీ-మోడ్ గ్రెనేడ్‌లను అభివృద్ధి చేశాం. వీటి తయారీలో తేలికపాటి స్థూపాకార స్టీల్‌ ఫ్రాగ్మెంట్స్‌ను ఉపయోగించాం’ అని టీబీఆర్‌ఎల్‌ ప్రకటించింది.

MMHGలను రక్షణ (defensive), ప్రమాదకర దాడి (offensive) అవసరాల కోసం ఉపయోగించవచ్చు. భారతదేశంలో ఇప్పటి వరకు భద్రతా దళాలు ఉపయోగిస్తున్న గ్రెనేడ్‌లు ప్రధానంగా డిఫెన్సివ్ మోడ్ గ్రెనేడ్‌లు. సైనికులు ఏదైనా షెల్టర్‌లో లేదా మూసివేసిన నిర్మాణాల్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని విసరడానికి వీలుంటుంది. టార్గెట్ ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని విసిరేసి, శకలాల విచ్ఛిన్నం ద్వారా అవతలి వారికి హాని తలపెట్టవచ్చు. అయితే అఫెన్సివ్ గ్రెనేడ్లు ఇలా విచ్ఛిన్నం కావు. వీటిని విసిరిన వారు సురక్షితంగా ఉంటారు. దీంతోపాటు గ్రెనేడ్ పేలిన తరువాత టార్గెట్‌కు తీవ్రమైన హాని కలిగిస్తుంది.

MMHG డిఫెన్సివ్ మోడ్ గ్రెనేడ్.. ఒక ఫ్రాగ్మెంటింగ్ స్లీవ్‌తో, 10 మీటర్ల వ్యాసార్థం సామర్థ్యాన్ని కలిగి ఉంది. అఫెన్సివ్ గ్రెనేడ్ మాత్రం స్లీవ్ లేకుండా ఉంటుంది. దీన్ని ప్రధానంగా పేలుడు కోసం, టార్గెట్‌ స్పృహతప్పి పడిపోయేందుకు ఉపయోగించవచ్చు. ఇది పేలిన ప్రదేశం నుంచి 5 మీటర్ల రేడియస్‌ వరకు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

* MMHGలను సరఫరా చేసే సంస్థ ఏది?
ఈ సరికొత్త గ్రెనేడ్ల సరఫరా కోసం రక్షణ శాఖ ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్ లిమిటెడ్ (EEL) సంస్థతో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ కంపెనీ నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ గ్రూప్ అనుబంధ సంస్థ. భారత సైన్యానికి మొత్తం 10 లక్షల MMHGలను సరఫరా చేసేందుకు రూ. 409 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. గ్రెనేడ్ ఫీల్డ్ టెస్ట్‌లను నిర్వహించడానికి DRDO నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కంపెనీకి సాంకేతికతను బదిలీ చేసింది. ఈ గ్రెనేడ్‌లను అన్ని రకాలుగా పరీక్షించారు. ఇవి 99 శాతం భద్రత, విశ్వసనీయతను సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విషయానికి సంబంధించి రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇది DRDO, రక్షణ శాఖ ఆధ్వర్యంలో కుదుర్చుకున్న పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్.. అత్యాధునిక సాంకేతికతతో ఆత్మ నిర్భరతకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ గ్రెనేడ్లను వంద శాతం దేశీయంగా అభివృద్ధి చేయడం విశేషం" అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వినూత్న గ్రెనేడ్ల అభివృద్ధి ప్రక్రియ దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో DRDO, ఆర్మీ వర్గాలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్దు సంస్థ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. ఒక్కసారి తయారు చేసిన గ్రెనేడ్లను సాధారణ పరిస్థితులలో నిల్వ చేస్తే, ఉత్పత్తి చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు వాటిని వాడుకోవచ్చని ఈఈఎల్‌ సంస్థ వెల్లడించింది. వీటి తయారీలో అదనపు భద్రత కోసం ట్విన్ డిలే ట్యూబ్‌లు, ప్రాణాంతకమైన నష్టానికి కారణమయ్యే 3800 యూనిఫాం శకలాలు (ఫ్రాగ్మెంట్లు) ఉపయోగించినట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Published by:John Naveen Kora
First published: