ఫోన్‌పే, గూగుల్‌పే వంటి నగదు బదిలీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక చెల్లింపు విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో ఇతరులకు నగదు బదిలీ చేయాలంటే బ్యాంకుల వద్ద గంటలకొద్ది క్యూలైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ యూపీఐ సర్వీసుల ద్వారా ఈ తిప్పలు తప్పాయి. అయితే, ఇదంతా బాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ యూజర్స్‌కు చిరాకు తెప్పిస్తుంటాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ ద్వారా అకౌంట్లో డబ్బులు కట్ అయినా సరే అవతలి వ్యక్తి ఖాతాలో డబ్బులు జమ కావు. దీనిపై ఆర్‌బిఐకి అనేక ఫిర్యాదులు వచ్చాయి.
2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంబుడ్స్‌మన్ పథకాల నివేదిక ప్రకారం, భీమ్, గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి యుపీఐ ఆధారిత మొబైల్ యాప్‌లలో ట్రాన్స్క్షన్ ఫెయిల్యూర్స్‌పై దాదాపు 44 శాతం ఫిర్యాదులు వచ్చాయి.- వీటికి చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నడుం బిగించింది. యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి భీమ్ యాప్‌లో ‘యూపీఐ-హెల్ప్’ అనే ఆప్షన్‌ను ప్రారంభించింది. దీని కోసం ఉచిత గ్రీవెన్స్ రిజల్యూషన్ మెకానిజంను అందుబాటులోకి తెచ్చింది.
భీమ్ యూపీఐ- హెల్ప్ ఫీచర్‌తో ఉపయోగం
మీ BHIM UPI యాప్‌ను ఉపయోగించి మీరు ఒక వ్యక్తికి లేదా వ్యాపారికి డబ్బు బదిలీ చేసే క్రమంలో మీ బ్యాంక్ ఖాతా నుండి నగదు డెబిట్ అవుతుంది. కానీ. బదిలీ ప్రాసెస్ చేయబడుతుందని యాప్ మీకు చూపిస్తుంది. అటువంటి సమస్యను పరిష్కరించడానికి భీమ్ యూపీఐ హెల్త్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ భీమ్ యూపీఐ ఫీచర్ పెండింగ్‌లో ఉన్న లావాదేవీల స్టేటస్‌ను చెక్ చేసుకోవడం కోసం, ప్రాసెస్ చేయని లేదా మీరు పంపే నగదు అవతలి వ్యక్తి ఖాతాకి చేరకపోతే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా బిజినెస్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా చేయవచ్చు.
ఏ ఏ బ్యాంకులు ప్రారంభించాయి?
లావాదేవీలు ఆగిపోయినా, పెండింగ్‌లో ఉన్నా.. యూపీఐ హెల్త్ మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారుల కోసం భీమ్ యాప్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, టీజేఎస్బీ కో ఆపరేటివ్ బ్యాంక్ వినియోగదారులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి .
ఫిర్యాదు ఎలా చేయాలి?
భీమ్ యూపీఐ యాప్‌లో మీకు ‘రెయిజ్ ఎ కంప్లెయింట్’ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అందులో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి. అప్పుడు, మీకు రెయిజ్ కన్సర్న్, కాల్ బ్యాంక్.అనే రెండు ఆప్షన్లు ఇవ్వబడతాయి. ఒకవేళ మీరు లావాదేవీతో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, రెయిజ్ కన్సర్న్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ సమస్యను ఆన్లైన్లో సమర్పించండి. అప్పటికీ పరిష్కారం కాకపోతే, మీరు BHIM యాప్ కస్టమర్ హెల్త్‌లైన్ నంబర్ 1800-120 174కు కాల్ చేయండి.
‘గెట్ ఇన్ టచ్’ సర్వీస్ అంటే?
‘గెట్ ఇన్ టచ్’ అనేది కస్టమర్ కేర్ ప్లాట్‌ఫామ్. ఇది భీమ్ యుపీఐ సంబంధిత ఫిర్యాదులను నమోదు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. లాగిన్, రిజిస్ట్రేషన్, లావాదేవీ, క్యాష్‌బ్యాక్, పిన్, బ్యాంక్ ఖాతా మొదలైన వాటికి సంబంధించిన ఏవైనా సమస్యలను దీనిలో నమోదు చేయవచ్చు. మీ ఫిర్యాదు నమోదు చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
స్టెప్ 1: భీమ్ యుపీఐ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ‘గెట్ ఇన్ టచ్’ పేజీకి వెళ్లండి. అక్కడ, మీరు కంప్లెయింట్, క్వారీ, ఫీడ్‌బ్యాక్ అనే మూడు విభాగాలను కనుగొంటారు.
స్టెప్ 2: ఫిర్యాదు విభాగంలో ట్రాన్సాక్షన్ / పేమెంట్స్ / క్యాష్ బ్యాక్ / లాగిన్ వంటి ఆప్షన్లను ఎంచుకోవాలి.
స్టెప్ 3: మీ ఫిర్యాదును క్లుప్తంగా వివరించడానికి ప్రతి ఫిర్యాదులో ఇష్యూ రకం, మీ వర్చువల్ పేయిమెంట్ అడ్రస్ (వీపీఏ), లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కామెంట్ బాక్స్ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలను నింపిన తర్వాత, క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. మీ ఫిర్యాదుకు ప్రతిస్పందనగా BHIM UPI కస్టమర్ సపోర్ట్ టీం మీ రిజిస్టర్డ్ ఈ–మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.