Mixing Vaccines: ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది?.. నిపుణుల సమాధానమిదే..

ప్రతీకాత్మక చిత్రం

ఫస్ట్ డోస్ ఒక కంపెనీ తీసుకొని, సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై పరిశోధన జరుగుతోంది.

  • Share this:
కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా అదే డోస్ తీసుకోవాలి. వ్యాక్సిన్ సంస్థలు ప్రస్తుతం ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. అయితే, దీనికి భిన్నంగా ఫస్ట్ డోస్ ఒక కంపెనీ తీసుకొని, సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై పరిశోధన జరుగుతోంది. వ్యాక్సిన్ల “మిక్స్ అండ్ మ్యాచ్” తో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? అనే దానిపై త్వరలోనే భారత్‌లో ఒక ప్రయోగం చేపట్టనున్నారు. అయితే, ఇప్పటికే ఈ విధానాన్ని ఇతర దేశాలు పరీక్షిస్తున్నాయి. భారత్‌లో దీని పరిశీలనకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది.

కోవిడ్-19 వ్యాక్సిన్లను కలిపితే ప్రయోజనాలేంటి?
ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది: రెండవ డోసు వేరే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్‌కు వ్యతిరేకంగా శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టీకా మొదటి డోస్ తీసుకున్నప్పుడు శరీరంలో స్పైక్ ప్రోటీన్‌ అభివృద్ధి అవుతుంది. ఇక టీకా రెండో డోస్ తీసుకోగానే శరీరంలో మరిన్ని యాంటీబాడీలు అభివృద్ధి అవుతాయి. అయితే ఫస్ట్ డోస్లో తీసుకున్న వ్యాక్సిన్ కాకుండా సెకండ్ డోస్లో వేరే వ్యాక్సిన్ తీసుకుంటే అడెనో వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లాహరియా అన్నారు.

మ్యుటేషన్స్, వేరియంట్స్: వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాలతో అభివృద్ధి చేసిన టీకాలు.. అన్నివైరస్ మ్యుటేషన్లు, వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ వ్యాక్సిన్ కలయికలు SARS-CoV-2 వైరస్ మ్యూటెంట్లు లేదా వేరియంట్లపై వ్యతిరేకంగా విస్తృత రక్షణను అందించగలవు. దీనిపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ సిద్ధాంతపరంగా, వ్యాక్సిన్ల మిక్సింగ్ అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రెండో డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్యూనిటీ సులభంగా పెంచుకోవచ్చు. అయితే, దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది.” అని అన్నారు.

వ్యాక్సిన్ల కొరతకు పరిష్కారం
ప్రస్తుతం దేశంలోని జనాభా అవసరాలకు తగ్గట్లు వ్యాక్సిన్ ఉత్పత్తి జరగడం లేదు. ఇది వ్యాక్సిన్ వేగవంతమై ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారింది. వ్యాక్సిన్ల షార్టేజీ కారణంగా అనేక రాష్ట్రాల్లో 18 నుంచి 44 ఏళ్ల వయసులో ఉన్నవారికి ప్రభుత్వ టీకాల కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. అందువల్ల వ్యాక్సిన్ మిక్సింగ్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ డోస్ తీసుకున్న వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే.. సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా టీకా ప్రక్రియ ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

మరింత భద్రత
ఆస్ట్రాజెనెకా సహకారంతో రూపొందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో కొంతమందికి రక్తం గడ్డకట్టిన సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా జర్మనీ, ఫ్రాన్స్, యుకె, కెనడా వంటి దేశాలు చిన్న వయస్సు వారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేశాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్ మిక్సింగ్ బాగా పనిచేస్తుంది. ఫస్ట్ డోస్ కొవిషీల్డ్ తీసుకున్న వారు రెండో డోస్లో వేరే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, వారికి మరింత రక్షణగా నిలుస్తుంది.

వ్యాక్సిన్ మిక్సింగ్‌తో ప్రధాన ఆందోళనలు ఏమిటి?
భద్రతపై అనుమానాలు
కోవిడ్ -19 టీకాలు ఆరు నెలల క్రితం దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు పొందాయి. అయితే, వాటిని కలిపి ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే దానిపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా చేయడం ఎంత వరకు సురక్షితం? ఈ విధానం మంచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందా? అనే ప్రశ్నలపై ఇంకా లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది.

అన్‌స్టెస్టెడ్ కాంబినేషన్స్
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతో ఇప్పటివరకు మిక్స్ అండ్ మ్యాచ్ విధానం అమలు చేయలేదు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని 20 మంది గ్రామస్తులు అనుకోకుండా కోవాగ్జిన్‌ రెండో డోస్ తీసుకోవడానికి బదులు కోవిషీల్డ్‌ తీసుకున్నారు. వారిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించినట్లు తేలింది.

వ్యాక్సిన్స్‌లో వైవిధ్యాలు
కోవిడ్ -19 వ్యాక్సిన్‌ మిక్స్ అండ్ మ్యాచ్ గురించి పరిశీలిస్తున్న కోయిలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు దీనితో వచ్చే సమస్యలను హైలైట్ చేశాయి. ఈ వ్యాక్సిన్ల షెల్ఫ్ జీవిత కాలంలో తేడాలు, రవాణా, నిల్వ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని తెలిపాయి. ఈ వైరుధ్యాల కారణంగా ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

సైడ్ ఎఫెక్ట్స్
వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగంగా కొంత మందిలో ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చి, ఆస్ట్రాజెనెకా సెకండ్ డోస్ ఇచ్చారు. దీని వల్ల వారిలో దుష్ప్రభావాలు పెరిగాయని తేలింది.
Published by:Sumanth Kanukula
First published: