Home /News /explained /

MEKEDATU PROJECT HOW TAMIL NADU AND KARNATAKA EXPANDS CAUVERY WATER DISPUTE WITH NEW MEKEDATU PROJECT DETAILS HERE NK GH

Explained: కావేరి నది వివాదం. మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు

మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు

మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు

Mekedatu Project: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది జలాల సమస్య ఎలా ఉందో... తమిళనాడులో అలాగే... కావేరీ నదిపై నిర్మించబోతున్న మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

Mekedatu Project: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఎన్నోసార్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయస్థానం మెట్లు ఎక్కినా, సమస్యకు పరిష్కారం దక్కలేదు. తాజాగా ఈ విషయం మరో కొత్త మలుపు తిరిగింది. కావేరి నదిపై కర్ణాటక నిర్మించతలపెట్టిన మేకేదాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడుకు... కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా జతకలిసింది. ఈ పరిస్థితుల మధ్య అసలు ఈ వివాదానికి కారణమేంటి? మేకెదాటు డ్యాంను తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

మేకెదాటు ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో... తమిళనాడు సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగర జిల్లాలో మేకెదాటు అనే ప్రాంతం ఉంది. 2019 ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు దగ్గర రిజర్వాయర్ నిర్మాణ ప్రణాళికలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించింది. దాదాపు రూ.9వేల కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరుకు తాగునీటి సరఫరా కోసం ఈ డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదించింది. కావేరి, దాని ఉపనది అర్కావతి కలిసే సంగమం దగ్గర ఈ ఆనకట్ట రావాలని, సుమారు 66 వేల TMC నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కూడా కర్ణాటక నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Explained: జర్మనీ, బెల్జియంలో భీకర వరదలకు కారణమేంటి? ఇంత విలయం ఎందుకొచ్చింది?

ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. తమిళనాడు చాలా కాలంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుతో తమిళనాడుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్టాలిన్‌కు భరోసా ఇవ్వడానికి యడియూరప్ప ప్రయత్నించారు. కావేరి జలాల్లో తన వాటాను పొందడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని లేఖలో తెలిపారు. ఇది అందరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నామని, రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరారు. అయితే ఈ ప్రాజెక్టుపై తమిళ పార్టీలు, ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

* ముందు నుంచి వివాదాలే:
కావేరి జలాలపై కర్ణాటక, తమిళనాడు మధ్య విభేదాలు శతాబ్దం పైనుంచే కొనసాగుతున్నాయి. 1892లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కావేరి నది నీటిపారుదల వ్యవస్థలను నిర్మించడానికి బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్ని మైసూరు రాచరిక రాష్ట్రం విభేదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వివాదాలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: శ్మశానంలో లాటరీ... అద్దెకు ఆరడుగుల స్థలం... ఆరేళ్లకోసారి శవ మార్పిడి.. ఏ దేశంలో అంటే...

1924లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నిర్మాణానికి మార్గం సుగమం చేయడానికి కావేరి జలాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల కేటాయింపులపై ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి 50 ఏళ్ల కాలపరిమితి ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపును నిర్ణయించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ తమిళనాడు కేంద్రాన్ని కోరడంతో.. వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 1990లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 2007లో తుది కేటాయింపులు పూర్తయ్యాయి. తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది.

అయితే ఈ కేటాయింపులపై తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాలూ అసంతృప్తి వ్యక్తంచేశాయి. రెండు రాష్ట్రాల్లో నిరసనలు, హింసలు జరిగాయి. చివరకు ఈ విషయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 2018లో తమిళనాడు వాటాలో 14.75 టీఎంసీలను కర్ణాటకకు కేటాయిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నూతన కేటాయింపుల్లో తమిళనాడుకు 404 టీఎంసీల వాటా ఉండగా... కర్ణాటక వాటా 284.75 టీఎంసీలకు పెరిగింది. కేరళ, పుదుచ్చేరి వాటాలు మాత్రం మారలేదు.

* కేంద్రానికి తమిళనాడు విజ్ఞప్తి:
తాజాగా మేకెదాటు ఆనకట్ట పనులను ఆపేది లేదని కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వెళ్లడం తమ హక్కు అని కర్ణాటక నొక్కి చెబుతోంది. ఈ విషయంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కలిసి సమాలోచనలు జరిపారు. అయితే తమిళనాడు మాత్రం ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీని కలిసి లేఖ కూడా ఇచ్చారు. తమిళనాడు కూడా జలశక్తి శాఖ మంత్రితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, కర్ణాటకపై ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం పళనిస్వామి సైతం తన హయాంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమ నీటి వాటా సైతం ప్రశ్నార్థకమవుతోందని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సైతం వాదిస్తోంది.

ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే సమస్యలు రాజకీయ, వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. చామరాజ నగర్ రామనగర జిల్లాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్ట కారణంగా కావేరి అభయారణ్యం, సమీప పరివాహక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, చామరాజనగర్ అడవుల్లో జీవావరణాన్ని సైతం ఈ ప్రాజెక్టు ప్రభావితం చేస్తుందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాన్ని కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Published by:Krishna Kumar N
First published:

Tags: Karnataka, Tamil nadu

తదుపరి వార్తలు