LAUNCHED BY PM MODI KASHI VISHWANATH CORRIDOR PROJECT EXPLAINED IN 10 POINTS MKS
Explained: కాశీ విశ్వనాథ్ కారిడార్ అంటే ఏంటి? ఇది pm modi డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకైంది?
ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్
ఉత్తరప్రదేశ్‌లోని పురాతన నగరమైన వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు ఫేజ్-1ను మోదీ సోమవారం ప్రారంభించారు. కాశీ విశ్వనాథుని ఆలయం కొత్త కాంప్లెక్స్ కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదని, సనాతన సంస్కృతికి ప్రతీక అని చెప్పారు. ఇంతకీ దీని విశిష్టతలేవో తెలుసా?
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్‌లోని పురాతన నగరమైన వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు ఫేజ్-1ను మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కారిడార్‌ను ప్రారంభించడానికి ముందు, ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులను ప్రధాని మోదీ పూలమాలతో సత్కరించారు. కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటూ ఈ గ్రాండ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కార్మికులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. గతంలో మూడు వేల చదరపు అడుగులుగా ఉన్న ఆలయ విస్తీర్ణాన్ని ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులతో సహా 50 నుంచి 75 వేల మంది భక్తులు ఆలయానికి సులభంగా రావచ్చని తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆలయం కొత్త కాంప్లెక్స్ కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదని, సనాతన సంస్కృతికి ప్రతీక అని చెప్పారు. భారతదేశం ఆధ్యాత్మిక ఆత్మకు, దేశ ప్రాచీనత, సంప్రదాయాలకు కాశీ విశ్వనాథుడి ఆలయం ఒక చిహ్నమని మోదీ పేర్కొన్నారు.
తన లోక్‌సభ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ప్రధాని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష చెట్టును నాటారు. దేవాలయంలో శివునికి గంగా జలం, చందనం, బూడిద, పాలు సమర్పించారు. డబల్ డెక్కర్ బోట్ అయిన అలకనంద క్రూయిజ్‌లో ఆలయానికి చేరుకున్న మోదీ, గంగా నదిలో పుణ్యస్నానం చేశారు.
* కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలు..
1. కాశీ నగరంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఈ పవిత్ర నగరానికి యాత్రికులు, భక్తులు వస్తుంటారు. పవిత్ర గంగా నదిలో స్నానం చేసి, గంగాజలాన్ని తీసుకువచ్చి, కాశీ విశ్వనాథుని దేవాలయంలో సమర్పించే పురాతన ఆచారం అమల్లో ఉంది. అయితే నిరంతరం రద్దీగా ఉండే వీధులు, పరిసరాలతో యాత్రికులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సరైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
2. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు, గంగా నది ఒడ్డు వరకు కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. గంగానది ఘాట్ల వరకు భక్తులు సులభంగా చేరుకోగల ఈ ప్రాజెక్టుకు 2019 మార్చి 8న ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.
3. దాదాపు రూ.339 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ దశలో మొత్తం 23 భవనాలను ఆయన ప్రారంభించారు.
4. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఈ భవనాల్లో అనేక రకాల సౌకర్యాలను అందిస్తారు. తాజాగా ప్రారంభమైన భవనాల జాబితాలో యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, భోగశాల, సిటీ మ్యూజియం, వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ వంటివి ఉన్నాయి.
5. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆలయ కారిడార్‌ను ఇప్పుడు దాదాపు 5 లక్షల చదరపు అడుగుల వరకు భారీగా విస్తరించారు. ఇంతకుముందు అన్ని ప్రాంగణాలు కేవలం 3000 చదరపు అడుగుల్లోనే విస్తరించి ఉండేవి.
6. ఈ ప్రాజెక్ట్ కోసం కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ ఉన్న 300 కంటే ఎక్కువ ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు కొన్నింటిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 1400 మంది దుకాణదారులు, అద్దెదారులు, ఇంటి యజమానులకు పునరావాసం కల్పించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీంతో పనులకు ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు.
7. ప్రాజెక్టు విషయంలో స్వాధీనాలు లేదా పునరావాసానికి సంబంధించి దేశంలోని ఏ కోర్టులోనూ ఎలాంటి వ్యాజ్యం పెండింగ్‌లో లేవు. ఇదే ఈ ప్రాజెక్టు విజయానికి నిదర్శనం.
8. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ, అన్ని వారసత్వ కట్టడాలను సంరక్షించాలని మోదీ సంకల్పించారు. ఇందుకు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక్కడి పాత ఆస్తులను ధ్వంసం చేసేటప్పుడు.. 40 కంటే ఎక్కువ పురాతన దేవాలయాలను అధికారులు తిరిగి కనుగొన్నారు. ఈ ఆలయాలను పునరుద్ధరించి సుందరీకరించారు.
9. సోమవారం సాయంత్రం 6 గంటలకు మోదీ గంగా ఆరతిని వీక్షిస్తారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్‌లో సద్గురు సదాఫలదేయో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారు.
10. రెండు రోజుల పర్యటన సందర్భంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే సమ్మేళనంలో కూడా ప్రధాని పాల్గొంటారు. బీహార్, నాగాలాండ్‌ల డిప్యూటీ సీఎంలు సైతం హాజరవుతారు. ఈ సదస్సు పాలనకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, టీమ్ ఇండియా స్ఫూర్తిని పెంపొందించాలనే ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా ఉంటుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.