ఒకప్పుడు సంప్రదాయ పెట్టుబడి ఆప్షన్లలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (Post Office Scheme) , బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) ముందు వరుసలో ఉండేవి. ప్రభుత్వ మద్దతు ఉండటం, నష్టభయం లేకపోవడం, నిర్ణీత వడ్డీ రేటు హామీ ఉండటంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే క్రమంగా బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గాయి. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) నుంచి అధిక రాబడులు రావడంతో ఇప్పుడు చాలామంది ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరైనా డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు అనేక ఆలోచనలు చేస్తారు. ఎందులో పెట్టుబడి పెడితే రాబడి బాగా ఉంటుందని రకరకాల విశ్లేషణలు చేస్తారు. కొంత డబ్బు చేతిలో ఉందంటే.. చాలామంది బ్యాంకులో దాచడం లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం గురించే ఆలోచిస్తారు.
గతంలో ఇతర పెట్టుబడి సాధనాలు లేకపోవడం, బ్యాంకులు కూడా మంచి వడ్డీ రేటు ఇస్తుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆదరణ పొందాయి. సేవింగ్స్ ఖాతాలోనూ చాలా మంది డబ్బు ఉంచేవాళ్లు. రెండేళ్ల క్రితం వరకు కూడా సేవింగ్స్ ఖాతాలోని మొత్తంపై మంచి వడ్డీ లభించేది. అయితే వివిధ కారణాలతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో క్రమంగా వీటికి ఆదరణ క్షీణిస్తోంది.
ఇదే సమయంలో దీర్ఘకాలంలో మంచి రాబడి అందించే పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై ప్రజల ఆసక్తి పెరుగుతోంది. కానీ సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాగా మ్యూచువల్ ఫండ్ నుంచి స్థిరమైన రాబడిని మనం ఆశించలేం. దీనికి కారణాలు ఉన్నాయి.
సేవింగ్స్ అకౌంట్ అనేది క్యాష్ మేనేజ్‌మేంట్ కోసం ఉపయోగపడుతుంది. అంటే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపేందుకు మాత్రమే వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు స్థిరమైన వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో సేవింగ్స్ అకౌంట్స్‌లో ఉండే మొత్తాలపై బ్యాంకులు నామ మాత్రపు వడ్డీ ఇస్తున్నాయి. ఈ డిపాజిట్లను సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణించరు. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు సమీక్షిస్తుంటాయి.
FDల్లో పెట్టుబడిని ఉంచాల్సిన వ్యవధితో పాటు వడ్డీ రేటును కూడా బ్యాంకులు ముందుగానే నిర్ణయిస్తాయి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉండవచ్చు. అయితే అన్ని బ్యాంకులు బయటి అంశాలతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి, నిర్దిష్ట డిపాజిట్లకు తప్పకుండా ఫిక్స్‌డ్ వడ్డీ చెల్లిస్తాయి. కాబట్టి మార్కెట్ ప్రభావం ఆ రాబడిపై ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం ఉండదు కాబట్టి వాటిపై రాబడికి బ్యాంకులు గ్యారెంటీ ఇస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది పొదుపును అలవాటు చేస్తుంది. రిటైర్‌మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో ఉంటే దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై వడ్డీ నెలవారీ లేదా ప్రతీ మూడు నెలలకు పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రాబడి అనేది ఒక ఫిక్స్‌డ్ సమయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. రాబడి ఎంత ఉంటుంది, ఎంత కాలం ఫిక్స్‌డ్ చేయాలన్నది డిపాజిట్ చేసే వ్యక్తి కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకునే సంస్థ నిర్ణయిస్తుంది. మీరు ఆరు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా, సదరు సంస్థ ఐదేళ్లకే డిపాజిట్ తీసుకోవచ్చు. ఈ సందర్భంలో మీ రాబడి ఆ ఐదు సంవత్సరాలకు మాత్రమే లభిస్తుంది. అంతే కాదు మీకు ఒకవేళ హఠాత్తుగా కొంత మొత్తం డబ్బు అవసరమైతే తీసుకోవడానికి వీలుండదు. అలా కావాలనుకుంటే మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫండ్ పెట్టుబడి పెట్టిన మార్గం, స్టాక్ మార్కెట్ కదలికలు, ఫండ్ మ్యానేజ్ చేసే టీమ్‌తో పాటు పెట్టుబడి సమయం ఎంత అన్నది మ్యూచువల్ ఫండ్లలో రాబడిని నిర్ణయిస్తుంది. వీటిల్లో చాలా విషయాలు అనిశ్చితితో కూడుకున్నవి గనుక ఫండ్స్‌లో పెట్టుబడిపై రాబడికి హామీ ఉండదు. స్టాక్ మార్కెట్ పనితీరుతోనే మ్యూచువల్ ఫండ్స్ పోకడలు పూర్తిగా ఆధారపడి ఉంటాయి కాబట్టి స్థిరమైన రాబడి ఉండదు. వీటిన్నింటికీ తోడు మ్యూచువల్ ఫండ్స్‌ను మ్యానేజ్ చేసేందుకు రకరకాల పేర్లతో వివిధ ఫండ్ కంపెనీలు ఛార్జీలు వసూలు చేస్తాయి. మరో వైపు మ్యూచువల్ ఫండ్స్‌పై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ పన్ను ఉంటుంది. వీటన్నింటిపైనే రాబడి ఆధారపడి ఉంటుంది.
ఇక బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికొస్తే మీరు డిపాజిట్ చేసే మొత్తాన్ని ఆ బ్యాంకులు రుణం రూపంలో వ్యాపార సంస్థలకు ఇస్తాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ పెట్టే పెట్టుబడి కూడా ఆ ఫండ్ నిర్వహించే సంస్థలు తమ దగ్గర సమకూరిన మొత్తంతో స్టాక్ మార్కెట్స్‌లో షేర్లు కొనుగోలు చేస్తాయి. ఏ రూపంలో పెట్టుబడి అయినా అది తిరిగి వ్యాపారంలోకి పెట్టుబడిగా వెళ్తుంది. కాబట్టి ఆ వ్యాపారాలతో ముడిపడి ఉన్న రిస్క్ మీ పెట్టుబడికి వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. అయితే పెట్టుబడిదారులు రిస్క్ ఫ్యాక్టర్‌కు లోబడి దీర్ఘకాలం పాటు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే.. వీటి ద్వారా కూడా స్థిరమైన రాబడి ఉంటుంది. ఫండ్స్‌లో కనీసం 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మంచి రాబడి అందుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. గత 20 సంవత్సరాల ట్రెండ్‌ను చూస్తే.. మ్యూచువల్ ఫండ్స్ సగటున 12.3 శాతం రాబడిని అందించాయి. ఇవి కనీసం 5.5 శాతం.. అంటే ప్రస్తుతమున్న ఎఫ్‌డీ రేట్లతో సమానమైన రాబడిని అందించాయి.
వీటన్నింటి ఆధారంగా చూస్తే.. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు వేటికవే ప్రత్యేకమని తెలుస్తోంది. రాబడి ఆధారంగా వీటిని పోల్చడం కష్టం. ఎందుకంటే ఈ మూడింటికీ నిర్దిష్ట అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. సాధారణ అవసరాల కోసం సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లను ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం నష్టభయం లేని మార్గంగా ఎఫ్‌డీని ఎంచుకోవచ్చు. ఇదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధిని ఆశించేవారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mutual Funds, Personal Finance, Save Money