Home /News /explained /

KNOW WHY GOLD LOANS RAISED DURING COVID 19 AFFECTED PERIOD HERE IS THE DETAILS AK GH

Gold loans: ఎలాంటి అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టవచ్చు.. అసలు గోల్డ్ లోన్ మంచిదేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold Loans: ఒకవైపు ఆదాయం క్షీణత, మరోవైపు మహమ్మారి నేపథ్యంలో ఊహించని వైద్య ఖర్చుల కారణంగా చాలామంది గోల్డ్ లోన్లను ఆశ్రయించారని బ్యాంకుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కరోనా మహమ్మారి వెలుగు చూసిన తరువాత వ్యక్తులు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. గత 15 నెలల్లో మధ్యతరగతి కుటుంబాలు, పేదల ఆదాయ మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకవైపు ఆదాయం క్షీణత, మరోవైపు మహమ్మారి నేపథ్యంలో ఊహించని వైద్య ఖర్చుల కారణంగా చాలామంది గోల్డ్ లోన్లను ఆశ్రయించారని బ్యాంకుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జూన్ 1 నుంచి 2021 మే నెలాఖరు వరకు చూస్తే.. కమర్షియల్ బ్యాంకులు అందించిన గోల్డ్ లోన్లు 33.8 శాతం పెరిగాయి. చాలా మంది ప్రజలు తక్షణ అవసరాల కోసం బంగారు ఆభరణాలపై లోన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సందర్భాల్లో గోల్డ్ లోన్ తీసుకోవాలి? బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల చెల్లింపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. వంటి వివరాలు తెలుసుకుందాం.

* గోల్డ్ లోన్లు ఎంత వరకు పెరిగాయి?
భారత్‌లో గత ఏడాది మార్చిలో కరోనా మొదటి దశ తీవ్రత పెరిగింది. అప్పటి నుంచి బ్యాంకుల కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ గత 12 నెలల్లో బ్యాంకులు ఇచ్చిన గోల్డ్ లోన్ల వాటా రూ.46,415 కోట్ల నుంచి రూ.62,101 కోట్లకు పెరిగింది. 2020 మార్చి తరువాత గోల్డ్ లోన్ల వాటా ఏకంగా 86.4 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ డేటా చెబుతోంది. ఇది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల్లో నమోదైన గణాంకాలు మాత్రమే కావడం గమనార్హం. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ లోన్ సంస్థలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. బకాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోవిడ్ తరువాత బ్యాంకుల్లో గోల్డ్ లోన్ విభాగం చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసింది. ఇంతకుముందు గోల్డ్ లోన్లపై పెద్దగా ఆసక్తి చూపని ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం.. ఈ విభాగంపై దృష్టి పెట్టాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన గోల్డ్ లోన్లు ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

* ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెరిగాయి?
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, తక్కువ ఆదాయ వర్గాల వారు ఎక్కువగా గోల్డ్ లోన్లకు మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇంటి నిర్మాణం, ఆరోగ్యం, విద్య, పెళ్లి ఖర్చుల కోసం గోల్డ్ లోన్‌ను ఆశ్రయిస్తారు. చిన్న వ్యాపారాల వర్కింగ్ క్యాపిటల్ కోసం కూడా గోల్డ్ లోన్లపై ఆధారపడతారు. అయితే గతేడాది కేంద్రం విధించిన లాక్‌డౌన్, ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీంతో చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు సైతం సక్రమంగా చెల్లించలేకపోయాయి. ఫలితంగా చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. దీంతో గోల్డ్ లోన్ల వాటా భారీగా పెరిగింది.మహమ్మారి తరువాత బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో గోల్డ్ లోన్లకు డిమాండ్ పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం గోల్డ్ లోన్ల విలువ రూ.344,800 కోట్లుగా ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.4,05,100 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

* గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
ప్రభుత్వ రంగ బ్యాంకులు గోల్డ్ లోన్ బిజినెస్‌ను ప్రవేశ పెట్టిన తరువాత.. ఈ విభాగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్లపై 10 శాతం వరకు వడ్డీ రేటు విధిస్తుండగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని 7.5 శాతానికే పరిమితం చేసింది. అయితే వడ్డీ రేటు తక్కువగా ఉన్నంత మాత్రాన గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. గోల్డ్ లోన్ ఆప్షన్ మంచిదా కాదా అనేది.. మనం ఎలాంటి అవసరాల కోసం లోన్ తీసుకుంటున్నామనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

ఆదాయ వనరులు సరిగ్గా లేనప్పుడు గోల్డ్ లోన్‌ను ఎంచుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా బ్యాంకులకు లోన్ తిరిగి చెల్లించకపోతే.. తాకట్టు పెట్టిన బంగారాన్ని సంస్థలు వేలం వేస్తాయి. అయితే స్వల్పకాలిక మూలధన అవసరాలకు నిధులు సమకూర్చడానికి, పేమెంట్ సైకిల్‌ను కవర్ చేయడానికి చిన్న వ్యాపారాల నిర్వాహకులు గోల్డ్ లోన్‌ను ఆశ్రయించవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. నగదు లభ్యత విషయంలో తాత్కాలిక ఒత్తిడిని ఎదుర్కొనే చిన్న వ్యాపారవేత్తలకు గోల్డ్ లోన్ మంచి ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. నగదు లభ్యత పెరిగిన తరువాత.. బంగారు రుణాన్ని తిరిగి సంస్థలకు చెల్లించవచ్చు.

అయితే కోవిడ్ తరువాత వ్యాపార వర్గాల భవిష్యత్తును ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇప్పటికే దెబ్బతిన్న చిన్న వ్యాపారవేత్తలు గోల్డ్‌ లోన్‌ తీసుకోకూడదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు దివాలా నిబంధనలను (Insolvency and Bankruptcy Code- IBC) పాటిస్తూ, కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు.

* లోన్‌కు బదులుగా బంగారాన్ని అమ్మడం మంచిదా?
సంప్రదాయ ఆస్తులలో బంగారం ప్రధానమైనది. సాధారణంగా ఇంతకు ముందే కొన్న బంగారు ఆభరణాలను ఎవరూ అమ్మాలనుకోరు. అయితే ఆదాయ మార్గాలు తీవ్రంగా ప్రభావితమై, అప్పుల బారిన పడినవారు.. బంగారంలో కొంత మొత్తాన్ని అమ్మి, అప్పు తీర్చడం మంచిది. ఈ విషయంలో అనవసర భావోద్వేగాలకు గురికాకూడదు. ఇలాంటి సంక్షోభంలో అప్పు తీసుకోవడానికి బదులుగా బంగారాన్ని అమ్మడమే మంచి ఆప్షన్‌. పరిస్థితి మెరుగుపడిన తరువాత ఎప్పుడైనా బంగారాన్ని తిరిగి కొనుగోలు చేయవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Gold loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు