Oxygen crisis: దేశంలో ఆక్సిజన్​ సంక్షోభానికి కారణలేంటి ? దీని నుంచి బయటపడే మార్గాలేంటి ?

ప్రతీకాత్మక చిత్రం

ఆక్సిజన్​ కొరతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆక్సిజన్​ కొరతపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ముందస్తు సన్నదత లేకపోవడమే పెద్ద ఎత్తున మరణాలకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫస్ట్​వేవ్​ నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఉంటే మౌలిక సదుపాయాలు మెరుగుపడేవి. దీంతో అనేక మంది ప్రాణాలు కాపాడుకునేవాళ్లమని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ఆక్సిజన్​ కొరత తీవ్రంగా వేదిస్తోంది. అనేక మరణాలకు ఇదే కారణంగా నిలుస్తోంది. దీంతో ఆక్సిజన్​ కొరతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆక్సిజన్​ కొరతపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇండస్ట్రీల అవసరాలకు ఆక్సిజన్ వాడకాన్ని హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది.

ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేయడానికి కావాల్సిన ఇనుమును నౌక ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. సింగపూర్ నుంచి విమానాల ద్వారా ఆక్సిజన్​ కంటెయినర్లను తీసుకువస్తున్నారు. ఫ్రాన్స్ నుండి పోర్టబుల్ ఆక్సిజన్ జనరేటన్లను దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాల్లో వాడే ఇండస్ట్రియల్​ గ్రేడ్ ఆక్సిజన్‌ను యుద్ధ ప్రాతిపదికన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌గా మారుస్తున్నారు. రైల్వే శాఖ కూడా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్​ ప్రారంభించింది. అత్యవసర ప్రదేశాలకు దీన్ని సరఫరా చేస్తోంది. దేశంలోని ప్రతి జిల్లాలో పిఎస్‌ఎ ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి పీఎం కేర్స్​ ఫండ్​ ద్వారా డబ్బులు అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు పెద్ద ప్రైవేట్ సంస్థలు విదేశీల నుండి క్రయోజెనిక్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటితో ఆక్సిజన్​ కొరత అధిగమించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది.

ఢిల్లీని వేధిస్తోన్న ఆక్సిజన్ కొరత
గత వారం రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతుంది. దీంతో, తమకు సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ పారిశ్రామిక సంస్థలకు లేఖలు రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆక్సిజన్ సంక్షోభం ఎందుకు పెరిగింది?
అయితే, ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, వాస్తవంలో మాత్రం అది కనిపించడం లేదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత వేధిస్తోంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించకపోవడం వల్ల మరణిస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. లక్నో, పాట్నా, పూణే, జైపూర్​, భోపాల్, ముంబై ఇలా ఎక్కడ చూసినా సరే ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కొల్పోతున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది.

ఫస్ట్​ వేవ్​లో ఎందుకు కొరత లేదు?
కరోనా ఫస్ట్​ వేవ్​ గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. సగటున 1000 నుండి -1200 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ కొరతను దేశంలోని స్థానిక ఆక్సిజన్​ ప్లాంట్ల ద్వారా తీర్చగలిగారు. అయితే, 2020 ఏప్రిల్ నాటికి, కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి, కాని ఇప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ 1500MT స్థాయిని దాటలేదు. అయితే, సెప్టెంబర్ నాటికి, కరోనా కేసులు తగ్గడం ప్రారంభించాయి. దీంతో ఆక్సిజన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో అప్పుడు ఆక్సిజన్​ కొరత ఏర్పడలేదు.

అంచనా వేయని ప్రభుత్వాలు
కరోనావైరస్ సెకండ్​ వేవ్​ ఇంతలా విజృంభిస్తుందని ప్రభుత్వాలు, పాలకులు ఊహించలేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. రాజకీయ నాయకులు మాస్క్​ ధరించకుండానే ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. వీటితో పాటు వందలాది మందితో వివాహాలు, వేలాది మందితో రాజకీయ ర్యాలీలు జరిగాయి. కరోనా అంతమైందనే భావనలో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా మార్గదర్శకాలను పట్టించుకోలేదు. దీని పర్యవసానాలు ఇప్పుడు అనుభవవించాల్సి వస్తోంది.

ఆరు రెట్లు పెరిగిన ఆక్సిజన్ డిమాండ్
ఫస్ట్​ వేవ్​లో మూడు లక్షల కేసులు చేరుకోవడానికి కొన్ని వారాలు పట్టింది. కానీ, సెకండ్​ వేవ్​లో రోజుకు మూడు లక్షలకు మించి కేసులు నమోదవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్​వేవ్​ను చాలా వివేకంతో ఎదుర్కొన్న భారత్​, సెకండ్​ వేవ్​ను మాత్రం అంచనా వేయలేక చతికిల పడింది. కరోనా తీవ్రత పెరుగుతండటంతో హాస్పిటల్​లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆక్సిజన్ డిమాండ్​ భారీగా పెరగడానికి కారణమైంది. ఫస్ట్​ వేవ్​లో 1500MT ని మించని ఆక్సిజన్ డిమాండ్, ఇప్పుడు 6000MT స్థాయికి పెరిగింది. అయితే, ఫస్ట్​ వేవ్​ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉండటమే ప్రస్తుత ఆక్సిజన్​ కొరతకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
ఆక్సిజన్​ కొరతపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్రం ఎట్టకేలకు 551 జిల్లాల్లో పిఎస్‌ఎ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పిఎం కేర్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చుతామని తెలిపింది. ఆక్సిజన్​ కొరత తీవ్రంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో 8 ప్లాంట్లను స్థాపించాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలని కోరినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం సకాలంలో సైట్లు అందుబాటులో ఉంచలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ 8 ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తుంటే, ఇప్పుడు సుమారు 14.50MT ఆక్సిజన్ ఢిల్లీలో అందుబాటులో ఉండేదని, పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని చెబుతోంది.

ప్రజా ఆరోగ్యం ఎవరి బాధ్యత?
దేశంలోని ఆక్సిజన్​ కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్ని బిజెపియేతర పార్టీలు పాలించే రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ఒక్క ఆక్సిజన్ విషయంలోనే కాదు వెంటిలేటర్, వ్యాక్సిన్ల విషంలోనూ కేంద్రం సరిగ్గా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగం ప్రకారం ప్రజల ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అని బీజేపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. కరోనా యుద్ధానికి పోరాడటానికి అవసరాలను తీర్చడంలో రాష్ట్రాలు సహకరించలేదని వారంటున్నారు. ఆరోగ్య అంశాన్ని ఒకే జాబితాలో చేర్చాలని ఆర్థిక కమిషన్ సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించలేదని స్పష్టం చేస్తున్నారు.

సామాన్య ప్రజలు పోషించాల్సిన పాత్ర?
ఆక్సిజన్ సరఫరా చేస్తున్న వ్యక్తులు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి. లేకపోతే ఆక్సిజన్ అత్యవసరమైన వారికి అందుబాటులో ఉంచడం చాలా కష్టతరం అవుతుంది. సాధారణంగా వెంటిలేటర్​పై ఉన్న ఒక కరోనా రోగికి గంటకు 60 లీటర్ల ఆక్సిజన్​ అవసరం. అదే. 24 గంటలకు వేలాది లీటర్ల అవసరం ఏర్పడుతుంది. కాబట్టి రోగులకు అసరమైన ఆక్సిజన్​ సిద్ధంగా ఉంచాలి. అంతేకాక, పర్యావరణ పరిరక్షణ పేరిట ఆక్సిజన్​ మొక్కల పెంపకానికి కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్స్ అనుమతివ్వాలి. ఉదాహరణకు తమిళనాడులోని వేదాంత ప్లాంట్​ 1000MT ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు. కాని, ఈ ప్లాంట్​ ఏర్పాటుకు కోర్టు అనుమతించలేదు. ఇప్పుడు ఆ ప్లాంట్​ అందుబాటులో ఉండి ఉంటే కొంత మేర ఆక్సిజన్​ కొరత తీరిపోయేది. అందువల్ల, ఇకనైనా ప్రస్తుత పరిస్థితి నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
First published: