హోమ్ /వార్తలు /Explained /

Assam-Mizoram Dispute: అస్సాం-మిజోరాం సరిహద్దు వివాదానికి కారణాలేంటి? సమస్య ఎలా మొదలైంది? పూర్తి విశ్లేషణ

Assam-Mizoram Dispute: అస్సాం-మిజోరాం సరిహద్దు వివాదానికి కారణాలేంటి? సమస్య ఎలా మొదలైంది? పూర్తి విశ్లేషణ

ఇటీవల అసోం మిజోరాం మధ్య సరిహద్దు గొడవ కారణంగా కనిపించిన దృశ్యాలు

ఇటీవల అసోం మిజోరాం మధ్య సరిహద్దు గొడవ కారణంగా కనిపించిన దృశ్యాలు

గత ఏడాది అక్టోబర్‌లో అస్సాం, మిజోరాం వాసులు ఈ భూభాగం కోసం రెండుసార్లు ఘర్షణ పడ్డారు. అప్పట్లో ఒక డజను మంది గాయపడ్డారు.

ఇటీవల అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో ఇరువైపులా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జులై 26న సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఘర్షణల్లో ఆరుగురు అస్సాం పోలీసులు చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూభాగం ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో అస్సాం, మిజోరాం వాసులు ఈ భూభాగం కోసం రెండుసార్లు ఘర్షణ పడ్డారు. అప్పట్లో ఒక డజను మంది గాయపడ్డారు. ఆ తరువాత నుంచి వివిధ కారణాలతో ఈ ప్రాంతంలో అనేక హింసాత్మక సంఘటనలు వెలుగుచూశాయి. గతంలో 1987లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే ఈ వివాదం 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలన నాటి నుంచే కొనసాగుతోంది.

* వలస పాలన నుంచే వివాదం

1875లో దేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడే అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య బోర్డర్‌కు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కచార్ మైదానాలు (ప్రస్తుతం అస్సాంలో ఉంది), లుషాయ్ హిల్స్ మధ్య సరిహద్దును ఈ నోటిఫికేషన్‌ నిర్దేశించింది. తరువాత లుషాయ్ హిల్స్‌ పేరు మిజోరాంగా మారింది. ఆ తరువాత 1933లో అప్పటి రాచరిక రాష్ట్రమైన మణిపూర్.. లుషాయ్ హిల్స్ నుంచి తమ ప్రాంత సరిహద్దును మరోసారి గుర్తించింది. లుషాయ్ హిల్స్, అస్సాంలోని కచార్ జిల్లా మీదుగా మణిపూర్ ఈ సరిహద్ధును గుర్తించింది. అయితే తమ ప్రమేయం లేకుండానే ఈ సరిహద్ధును గుర్తించారని మిజోరాం చెబుతోంది. అందువల్ల ఈ బోర్డర్‌ను రాష్ట్రం అంగీకరించలేదు. 1875 నోటిఫికేషన్ గుర్తించిన సరిహద్దు మాత్రమే అసలైనదని మిజోరాం ముందు నుంచి వాదిస్తోంది.

అప్పటి నుంచి 1875 నోటిఫికేషన్ ఆధారంగానే సరిహద్దును గుర్తించాలని మిజోరాం డిమాండ్ చేస్తోంది. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ (BEFR) చట్టం-1873 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. 1933 సరిహద్దు నిర్ధారణ నోటిఫికేషన్ సమయంలో అసలు తమను సంప్రదించలేదని మిజోరాం సమాజం చెబుతోంది. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వం మాత్రం 1933 సరిహద్దును మాత్రమే గుర్తిస్తోంది. ఆ తరువాత బలపడిన ఘర్షణలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అస్సాంలోని కచార్.. మిజోరాంలోని కొలాసిబ్ జిల్లా మధ్య ఉన్న సరిహద్దు భూమి ఆక్రమణకు గురవుతుందనే నెపంతో తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

* వివాదం ఘర్షణలకు ఎప్పుడు దారితీసింది?

మొదట్లో మిజోరాం కూడా అస్సాంలో భాగంగానే ఉండేది. 1987లో మిజోరాంకు రాష్ట్ర హోదా లభించింది. ఆ సమయంలో అస్సాం తమ భూములను స్వాధీనం చేసుకుంటోందని పలువురు మిజో గిరిజన నాయకులు ఆరోపిస్తూ సరిహద్దు వివాదాన్ని లేవనెత్తారు. 1995లో మిజోరం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 1875 నోటిఫికేషన్ ప్రకారం.. లుషాయ్ హిల్స్‌ సరిహద్దుల్లో ప్రజలకు నివాస స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మొదటిసారి ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత 2018లో మిజో పౌర సంఘాలు వివాదాస్పద సరిహద్దులో గుడిసెలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. ఈ ఘర్షణలో జర్నలిస్టులతో సహా దాదాపు 50 మంది వ్యక్తులపై అస్సాం పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఆ తరువాత 2019లో రెండు రాష్ట్రాలు యథాతథ స్థితిని కొనసాగించడానికి అంగీకరించాయి. వివాదాస్పద ప్రాంతాన్ని ఆక్రమించే పనులు చేపట్టవద్ధని నిర్ణయించాయి. అయితే 2020, అక్టోబర్‌లో మరోసారి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన వాగ్వివాదం పెద్దదిగా మారింది. ఫలితంగా రెండు వైపులా అనేక మంది ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో మిజోరాంకు కీలక రవాణా మార్గంగా ఉన్న నేషనల్ హైవే 306ను ఆందోళనకారులు 12 రోజుల పాటు దిగ్బంధం చేశారు. ఈ ఘర్షణకు కొన్ని రోజుల ముందు.. అక్టోబర్ 9న, కరీమ్‌గంజ్ (అస్సాం), మామిట్ (మిజోరాం) జిల్లాల సరిహద్దులో సైతం ఇలాంటి హింస జరిగింది.

* ప్రస్తుత వివాదానికి కారణం ఏంటి?

అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం వివాదం ఈ సోమవారం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక్కడ చెలరేగిన హింస సందర్భంగా రెండు రాష్ట్రాల పోలీసులు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మిజోరాం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి చెందారు. అధికారులతో సహా 80 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటల యుద్ధానికి దిగారు. వివాదాస్పద స్థలంలో మిజోరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడమే వివాదానికి కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

అయితే ముందు దాదాపు 200 మంది అస్సాం పోలీసు సిబ్బంది తమ భూభాగం వైపు వచ్చిన తరువాతే ఘర్షణలు మొదలయ్యాయని మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్ తంగా తెలిపారు. అస్సాంకు ఇతర ఈశాన్య రాష్ట్రాలతోనూ సరిహద్ధు వివాదాలు ఉన్నాయి. గతంలో అస్సాంలో భాగంగా ఉండి.. ప్రస్తుతం రాష్ట్రాలుగా విడిపోయిన నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో అస్సాంకు సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి.

* సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?

అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలతో ఉన్న సరిహద్ధు వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మిజోరాంతో సరిహద్దు వివాదానికి సైతం శాంతియుతంగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సరిహద్దు వివాదాలను పరిష్కరించకుండా ఈ ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య శాశ్వత శాంతిని సాధించలేమని మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌ తంగా చెబుతున్నారు. తాజా వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుతున్నారు.

First published:

Tags: Assam, Mizoram

ఉత్తమ కథలు