ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి భారీ ఎత్తున జరిమానాలు పడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Traffic Challan: ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘిస్తే చలాన్ల రూపంలో మీ నుంచి పోలీసులు జరిమానా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ నియమాల పట్ల వాహనదారుల్లో అవగాహన లేకపోవడం, అలసత్వం వహించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘిస్తే చలాన్ల రూపంలో మీ నుంచి పోలీసులు జరిమానా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇంతకీ, చలాన్ అంటే ఏమిటి? దాన్ని ఎవరు జారీ చేస్తారు? చలాన్ ఫీజును ఆన్లైన్లో ఎలా చెల్లించాలి? అనే సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం.
చలాన్ అంటే ఏమిటి?
భారత మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం, ఒక పోలీసు అధికారి జారీ చేసిన అధికారిక పత్రమే ట్రాఫిక్ చలాన్. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన (మోటారు వాహన డ్రైవర్)కు జరిమానా విధించేందుకు చలాన్ రూపంలో జరిమానా వసూలు చేస్తారు.
చలాన్ జారీ చేసే పద్ధతులు
సాధారణంగా ట్రాఫిక్ చలాన్లను రెండు విధాలుగా జారీ చేస్తారు. అవేంటో చూద్దాం.
1. స్పాట్ చలాన్
-ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే ఆపి సంబంధిత పోలీసు అధికారి విధించే జరిమానానే స్పాట్ చలాన్ అంటారు.
2. ఈ–చలానా
ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అతి వేగంగా వెళ్తున్నప్పుడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు, నాన్ పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసిన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న డిజిటల్ కెమెరాతో మీ వాహనాన్ని ఫోటో తీసి అందుకు తగ్గ జరిమానా విధిస్తారు. మీరు అధికారిక వెబ్సైట్లో మీ ఈ–చలాన్‌ను చూసుకోవచ్చు. అక్కడే చలాన్ ఫీజును చెల్లించవచ్చు.
ట్రాఫిక్ ఈ–చలాన్ అంటే ఏమిటి?
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి ఎలక్ట్రానిక్ రూపంలో జారీచేసేదే ఈ–చలాన్. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఈ–చలాన్ ఫీజును చెల్లించవచ్చు.
ట్రాఫిక్ చలాన్‌ను ఎవరు జారీ చేయవచ్చు?
హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే ఎక్కువ హోదాలో అధికారికి మాత్రమే ట్రాఫిక్ చలాన్ జారీ చేసే అధికారం ఉంటుంది. మీ వాహనాన్ని ఆపడానికి లేదా జరిమానా విధించడానికి సాధారణ పోలీసు సిబ్బందికి అధికారం లేదు.
ఆన్లైన్లో ఇలా చెల్లించండి..
ఈ–చలాన్‌ను కేవలం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అధికారిక వెబ్సైట్ ద్వారానే చెల్లించాలి. ఉదాహరణకు తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే https://echallan.tspolice.gov.in/publicview/ లింక్ ద్వారా మీ ఈ–చలాన్ రుసుము చెల్లించవచ్చు.
ఎన్ని రోజుల్లోపు చెల్లించాలి?
ఈ–చలాన్ జారీ చేసిన రోజు నుండి 60 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి. ఒకవేళ గడువులోగా మీరు జరిమానా చెల్లించకపోతే అది కోర్టుకు పంపబడుతుంది. తద్వారా మీ చెల్లింపు/ పరిష్కారం కోర్టులోనే జరుగుతుంది.
తప్పుడు ఈ–చలాన్ అందుకున్నారా?
కొన్ని సందర్భాల్లో మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచకపోయినా సరే, పొరపాటున మీకు చలాన్ విధించే అవకాశం ఉంది. అటువంటి, తప్పడు ఈ–చలాన్ మీకు అందినప్పుడు వెంటనే సంబంధిత రాష్ట్ర పోలీసు శాఖకు మెయిల్ పంపించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
జరిమానాను ఎలా తగ్గించుకోవచ్చు?
కోర్టులు ఏర్పాటు చేసే లోక్ అదాలత్‌లో మీ చలాన్ ఫీజును తగ్గించమని విజ్ఞప్తి చేయవచ్చు.
జరిమానా తక్షణమే చెల్లించాలా?
లేదు, అక్కడికక్కడే మీ జరిమానాను చెల్లించాలనే హక్కు ట్రాఫిక్ పోలీసులకు లేదు. మీరు వాటిని తర్వాత చెల్లించవచ్చు,
సకాలంలో చెల్లించకపోతే..
మీరు ఈ–-చలాన్ ను సకాలంలో చెల్లించకపోతే, మీ చలాన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వాత మీరు జరిమానా చెల్లించేందుకు కోర్టులో హాజరుకావాలి.
(Prachi Mishra, Supreme Court Lawyer)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.