హోమ్ /వార్తలు /Explained /

Afghan Refugees: ఇతర దేశాలకు వలసపోతున్న అఫ్గాన్ వాసులు.. మన దేశానికి వచ్చేవారి పరిస్థితి ఏంటి ?

Afghan Refugees: ఇతర దేశాలకు వలసపోతున్న అఫ్గాన్ వాసులు.. మన దేశానికి వచ్చేవారి పరిస్థితి ఏంటి ?

కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలివస్తున్న ప్రజలు(ప్రతీకాత్మక చిత్రం)

కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలివస్తున్న ప్రజలు(ప్రతీకాత్మక చిత్రం)

తాలిబన్లు అధికారం చేపడతారనే భయంతో పౌరులు ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు రెండు వారాలుగా కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు వందలాది అఫ్గాన్‌ పౌరులు తరలివస్తున్నారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల హింస, ఆగడాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15న కాబూల్‌ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అఫ్గాన్‌ పౌరులు ప్రాణభయంతో దేశం విడిచి పారిపోవడానికి సిద్ధమయ్యారు. తాలిబన్లు అధికారం చేపడతారనే భయంతో పౌరులు ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు రెండు వారాలుగా హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వందలాది అఫ్గాన్‌ పౌరులు తరలివస్తున్నారు. అయితే దేశం విడిచి వెళ్తున్న అఫ్గాన్‌ శరణార్థులకు ఏయే దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయో చూద్దాం.

హింస, యుద్ధం కారణంగా స్వదేశం నుంచి పారిపోయిన వ్యక్తులను శరణార్థులు అంటారు. 2020 నాటికి 28 లక్షల అఫ్గాన్‌ శరణార్థులు విదేశాలలో ఉన్నారు. జాతి, మతపరమైన హింస వల్ల ఎక్కువగా ప్రజలు స్వదేశం విడిచి పారిపోతున్నారని UNHCR పేర్కొంది.

అఫ్గాన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పించే దేశాలు:

1. అమెరికా

ఆగస్టు 2న యూఎస్ రెఫ్యూజీ అడ్మిషన్స్ ప్రోగ్రామ్.. అఫ్గాన్‌ పౌరులను, వారి అర్హతగల కుటుంబ సభ్యులకు ప్రవేశం కల్పించే ప్రాధాన్యత 2 (పి-2) హోదాను యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు కల్పించింది. తాలిబన్ల హింసాత్మక చర్యల దృష్ట్యా అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అఫ్గాన్‌ పౌరులతో పాటు ఇతర అఫ్గాన్‌ ‌‌శరణార్థులకు పునరావాసం కల్పించడానికి అమెరికా కృషి చేస్తోంది. నివేదికల ప్రకారం యూఎస్ 10,000 మంది అఫ్గాన్‌ శరణార్థులకు‌‌ పునరావాసం కల్పించనుంది. వీరిలో ఎక్కువగా యూఎస్ ప్రభుత్వానికి సహాయం చేసిన వ్యక్తులే ఉంటారు.

2. బ్రిటన్

తాలిబన్ల బెదిరింపులు, హింస వల్ల పారిపోయే అఫ్గాన్‌ పౌరులకు శాశ్వతంగా యూకేలో నివాసం కల్పించేందుకు ఒక మార్గాన్ని ఆఫర్ చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, బాలికలు, మతపరమైన మైనారిటీలకు ప్రాధాన్యతనిచ్చే యూకే పునరావాస పథకంలో భాగంగా.. తొలి ఏడాది 5,000 మంది అఫ్గాన్‌ పౌరులను ఆశ్రయం కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ పునరావాస పథకం ద్వారా మొత్తం 20 వేల మంది అఫ్గాన్‌ పౌరులకు పునరావాసం కల్పించాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

3. కెనడా:

20 వేల అఫ్గాన్‌ శరణార్థులకు పునరావాసం కల్పిస్తామని కెనడా దేశం కూడా హామీ ఇచ్చింది.

4. యూరప్

2015 యూరోపియన్ సంక్షోభం పునరావృతమవుతుందనే భయంతో శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు చాలా యూరోపియన్ దేశాలు జంకుతున్నాయి. UNHCR అంచనా ప్రకారం 2015లో 9 లక్షల మంది శరణార్థులు, వలసదారులు యూరోపియన్ తీరాలకు వచ్చారు. అయితే ఐరోపాకు పయనమైన వారిలో 3,500 మంది మార్గమధ్యంలోనే చనిపోయారు. యూరోపియన్ యూనియన్ నివేదిక ప్రకారం, 2021 మొదటి త్రైమాసికంలో దాదాపు 7,000 అఫ్గాన్‌ పౌరులకు శాశ్వత/తాత్కాలిక చట్టపరమైన హోదా లభించింది.

5. భారతదేశం

శరణార్థుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి శాసనాలు లేవు కాబట్టి భారత ప్రభుత్వం శరణార్థులతో కేసుల వారీగా వ్యవహరిస్తోంది. 1951 శరణార్థుల ఒప్పందానికి సంబంధించిన ప్రోటోకాల్‌కు భారతదేశం సంతకం చేయలేదు. 2011లో వచ్చిన శరణార్థులుగా చెప్పుకునే విదేశీ పౌరుల విషయంలో తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని సర్క్యులేట్ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అఫ్గాన్‌ ప్రజలను దేశంలోకి ప్రవేశించేందుకు ఈ-వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ-వీసాతో 6 నెలల పాటు భారతదేశంలో నివసించవచ్చు. తర్వాత వారిని ఎక్కడికి పంపిస్తారనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Afghanistan, Taliban

ఉత్తమ కథలు