కరోనా మహమ్మారికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మే1 నుంచి 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లబ్ధిదారులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఈ క్రమంలో దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తుండగా, రష్యాలో తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడింట్లో ఏ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను జనవరి 16 నుంచి ఉపయోగిస్తున్నారు. తాజాగా స్పుత్నిక్ వి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్థంగా నిరోధిస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో దేన్ని ఎంచుకున్నా ఫరవాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్లకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలను పరిశీలిద్దాం.
* మూడు వ్యాక్సిన్లలో ఏది మంచిది?
కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు మూడూ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవాగ్జిన్‌ను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారు చేస్తున్నారు. ఈ జనవరి నుంచే ఈ రెండు టీకాలను ప్రజలకు వేస్తున్నారు. మే1 న రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి డోసులు భారత్‌కు వచ్చాయి. దీన్ని మాస్కోలోని గమలేయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీలో.. రష్యన్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) సహాయంతో అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పర్యవేక్షణలో.. ఆరు ఇండియన్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం 1.25 కోట్ల డోసులను మన దేశం దిగుమతి చేసుకుంది.
ఈ మూడు టీకాలు విభిన్నమైనవి. వీటి ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి. కోవిషీల్డ్ ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన టీకా. దీన్ని చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ టీకాను వాడటానికి WHO కూడా అనుమతించింది. కోవాగ్జిన్‌ను ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఇది వివిధ రకాల వైరస్ మ్యుటేషన్లతో పోరాడగలదని ప్రపంచ దేశాల పరిశోధనల్లో తేలింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు కూడా భారత్‌తో పాటు మరో 60కి పైగా దేశాల్లో ఆమోదం లభించింది.
* ఈ వ్యాక్సిన్లను ఎలా అభివృద్ధి చేశారు?
కోవాగ్జిన్‌ను ఇన్ యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంలో అభివృద్ధి చేశారు. ఈ టీకా ద్వారా చనిపోయిన వైరస్‌ను ప్రజల శరీరంలోకి ఎక్కించి, యాంటీబాడీలను అభివృద్ధి చేస్తారు. అంటే కోవాగ్జిన్ తీసుకున్న తరువాత, ఇన్ యాక్టివేటెడ్ వైరస్‌ను ఎదుర్కోవడానికి శరీరం యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా కరోనా నుంచి రక్షణ కల్పిస్తుంది. కోవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. చింపాంజీల్లో కనిపించే అడెనోవైరస్ ChAD0x1ను ఉపయోగించి దీన్ని అభివృద్ధి చేశారు. దీని సహాయంతో కరోనా వైరస్ జాతుల్లో కనిపించే స్పైక్ ప్రోటీన్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని శరీరంలోకి పంపిన తరువాత రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఫలితంగా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. స్పుత్నిక్ వి కూడా వైరల్ వెక్టర్ టీకా. కానీ దీన్ని రెండు వైరస్‌లతో అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌లో రెండు డోసులు భిన్నంగా ఉంటాయి. కానీ కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో రెండు డోస్‌లు ఒకేలా ఉంటాయి.
* వ్యాక్సిన్లను ఎన్ని డోసుల్లో తీసుకోవాలి?
ప్రస్తుతం ఉన్నవి మూడూ డబుల్ డోస్ వ్యాక్సిన్లు. వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థను, యాంటీబాడీలను ప్రేరేపించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్లను భుజం దగ్గర ఉండే కండరంపై ఇంజెక్ట్ చేస్తారు. కోవాగ్జిన్ రెండు డోసులను నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో తీసుకోవాలి. కోవిషీల్డ్ రెండు డోసులను ఆరు నుంచి ఎనిమిది వారాల్లో తీసుకోవాలి. అయితే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య మూడు వారాల సమయం ఉండాలి. వీటిని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయవచ్చు. కానీ ఇతర దేశాల్లో అభివృద్ధి చేసిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
* ఈ వ్యాక్సిన్లు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయి?
ఈ మూడు వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయి. WHO నిర్దేశించిన అన్ని ప్రమాణాలను ఈ వ్యాక్సిన్లు అందుకున్నాయి. వీటికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ డేటా ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. వీటి పనితీరుపై నిరంతరం అధ్యయనాలు చేస్తున్నారు. కోవిషీల్డ్ ట్రయల్స్ గత ఏడాది నవంబర్‌లో ముగిశాయి. దీని సామర్థ్యం 70 శాతంగా నిరూపితమైంది. డోసుల మధ్య తేడా పెరిగితే ఈ శాతం కూడా పెరుగుతోంది. ఈ వ్యాక్సిన్ వైరస్ లక్షణాలను తగ్గించడంతో పాటు వ్యాధి సోకితే కోలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. కోవాగ్జిన్ 78 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేల్చారు. ఈ టీకా కూడా వైరస్ లక్షణాలు, కోవిడ్ మరణాలను తగ్గించగలదు. స్పుత్నిక్ వి కూడా ఇదే స్థాయిలో పనితీరును కనబరిచింది. మోడెర్నా, ఫైజర్ వంటి వ్యాక్సిన్లను mRNA ప్లాట్‌ఫాంపై అభివృద్ధి చేశారు. ఇవి 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతమైనవని పరిశోధకులు కనుగొన్నారు. వీటి తర్వాత స్పుత్నిక్ V (91.6%) మాత్రమే 90 శాతం కంటే ఎక్కువ సమర్థత రేటుతో అత్యంత ప్రభావవంతమైన టీకాగా గుర్తింపు పొందింది.
* ఈ వ్యాక్సిన్ల ధర, లభ్యత గురించి సమాచారం?
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు త్వరలో బహిరంగ మార్కెట్లో లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. స్పుత్నిక్ కూడా త్వరలో మార్కెట్లో లభిస్తుందని భావిస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రులకు డోసుకు రూ.300, ప్రైవేట్ ఆసుపత్రులకు డోసుకు రూ.600 చొప్పున అమ్మాలని నిర్ణయించింది. కోవాగ్జిన్ కొంచెం ఖరీదైనది. ఈ టీకా రాష్ట్రాలకు డోసుకు రూ.400 చొప్పున లభిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు డోసుకు రూ.1200 చొప్పున అమ్మనున్నారు. స్పుత్నిక్ వి ధర రూ.700 వరకు ఉండవచ్చు. అయితే ఈ వ్యాక్సిన్ల ధరలను రాష్ట్రాలు నిర్దేశించే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలు వీటిని కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాయి.
* ఈ వ్యాక్సిన్లు కొత్త కరోనా వేరియంట్‌లను అడ్డుకుంటాయా?
భారత్‌లో కనిపించే డబుల్ మ్యూటెంట్ వైరస్, ఇతర దేశాల్లో కనుగొన్న యూకే, బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్ సహా ఇతర వేరియంట్లు అన్నింటిపై కోవాగ్జిన్ పోరాడగలదని కనుగొన్నారు. కోవిషీల్డ్, స్పుత్నిక్ వి విషయంలో ఇలాంటి అధ్యయనాలు జరగలేదు. శాస్త్రవేత్తలు మాత్రం మనకు అందుబాటులో ఉన్న అన్ని టీకాలు సమర్థవంతమైనవని, వీటిని తీసుకోవడం ద్వారా మాత్రమే కొత్త మ్యుటేషన్లు వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు.
* దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి?
మూడు వ్యాక్సిన్ల ద్వారా ఒకే రకమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్లు. సూది ద్వారా కండరానికి వీటిని ఇంజెక్ట్ చేయాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నొప్పి రావచ్చు. తేలికపాటి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు.. వంటి సాధారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలు. వీటి నివారణకు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని రకాల అలర్జీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు మందులు వాడేవారు వైద్యులను సంప్రదించిన తరువాతే వ్యాక్సిన్ తీసుకోవాలి.
* ఎవరెవరు వ్యాక్సినేషన్‌కు అర్హులు కారు?
ప్లాస్మా థెరపీ చేయించుకున్నవారు, శరీరంలో తక్కువ ప్లేట్‌లెట్స్ ఉన్నవారు, స్టెరాయిడ్ చికిత్సలు తీసుకున్న వారు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు, వైరస్ సోకిన వారు.. పూర్తిగా కోలుకున్న తరువాతే వ్యాక్సిన్ తీసుకోవాలి.
* ఈ వ్యాక్సిన్లు ఎన్ని రోజులు ప్రభావవంతంగా ఉంటాయి?
ఈ విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. వ్యక్తుల శరీర తత్వం, అనారోగ్యాలు, జీవనశైలి, ఆహారంపై కూడా ఇది ఆదారపడి ఉండవచ్చు. అయితే కరోనా యాంటీబాడీలు కచ్చితంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ప్రభావవంతంగా ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ తరువాత మరో డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు బూస్టర్ డోస్‌లపై తయారీ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మూడు వ్యాక్సిన్లు కరోనావైరస్ మరణాలను వంద శాతం నివారించగలవు. రెండు డోసులు తీసుకున్న తరువాత శరీరంలో యాంటీ బాడీలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి అంటువ్యాధులతో సమర్థవంతంగా పోరాడతాయి. ఒకవేళ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా వైరస్ సోకితే.. అది సాధారణ జలుబు కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covaxin, Covishield, Sputnik-V