హోమ్ /వార్తలు /Explained /

Viral Fevers: డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా‌ వ్యాధులకు ట్రీట్‌మెంట్ ఒకేలా ఉంటుందా ?

Viral Fevers: డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా‌ వ్యాధులకు ట్రీట్‌మెంట్ ఒకేలా ఉంటుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు ఈడిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తాయి. డెంగీ, చికున్‌గున్యా రెండూ కీటకాల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధులైతే.. మలేరియా అనేది ప్లాస్మోడియం వల్ల కలిగే ఒక పరాన్నజీవి వ్యాధి. ప్లాస్మోడియం పరాన్నజీవి సోకిన దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుంది.

ఇంకా చదవండి ...

గత కొద్ది వారాలుగా దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వ్యాధుల పట్ల అశ్రద్ధ చేసి సత్వరమే చికిత్స పొందకపోతే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. మలేరియా అనాఫిలిస్ దోమ (mosquito) వల్ల వస్తే.. డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు ఈడిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తాయి. డెంగీ (Dengue) , చికున్‌గున్యా రెండూ కీటకాల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధులైతే.. మలేరియా (malaria) అనేది ప్లాస్మోడియం వల్ల కలిగే ఒక పరాన్నజీవి వ్యాధి. ప్లాస్మోడియం పరాన్నజీవి సోకిన దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుంది.

* డెంగీ జ్వరం అంటే ఏమిటి?

డెంగీ జ్వరం అనేది ఈడిస్‌ ఈజిప్టై దోమ ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. DEN-1, DEN-2, DEN-3, DEN-4 అనే నాలుగు వైరస్‌లు డెంగీ ఫీవర్‌కు దారితీస్తాయి. దీన్ని బ్రేక్-బోన్ ఫీవర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ జ్వరం వచ్చినప్పుడు కొన్నిసార్లు మీ ఎముకలు విరిగిపోతున్నాయా అన్నట్లు తీవ్ర కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి.

* డెంగీ జ్వరం లక్షణాలు

డెంగీ జ్వరం లక్షణాలు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా సోకిన దోమ ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత 4-7 రోజులలోగా జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 105 ఫారన్ హీట్ తో అధిక జ్వరం, కండరాలు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, ఛాతీ, వీపు లేదా పొట్ట నుంచి ముఖం వరకు వ్యాపించే ఎర్రటి దద్దుర్లు, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగీ జ్వరంతో బాధపడుతున్న కొందరు రోగులు డెంగీ హెమరేజిక్ ఫీవర్‌ బారినపడుతుంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన డెంగీ జ్వరం. దీని తరువాత వ్యాధి అత్యంత తీవ్ర రూపమైన డెంగీ షాక్ సిండ్రోమ్‌గా అభివృద్ధి చెందుతుంది. తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, శరీరంలో రక్తస్రావం, పెటెచియా(చిన్న ఎర్రటి మచ్చలు, చర్మం కింద బొబ్బలు), ముక్కు లేదా చిగుళ్లలో రక్తస్రావం వంటి లక్షణాలు ఈ ప్రాణాంతక డెంగీ ఫీవర్‌లో కనిపిస్తాయి.

* డెంగీ జ్వరం నివారణ చర్యలు

- మీ శరీరం బయటికి కనిపించకుండా పొడవాటి స్లీవ్స్ ఉన్న చొక్కాలు, కాళ్లను కవర్ చేసే మందపాటి ప్యాంటు ధరించాలి.

- దోమ కాటు నుంచి డెంగీ సంక్రమణను నివారించడానికి ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ఆమోదించిన మస్కిటో రిపెల్లెంట్ వాడాలి.

- వీలైతే, ఫాబ్రిక్-ఫ్రెండ్లీ మస్కిటో రిపెల్లెంట్స్ అప్లై చేయాలి.

- దోమలు లోపలికి రాకుండా మీ ఇల్లు/ఆఫీసు తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేయాలి. విండో లేదా డోర్ నెట్‌లను కూడా ఏర్పాటు చేయాలి.

- డెంగీకి కారణమయ్యే ఈడిన్‌ ఈజిఫ్టై దోమ మంచినీటిలో పెరుగుతుంది. మంచినీరు నిలిచే ప్రాంతాలు, తాగి పడేసే కొబ్బరి బొండాలు, గిన్నెలు, కప్పులు తదితర వస్తువుల్లో ఈ దోమ వృద్ధి చెందడానికి అనువుగా ఉంటుంది. అందుకే మీ ఇంటితో పాటు చుట్టుపక్కల మంచి నీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి.

- డెంగీ జ్వరాన్ని నివారించడానికి ముఖ్యంగా సాయంత్రం, తెల్లవారుజామున నీరు నిలిచి ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి.

* మలేరియా అంటే ఏంటి?

మలేరియా అనేది ఓ ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఇది మురుగు నీటిలో ఉండే ఆడ అనాఫిలస్ అనే దోమ కాటు ద్వారా మానవులకు సోకుతుంది. మనల్ని కుట్టిన దోమల్లో ప్లాస్మోడియం పరాన్నజీవి ఉంటే.. ఆ పరాన్నజీవులు కాలేయంలోకి ప్రవేశించి పరిపక్వం చెందుతాయి. ఆపై రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలకు సోకడం ప్రారంభిస్తాయి. అయితే మలేరియాని నివారించొచ్చు, అలాగే నయం చేయవచ్చు.

* మలేరియా లక్షణాలు

సాధారణ మలేరియా, తీవ్రమైన మలేరియా లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. నార్మల్ మలేరియా అనేది శరీర వేడి, చల్లని, చెమట దశల నుంచి మొదలవుతుంది. చలి లేదా వణుకుతో కూడిన చలి, తలనొప్పి, జ్వరం, వాంతులు. మూర్ఛలు, చెమట, అలసట వంటివి సాధారణ మలేరియా ఉన్నట్టు తెలిపే లక్షణాలనే!

లాబరేటరీ లేదా క్లినికల్ ఎవిడెన్స్ ముఖ్యమైన అవయవాల పని చేయడం లేదని సూచిస్తే, అది తీవ్రమైన మలేరియాగా వైద్యులు పరిగణిస్తుంటారు. జ్వరం, వణుకు/చలి, స్పృహ కోల్పోవడం, శ్వాసకోశ సమస్యలు, మూర్ఛ, రక్తహీనత, అసాధారణ రక్తస్రావం వంటివి తీవ్రమైన మలేరియా లక్షణాలు.

* మలేరియా నివారణ చర్యలు

- మీ చేతులు, కాళ్లను దోమల కాటు నుంచి రక్షించుకోండి. పొడవైన లేత రంగు దుస్తులు ధరించాలి.

- డెంగీ లేదా మలేరియా, చికెన్ గున్యా వ్యాధుల బీభత్సంగా ప్రబలుతున్న ప్రాంతాలకు ప్రయాణించడం మానుకోవాలి.

- దోమల నివారణ మందు(మస్కిటో రిపెల్లెంట్)లను వాడాలి.

- దోమలు రాకుండా ఇంటి కిటికీలకు, తలుపులకు మస్కిటో నెట్ మెష్‌ను ఏర్పాటు చేయాలి.

- దోమలు కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బెడ్‌లపై దోమతెరలను ఉపయోగించాలి.

- బకెట్లు, ఫ్లవర్‌పాట్‌లు, బారెల్స్/నీటి పీపాలలో నిలిచిపోయిన నీటిని మొత్తం తోడి బయట పారబోయాలి. దోమలు పెరగడానికి ఎక్కడా కూడా నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

* చికున్‌గున్యా అంటే ఏమిటి?

చికున్‌గున్యా వ్యాధి వచ్చిన వారు కీళ్ల నొప్పులతో నిటారుగా నడవలేక వంగి గూనిగా నడుస్తారు. అందుకే ఈ విష జ్వరానికి ఆ పేరు వచ్చింది. చికున్‌గున్యా వ్యాధి చికున్‌గున్యా అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ వైరస్ ఈడిస్ ఆల్బోపిక్టస్, ఈడిస్ ఈజిఫ్టై అనే రెండు రకాల దోమల ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. ప్రధానంగా 'ఎల్లో ఫీవర్ దోమ' అని పిలిచే "ఈడిస్‌ ఈజిప్టై" ఆడ దోమ నుంచి చికున్‌గున్యా వైరస్‌ వ్యాపిస్తుంది. పుట్టిన దోమల్లో వైరస్ ఉంటేనే ఇది సోకుతుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో ఉన్న దేశాల్లో చికెన్ గున్యా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుంటాయి.

* చికున్‌గున్యా లక్షణాలు

జ్వరం, కీళ్ల నొప్పులు అనేవి చికున్‌గున్యా ముఖ్యమైన లక్షణాలు. చికున్‌గున్యా వ్యాధి ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ రెండు నుంచి ఆరు రోజుల మధ్య ఉంటుంది. ఇది సంక్రమించిన తరువాత నాలుగు నుంచి ఏడు రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. రెండు రోజుల పాటు వేధించే అధిక జ్వరం (40 °C లేదా 104 °F), పొట్ట లేదా అవయవాలపై వైరల్ దద్దుర్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఆకలి లేకపోవడం తదితరవి చికున్‌గున్యా లక్షణాలు.

* చికున్‌గున్యా నివారణ చర్యలు

- పొడవాటి ప్యాంటు, ఫుల్ స్లీవ్ షర్టులు వంటి మీ శరీరాన్ని సరిగ్గా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.

- ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ఆమోదించిన మస్కిటో రిపెల్లెంట్ వాడాలి.

- మీ ఇల్లు, ఆఫీసుల కిటికీలు, తలుపులపై మస్కిటో నెట్/ దోమతెరలు అమర్చాలి.

- ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందవు.

* డెంగీ, మలేరియా, చికున్‌గున్యా మధ్య తేడా ఏంటి?

చికున్‌గున్యా, డెంగీ అనేవి ఉష్ణమండల (tropical) జ్వరాలు. ఈ రెండూ దాదాపు ఒకే రకమైన వ్యాధి లక్షణాలను కలిగి ఉంటాయి. వ్యాధి కారకాలు (దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధులు), భౌగోళిక ప్రాంతాలు, పొదిగే కాలం కూడా ఈ రెండిటికీ ఒకే రకంగా ఉంటాయి. మలేరియా అనేది చికున్‌గున్యా, డెంగీ వంటి వ్యాధుల లక్షణాలతో కూడిన పరాన్నజీవి సంక్రమణ వ్యాధి.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

* డెంగీ, మలేరియా, చికున్‌గున్యా చికిత్స భిన్నంగా ఉంటుందా?

అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధికి దారితీస్తుంది. చికున్‌గున్యా, డెంగీ ఈడిస్ దోమల వల్ల వస్తాయి. చికున్‌గున్యా, డెంగీ దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్లు కాగా మలేరియా ప్లాస్మోడియం అని పిలువబడే పరాన్నజీవి వల్ల వస్తుంది. అందుకే ఈ వ్యాధుల చికిత్స విధానాలు భిన్నంగా ఉంటాయి.

First published:

Tags: Dengue fever, Mosquito

ఉత్తమ కథలు