KNOW ABOUT BENEFITS OF MUTUAL FUNDS AND TAX BENEFITS SS
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
(ప్రతీకాత్మక చిత్రం)
Benefits of Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ప్రతీ నెలా సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? పన్ను ప్రయోజనాలు (Tax Benefits) ఎలా పొందొచ్చు. తెలుసుకోండి.
ప్రజలకు అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో (Investment Ideas) ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, బంగారం, రియల్ ఎస్టేట్, బీమా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఈ జాబితాలో ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్క విభాగానికి లాభనష్టాలతో పాటు రిస్క్, రివార్డులు సైతం ఉంటాయి. అయితే ప్రొఫెషనల్‌గా నిర్వహించే వైవిధ్యభరితమైన, మంచి రిస్క్-రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అందించే పెట్టుబడి కోసం చూస్తుంటే.. మ్యూచువల్ ఫండ్లు (Mutual Funds) మీకు సరైన ఎంపిక. సాధారణ సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
పెట్టుబడుల్లో వైవిధ్యం
మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండటం. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో.. విభిన్న స్టాక్స్, సెక్టార్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్ల వద్ద తగినంత డబ్బు ఉండకపోవచ్చు. కానీ వేలాది మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సమీకరించడం ద్వారా మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిధిని, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పెంచుతుంది. దీంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్‌ను సైతం తగ్గిస్తుంది. ఏదైనా నిర్దిష్ట రోజున అన్ని స్టాక్స్ ఒకే నిష్పత్తిలో పడిపోయే అవకాశం చాలా తక్కువ. అందువల్ల రిస్క్ సమతుల్యమవుతుంది. ఇలాంటి వైవిధ్యం కారణంగా ఏదైనా పెట్టుబడిని సరిగా ఎంచుకోకపోయినా భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉండదు.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో చాలా రకాలు ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం గోల్డ్ ఫండ్స్, ఐటీ ఫండ్స్.. ఇలా ఎన్నో రకాల పెట్టుబడి మార్గాలు మదుపర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి తమకు నచ్చిన ఆప్షన్‌ను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. మారుతున్న అవసరాలకు తగినట్లు వివిధ రకాల స్కీమ్స్‌ను మదుపర్లు ఎంచుకోవచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చాయని ఇన్వెస్ట్మెంట్ ప్లానర్లు చెబుతున్నారు..
మెరుగైన పెట్టుబడుల నిర్వహణ
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే మరో పెద్ద ప్రయోజనం.. ఇవి నిపుణుల పర్యవేక్షణలో ఉండటం. మదుపరుల డబ్బును అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMCలు) ఇన్వెస్ట్ చేస్తాయి. సంస్థ తరఫున నిధులను అర్హత కలిగిన ఫండ్ మేనేజర్లు పెట్టుబడిగా పెడతారు. బలమైన పరిశోధన బృందాలు (రిసెర్చ్ టీమ్స్), సొంత నైపుణ్యం సహాయంతో ఫండ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్‌ను వారు ఎంచుకుంటారు. మార్కెట్ పరిస్థితులను సకాలంలో సమీక్షిస్తూ పెట్టుబడులలో మార్పులు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు మెరుగైన లాభాలను అందజేస్తారు.
ఇతర పెట్టుబడుల విషయంలో మదుపర్లు ఈ పనులు సొంతంగా చేసుకోవడం కష్టం. అంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఇన్వెస్టర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతోపాటు పెట్టుబడులను నిరంతరం పర్యవేక్షించే పని తప్పుతుంది. దీనికి తోడు మార్కెట్ స్వింగ్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా ఎలాంటి ఒత్తిడి లేకుండా మదుపరులు రాబడి పొందవచ్చు.
కొంతమంది ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా పెద్ద కంపెనీల్లో నిర్దిష్ట విభాగంలో పెట్టుబడి పెట్టాలనుకోవచ్చు. అయితే పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడానికి వారి దగ్గర సరిపడినంత డబ్బు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెద్ద వాల్యూమ్లలో ట్రేడింగ్ చేస్తాయి. తక్కువ ట్రేడింగ్ ఖర్చులతో పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి. ఎవరైనా కనీసం రూ.500తో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. తమ ఇన్వెస్ట్మెంట్ పరిధిని, స్థోమతను బట్టి ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు.
ఉదాహరణకు.. తాజాగా కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి మూడు సంవత్సరాల తర్వాత చేపట్టనున్న విదేశీ యాత్రకు ఏటా కనీసం రూ.48,000 కేటాయిస్తున్నారని అనుకుందాం. అయితే ఏడాది చివర్లో ఒకేసారి ఈ మొత్తాన్ని పక్కన పెట్టడానికి బదులుగా.. ప్రతి నెలా రూ.4,000 మ్యూచువల్ ఫండ్‌లో SIP చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీ ప్రయోజనంతో పాటు సులభంగా ఆర్థిక లక్ష్యాలు చేరుకునే అవకాశం దక్కుతుంది.
ఇన్వెస్టర్లు తమ డబ్బును మ్యూచువల్ ఫండ్లకు ఎప్పుడైనా కేటాయించవచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా వీటి నుంచి తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. సంప్రదాయ పెట్టుబడి మార్గాల మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్‌కు లాక్-ఇన్ వ్యవధి సైతం ఉండదు. ఓపెన్-ఎండ్ ఫండ్లలోని పెట్టుబడులను ఎప్పుడైనా పాక్షికంగా లేదా మొత్తంగా రీడీమ్ చేయవచ్చు. యూనిట్ల ప్రస్తుత విలువను ఇన్వెస్టర్లు రిడీమ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బు ఉపసంహరించుకునే ప్రక్రియ కూడా సులభం. షరతులను అనుసరిస్తూ విత్‌డ్రా చేసిన డబ్బు మదుపర్ల బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. ఈ పనిని ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై వివిధ పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)లో పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. 12 నెలలకు పైగా ఉన్న ఈక్విటీ స్కీమ్ యూనిట్ల మూలధన లాభాలపై (capital gains) పన్ను లేదు.
ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీమ్స్ మినహా ఇతర పథకాలను పన్ను ప్రయోజనాల కోసం డెట్ విభాగాలుగా పరిగణిస్తారు. 3 సంవత్సరాలలోపు డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిడమ్షన్ చేసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వర్తిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (3 సంవత్సరాల కంటే ఎక్కువ)పై ట్యాక్స్ వర్తిస్తుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసిన తర్వాత దీనిపై పన్ను విధిస్తారు.
మెరుగైన నియంత్రణ
భారతదేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పర్యవేక్షణలో ఉంటాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిర్దేశించిన పారదర్శక ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అన్ని మ్యూచువల్ ఫండ్లు ప్రతి నెలా తమ పోర్ట్‌ఫోలియోలను వెల్లడించడం తప్పనిసరి అని సెబీ ఆదేశించింది. ఇలాంటివన్నీ మదుపర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత కల్పిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.