KIM JONG UN FLURRY OF MISSILE TESTS DISPLAYS NORTH KOREA INCREASINGLY DIVERSE ARSENAL HERE IS HOW MKS GH
Kim jong un: వరుస మిస్సైల్ టెస్టులతో కిమ్ కలకలం - North Korea కొత్త ఆయుధాలను సమకూర్చుకుందా?
మిస్సైల్ టెస్టులపై కిమ్ దూకుడు
కొత్త ఏడాది తొలి మాసంలోనే వరుస క్షిపణుల పరీక్షలతో కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించారు. అయితే, ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో వైవిధ్యమైన ఆయుధాలు ఉండటం విశేషం..
కొత్త ఏడాది తొలి మాసంలోనే వరుస క్షిపణుల పరీక్షల (missile testing)తో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించింది ఉత్తర కొరియా (North Korea). ఈ ప్రయోగాల్లో వైవిధ్యమైన ఆయుధాలు ఉండటం విశేషం. ఇవి ఆయుధాల విషయంలో నార్త్ కొరియా సాధించిన అధునాతనతను సుస్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రయోగాల్లో హైపర్సోనిక్ క్షిపణులు (hypersonic missiles), దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ క్షిపణుల (long-range cruise missiles)తో సహా రైల్కార్లు, విమానాశ్రయాల నుంచి ప్రయోగించిన క్షిపణులు కూడా ఉన్నాయి.
ఉత్తర కొరియా 2017 నుంచి లాంగెస్ట్-రేంజ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను లేదా అణ్వాయుధాలను పరీక్షించలేదు. కానీ అమెరికా, ఆసియాలోని దాని శత్రదేశాల దాడులను తిప్పి కొట్టేలా సైనిక బలాన్ని బలోపేతం చేయడానికి ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రెడీ అయ్యారు. ఇందులో భాగంగా అత్యాధునిక క్షిపణులను ప్రయోగిస్తూ శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకు పరీక్షించిన వివిధ రకాల ఆయుధాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
* హైపర్సోనిక్ క్షిపణులు
జనవరి 5, 11న కొత్త రకం హైపర్సోనిక్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. ఈ ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాల వైపు ఎగురుతాయి. ఇవి ధ్వని వేగం కంటే ఐదు రెట్లు లేదా గంటకు 6,200 కి.మీల వేగాన్ని చేరుకోగలవు. విశ్లేషకుల ప్రకారం, హైపర్సోనిక్ ఆయుధాలు క్షిపణి రక్షణ వ్యవస్థ (missile defence systems)లను తప్పించుకోవడంలో అన్నిటికంటే మెరుగ్గా ఉంటాయి. దక్షిణ కొరియా అధికారులు మొదటి పరీక్షలో ఈ క్షిపణి సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే రెండో టెస్టులో మాత్రం ఈ ఆయుధం మెరుగైన పనితీరు కనబరిచినట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్, ఆసియా శత్రదేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ క్షిపణులు బాగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.
* కేఎన్- 23 ఎస్ఆర్బీఎం (KN-23 SRBM)
జనవరి 14న ఉత్తర కొరియా చైనాతో ఉత్తర సరిహద్దు సమీపంలో రైలు నుంచి రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను (SRBMs) ప్రయోగించింది. ఈ ప్రయోగం అనేది క్షిపణులను ఆపరేట్ చేసే దళాల నైపుణ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన షార్ట్-నోటీస్ డ్రిల్ అని ఆ దేశ మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా మొదటిసారిగా రైలు ఆధారిత క్షిపణి వ్యవస్థను సెప్టెంబర్‌లో పరీక్షించింది. దీన్ని శత్రుదాడులకు సమర్థవంతమైన కౌంటర్ స్ట్రైక్‌గా రూపొందించారు. రైల్ మొబైల్ క్షిపణులు అనేవి అణ్వాయుధాలను తక్కువ ధరకే సంరక్షించుకోవడానికి సమర్థవంతమైనవిగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకుల ప్రకారం, శత్రువులు వాటిని గుర్తించి నాశనం చేయడం దాదాపు అసాధ్యం.
* కేఎన్ - 24 ఎస్ఆర్బీఎం (KN-24 SRBM)
ఉత్తర కొరియా జనవరి 17న ప్యోంగ్యాంగ్లోని విమానాశ్రయం నుంచి అరుదైన పరీక్షలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను (SRBMs) ప్రయోగించింది. ఈ జంట క్షిపణులు తూర్పు తీరంలో ఒక ద్వీప లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ క్షిపణులు కేఎన్-24 ఎస్ఆర్బీఎంలుగా కనిపించాయని, వీటిని చివరిసారిగా మార్చి 2020లో పరీక్షించడం జరిగిందని.. వీటిని భారీగా ఉత్పత్తి చేస్తూ ఉత్తర కొరియా తన మిలటరీ యూనిట్లలో అందుబాటులోకి తెచ్చినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు తెలిపారు. కేఎన్-24 అనేది U.S. MGM-140 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ATACMS)ని పోలి ఉంటుంది. కేఎన్-23 క్షిపణిని.. క్షిపణి రక్షణ నుంచి తప్పించుకోవడానికి, సాంప్రదాయ బాలిస్టిక్ క్షిపణుల కంటే ఎక్కువ దాడులను చేయడానికి రూపొందించారు.
* దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ మిస్సైల్
ఉత్తర కొరియా తూర్పు తీరంలోని సముద్రంలో లక్ష్య ద్వీపాన్ని ఢీకొట్టే రెండు దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ క్షిపణులను మంగళవారం ప్రయోగించినట్లు నార్త్ కొరియా మీడియా నివేదించింది. ఈ క్రూయిజ్ క్షిపణి దేశం యుద్ధ ప్రతిఘటనను పెంచడంలో పాత్ర పోషిస్తుందని అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. సెప్టెంబరులో, ఉత్తర కొరియా తొలిసారిగా సరికొత్త వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది అణు సామర్థ్యం కలిగిన ఆయుధం అని విశ్లేషకులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.