Home /News /explained /

KAMAL HAASAN TO LAUNCH HIS DIGITAL AVATAR IN THE METAVERSE MK GH

Explained: మెటావర్స్ బిజినెస్‌లోకి కమల్ హాసన్.. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఏమేం చేయవచ్చు..

కమల్ హాసన్

కమల్ హాసన్

ఆన్‌లైన్ మెటావర్స్ గేమ్‌ను రూపొందించే భారతీయ డిజిటల్ కంపెనీతో తాను టైఅప్ అవుతున్నానని కమల్ హాసన్ ప్రకటించారు. ఈ డిజిటల్ కంపెనీలో తన ఓన్ వరల్డ్, డెడికేటెడ్ మ్యూజియంను కలిగి ఉంటానని హాసన్ చెప్పారు.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబించేలా కంపెనీ పేరును మెటావర్స్‌గా మార్చుకుంది. భవిష్యత్తులో ఇంటర్నెట్‌ను ఏలేది వర్చువల్ రియాలిటీయేనని.. మెటావర్స్‌తో ఆ సరికొత్త సాంకేతిక యుగానికి నాంది పలుకుతామని సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్ మెటావర్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. కమల్ హాసన్ మెటావర్స్ అనే వర్చువల్ ప్రపంచంలో అడుగు పెట్టడం ద్వారా అభిమానులు అతనితో సన్నిహితంగా ఉంటూ అతని పని గురించి తెలుసుకోవచ్చు. అంతేకాదు అభిమానులు తమ డివైజ్ నుంచి కళ్లు తిప్పకుండానే కమల్ హాసన్‌ను వర్చువల్‌గా కలుసుకోవచ్చు, మాట్లాడొచ్చు, ఇలా అన్ని పనులు రియల్ టైమ్ లోనే చేయవచ్చు.

* మెటావర్స్‌తో కమల్ హాసన్ ఏం చేయనున్నారు?
ఆన్‌లైన్ మెటావర్స్ గేమ్‌ను రూపొందించే భారతీయ డిజిటల్ కంపెనీతో తాను టైఅప్ అవుతున్నానని కమల్ హాసన్ ప్రకటించారు. ఈ డిజిటల్ కంపెనీలో తన ఓన్ వరల్డ్, డెడికేటెడ్ మ్యూజియంను కలిగి ఉంటానని హాసన్ చెప్పారు. "డిజిటల్, ఫిజికల్ ప్రపంచాల మధ్య అభివృద్ధి చెందుతున్న విభజనను అన్వేషించడానికి నేను ఎగ్జైటింగ్ గా ఉన్నాను. వర్చువల్ ప్రపంచం ఇప్పుడు మెటావర్స్‌గా ప్రసిద్ధి చెందింది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన నా జీవిత ప్రయాణాన్ని ఈ మెటావర్స్‌కు సమర్పిస్తాను’’ అని కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కమల్ హాసన్ మెటావర్స్ క్రియేట్ అయిన తర్వాత.. ఆ మెటావర్స్‌లో కమల్ హాసన్ డిజిటల్ అవతార్లు క్రియేట్ అవుతాయి. అప్పుడు ఫ్యాన్స్ ఎక్కడికి నుంచైనా కమల్ హాసన్ మెటావర్స్‌లో జాయిన్ కావచ్చు. ఆ తర్వాత అతని డిజిటల్ అవతార్‌లతో సంభాషించొచ్చు. కమల్ కు చెందిన ఫిజికల్, డిజిటల్ జ్ఞాపకార్థమైన వస్తువు కొనుగోలు చేయవచ్చు.

మెటావర్స్ అంటే ఏమిటి?
మెటా అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది.. దీని అర్థం దాటి, తర్వాత లేదా అంతటా అని వస్తుంది. "మెటా"తో యూనివర్స్(universe)లోని "వర్స్" కలిపేసి మెటావర్స్ చేసేశారు. ఈ రెండూ కలిపి వచ్చే మెటావర్స్‌కు అర్థం ఏమిటంటే.. ప్రపంచానికి మించినది లేదా వర్చువల్ ప్రపంచం. అయితే ఒక గాడ్జెట్‌ లేదా డివైజ్ ద్వారా ఈ వర్చువల్ ప్రపంచంలోకే మనం అడుగుపెట్టినప్పటికీ.. అది అచ్చం నిజమైన ప్రపంచమనే భావన కలిగిస్తుంది. సాధారణంగా వీడియో గేమ్స్ మనం బయట ఉండి ఒక క్యారెక్టర్ ద్వారా ఆడుతాం. కానీ మనం మెటావర్స్ గేమ్ లోకి వెళ్లి నిజంగానే గేమ్ ఆడినంత అనుభూతి పొందవచ్చు.

మెటావర్స్‌లో ఏం చేయగలం?
మెటావర్స్‌ ఒక ఆన్‌లైన్ వరల్డ్ కాన్సెప్ట్. ఇందులో వ్యక్తులు ఒకే స్థలంలో ఉండాల్సిన అవసరం లేకుండా ఇతరులతో వర్చువల్‌గా కమ్యూనికేట్ కావచ్చు, ఆడుకోవచ్చు, కలిసి భోజనం చేయవచ్చు. అంతేకాదు వ్యాపార విషయానికి వస్తే మీరు షాపింగ్ చేయొచ్చు. మీకు ఇష్టమైన డ్రస్సు తొడుక్కుని అది మీకు సెట్ అయిందో లేదో చెక్ చేయొచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన కారును డ్రైవ్ చేయొచ్చు. వర్చువల్ ఆఫీస్ లో మీరు మీ సహోద్యోగులను కలుసుకోవచ్చు. వీడియో కాల్ లో చూసినట్లు కాకుండా మెటావర్స్‌లో మీరు మీ సహోద్యోగులను నిజంగానే చూసిన అనుభూతిని పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, వర్చువల్ రియాలిటీ అనేది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఫేస్​బుక్ సంస్థ తన యూజర్లను వర్చువల్ రియాలిటీలోకి తీసుకుపోయేందుకు ఇప్పటికే 'ఆక్యులస్ వీఆర్(ధర రూ.22వేలు)' హెడ్​సెట్లను రూపొందించింది. దీన్ని వర్చువల్ మీటింగ్స్ లో వాడారు కానీ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా లేదని సమాచారం. దీన్ని ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉంది.

ఇది ఎలా పని చేస్తుంది?
ఫేస్​బుక్ హోరైజన్‌ను 2019లో ప్రారంభించడం ద్వారా వీఆర్ ప్రపంచాన్ని సృష్టించడంలో ఫేస్​బుక్ తొలి అడుగు వేసింది. ఇందులో యూజర్లు ఆక్యులస్ హెడ్‌సెట్‌ను ధరించడం ద్వారా వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. ఆగస్ట్‌లో ఇది హోరైజన్‌ వర్క్‌రూమ్‌లను విడుదల చేసింది. ఈ వర్క్‌రూమ్‌ల్లో వీఆర్ హెడ్‌సెట్‌లను ధరించి సమావేశం నిర్వహించిన సహోద్యోగులు తమ కార్టూనిష్ 3డీ వెర్షన్‌లను చూసుకోగలిగారు.

మెటావర్స్ లో పూర్తిగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక్కడ వ్యక్తులు, వ్యాపారాలు ఉత్పత్తులను సృష్టించడం, కొనుగోలు చేయడం, పెట్టుబడి పెట్టడం, విక్రయించడం చేయగలరు. ఇప్పటికే డిజిటల్ గేమింగ్ టోకెన్‌ల ద్వారా ప్రజలు డబ్బు గడిస్తున్నారు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) అని పిలిచే ఆస్తులు కూడా పెరిగిపోతున్నాయి. వీటిని డిజిటల్‌గా మాత్రమే చూడగలం కానీ భౌతికంగా ముట్టుకోవడం సాధ్యపడదు. వాస్తవ ప్రపంచానికి మెటావర్స్ ఒక సమాంతర ప్రపంచంగా పనిచేసే అవకాశం ఉంది.

మెటావర్స్ ప్రపంచంలోకి వెళ్లి డిజిటల్ ఐటమ్స్ విక్రయించవచ్చు.. కొనుగోలు చేస్తూ డిజిటల్ ఆస్తిని సంపాదించవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలా సమయం గడుపుతున్నామో ఆ విధంగా రియల్ వరల్డ్ లో ఉంటూ వర్చువల్ ప్రపంచంలో వాస్తవానికి దగ్గరైన జీవితాన్ని గడపవచ్చు. వర్చువల్ వరల్డ్ కృత్రిమ క్యారెక్టర్లతో క్రియేటర్లు, డెవలపర్లుగా మారి ఉద్యోగాలు సృష్టించవచ్చు, పొందొచ్చు.

మెటావర్స్‌ను టెక్నాలజీని ఎలా డెవలప్ చేయబోతున్నారు?
అత్యంత సంక్లిష్టమైన ఈ టెక్నాలజీని తయారు చేయాలంటే పది నుంచి పదిహేనేళ్లు పట్టవచ్చు. దీన్ని అనేక కంపెనీలు కలిసి తయారుచేస్తాయి. పదిహేనేళ్ల తర్వాత ప్రజలు మెటావర్స్‌ ద్వారా వర్చువల్ ప్రపంచంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీన్ని కేవలం ఒక్క కంపెనీ మాత్రమే సొంతం చేసుకోలేదు. కేవలం ఒక కంపెనీ ఆపరేట్ చేయలేదు. అందువల్ల ప్రతి ఒక్క కంపెనీ ఇతర కంపెనీల సహకారం తీసుకుంటాయి. ఇక్కడ ఒక కంపెనీ పెత్తనం అనేది సాగదు. వీడియో గేమింగ్‌ కంపెనీలు కూడా వర్చువల్ రియాలిటీని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. పాపులర్‌ వీడియో గేమ్‌ ‘ఫోర్ట్‌నైట్‌’ తయారీ దారు, ప్రముఖ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ రాబ్‌లాక్స్‌ వర్చువల్ రియాలిటీలో సంగీత కచేరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

డేటా ప్రైవసీ సంగతేంటి?
జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)లో భాగంగా యూరోపియన్ యూనియన్ అత్యంత పటిష్టమైన డేటా ప్రైవసీ, ప్రాసెసింగ్ రూల్స్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతానికైతే ఫేస్​బుక్ ప్రైవసీ విషయంలో చెడ్డ పేరు తెచ్చుకుంది. దీని ప్రైవసీపై అనుమానాలు ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఇది యూజర్లకు కట్టుదిట్టమైన భద్రతా అందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Kamal haasan, Kamal hassan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు