హోమ్ /వార్తలు /Explained /

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన... ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉంది?

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన... ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉంది?

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 1963, 1973, 1995లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగింది. 1995లో పునర్విభజన 1981 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. అయితే కేంద్రం 1991లో నిర్వహించిన జనాభా గణన జమ్ముకశ్మీర్‌లో జరగలేదు.

జమ్ముకశ్మీర్‌లో రాజకీయవేడి మళ్లీ మొదలైంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. దీని కోసం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఆ ప్రాంతానికి చెందిన 14 మంది కీలక అఖిలపక్ష నేతలతో సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా కీలకంగా నిలిచిన అంశం నియోజకవర్గాల పునర్విభజన. అసలేంటి పునర్విభజన, దాని గురించి అంతగా చర్చలు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడి రాజకీయ పక్షాలు ఏమంటున్నాయ్‌, దానికి కేంద్రం ఏమంటోందనేది చూద్దాం!

జనాభా ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సరిహద్దుల్ని మార్చడం, స్థానాల సంఖ్యను పెంచడాన్ని నియోజకవర్గాల పునర్విభజన అంటారు. దీనిని పునర్విభజన కమిషన్‌ నిర్వహిస్తుంది. ఈ కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించలేవు. ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు, ఇప్పుడు జరగబోయే దానికి చాలా తేడా ఉంది. 2019 ముందు వరకు ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. అప్పట్లో జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ స్థానాల పునర్విభజన భారత రాజ్యాంగం పరిధిలో ఉండేది. అదే శాసనసభ స్థానాల పునర్విభజన జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగం, జమ్ముకశ్మీర్‌ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌ 1957 పరిధిలో ఉండేది.

ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 1963, 1973, 1995లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగింది. 1995లో పునర్విభజన 1981 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. అయితే కేంద్రం 1991లో నిర్వహించిన జనాభా గణన జమ్ముకశ్మీర్‌లో జరగలేదు. దాంతోపాటు 2001 సెన్సస్‌ ప్రకారం కూడా డీలిమిటేషన్‌ జరగలేదు. 2026 వరకు అక్కడ అసెంబ్లీస్థానాల పునర్విభజనను ఫ్రీజ్‌ చేయడమే దీనికి కారణం. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టేసింది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 46 కశ్మీర్‌లో ఉండగా, జమ్ములో 37 ఉన్నాయి. నాలుగు స్థానాలు లద్దాఖ్‌లో ఉన్నాయి. మరో 24 సీట్లు పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌కు రిజర్వ్‌ చేశారు. అయితే దీనిని కొన్ని రాజకీయ పక్షాలు తిరస్కరించాయి.

2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన భారత రాజ్యాంగం పరిధిలోకి వచ్చింది. దీంతో పునర్విభజన కోసం కేంద్రం మార్చి 6, 2020న ఓ కమిటీ వేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాంజ్నా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వం వహిస్తున్నారు. జమ్మకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో సుశీల్‌ చంద్ర, జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేకే శర్మ ఎక్స్‌ అఫీషియో మెంబర్లుగా ఉన్నారు. వీళ్లు కాకుండా మరో ఐదుగురు అసోసియేట్‌ మెంబర్లు ఉన్నారు. వారిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీలు ఫరూక్‌ అబ్దుల్లా, మహ్మద్‌ అక్బర్‌ లోన్‌, హస్నైన్‌ మసూది, జితేందర్‌ సింగ్‌, బీజేపీ నుంచి జుగల్‌ కిశోర్‌ శర్మ ఉన్నారు. దానికి ఏడాది సమయం ఇచ్చారు. దీంతోపాటు జమ్ముకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ బిల్లు ప్రకారం... అక్కడి అసెంబ్లీ స్థానాల సంఖ్యను 114కు పెంచనున్నారు. దీని వల్ల జమ్ము రీజన్‌కు ఉపయోగం ఉంటుందని తెలుస్తోంది.

దేశంలో కరోనా పరిస్థితులు రావడంతో ఈ ఏడాది మార్చి నాలుగుకు పూర్తవ్వాల్సిన కమిటీ వ్యాలిడిటీని.. మరో ఏడాదిని పొడిగించారు. అయితే ఈ ఏడాది కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఐదుగురు అసోసియేటెడ్‌ సభ్యుల్లో జుగల్‌ కిశోర్ శర్మ, జితేందర్‌ సింగ్‌ మాత్రమే హాజరయ్యారు. మిగిలినవారు హాజరుకు నిరాకరించారు. జమ్ముకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌యాక్ట్‌ రాజ్యాంగ విరుద్ధం అనేది వారి వాదన. ఈ చట్టానికి సుప్రీం కోర్టు అనుమతి వచ్చేంతవరకు చట్టం అమలుకు తాము వ్యతిరేకం అని చెప్పారు. మరోవైపు ఇక్కడి 20 జిల్లాల నుంచి ఎన్నికల కమిషన్‌ సమాచారాన్ని తెప్పించుకుంది. ఒక్కో అసెంబ్లీ స్థానంలో స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు వివరాలు తెలుసుకుంది.

అయితే ఇటీవల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చర్చలకు సిద్ధమని తేల్చింది. ఆ క్రమంలోనే ఇటీవల ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో పునాదుల స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తెలిపారు. 2019 ఆగస్టు 5న అధికరణం 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగిందని అమిత్‌షా ట్వీట్‌ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న జమ్ముకశ్మీర్‌ నేతల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో దానిని ముడిపెట్టింది. ఈ ప్రక్రియపై ఇదివరకటి వ్యతిరేకతను కశ్మీరీ లోయ పార్టీలు వ్యక్తం చేయలేదట. ఈ క్రమంలో డీలిమిటేషన్‌ కమిటీ త్వరలో ఏర్పాటు చేసే సమావేశానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలైన మిగిలిన ముగ్గురు సభ్యులు ఫరూక్‌ అబ్దుల్లా, మహ్మద్‌ అక్బర్‌ లోన్‌, హస్నైన్‌ మసూది హాజరవుతారని తెలుస్తోంది. దీంతో జమ్ము కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన ఓ కొలిక్కి వచ్చి, ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నారు.

First published:

Tags: Amit Shah, Ghulam Nabi Azad, Jammu and Kashmir, Mehbooba Mufti, Pm modi

ఉత్తమ కథలు