Home /News /explained /

IS RAHUL GANDHI IMPACT ON CONGRESS GETTING DOWN AFTER PRIYANKA GANDHI ENTRY INTO ACTIVE POLITICS AK GH

Priyanka vs Rahul: కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక vs రాహుల్ ? ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్‌లో రాహుల్‌ పాత్ర తగ్గనుందా?

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

Priyanka vs Rahul: పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ముందుకు రావట్లేదు. ఈ క్రమంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా.. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

భారత స్వతంత్ర పోరాటం నుంచి ఉనికిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నెహ్రూ-గాంధీలు జంటగా పనిచేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఆ స్థాయి నుంచి పార్టీపై సంపూర్ణ ఆధిపత్యం సాధించే బలమైన నాయకత్వం లేక ఇబ్బందులు ఎదుర్కొనే స్థితికి చేరుకుంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్లు కొందరు పార్టీలో సమూల మార్పుల కోసం డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ముందుకు రావట్లేదు. ఈ క్రమంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా.. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, రాహుల్ గాంధీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ సభ్యులతో వ్యవహరించే తీరు, రాబోయే ఎన్నికలలో ఎంచుకోవాల్సిన మార్గాల విషయంలో రాహుల్, ప్రియాంకకు తేడాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సంస్థాగత విషయాల్లో వీరిద్దరూ విరుద్ధమైన వ్యూహాలను అనుసరించాలనుకుంటున్నారు. హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలో పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులకు రాహుల్, ప్రియాంక వేర్వేరు వ్యక్తులను సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందనేది ప్రశ్నార్థకం.

* ప్రియాంక రాక వెనుక ఉద్దేశం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీ మాత్రం సీనియర్లకు, అత్యంత విశ్వసనీయులకు మాత్రమే పట్టం కట్టే ధోరణిని కొనసాగిస్తోంది. ఇప్పటికే చాలామంది యువ నేతలు పార్టీని వీడారు. దీంతోపాటు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్.. వర్గాల వారీగా విడిపోయింది. ఇదే సమయంలో పంజాబ్, రాజస్థాన్‌తో పాటు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎదుర్కోవడంలో ప్రియాంక గాంధీ వాద్రా చురుకైన పాత్ర పోషించడం వెనుక.. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రియాంక, రాహుల్ మధ్య సంఘర్షణ అనేది నిజం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రైమరీ సోర్స్ లేదా విశ్వసనీయ వర్గాల సమాచారం నమ్మదగినట్లు లేదంటున్నారు. కాంగ్రెస్‌లో ‘ప్రియాంక వర్సెస్ రాహుల్’ అనే దృశ్యం చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ప్రియాంక రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం.. రాహుల్‌కు సహాయం చేయడమే. తోబుట్టువుల మధ్య సంబంధం బలంగా ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే.

* విశ్వసనీయ వర్గాలు ఎవరు?
కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక, రాహుల్‌తో సత్సంబంధాలు ఉన్నాయని కొంతమంది చెప్పుకుంటారు. వీరిని కోటరీ, ప్యాలెస్ గార్డులు లేదా గేట్ కీపర్లుగా పిలుస్తారు. అయితే ఇలాంటి పేరులేని విశ్వసనీయ వర్గాలుగా చెప్పుకునే వారికి సోనియా, ప్రియాంక, రాహుల్‌ గాంధీలు ఏమాత్రం విలువ ఇవ్వరు. ఎందుకంటే వీరు మీడియాకు దూరంగా ఉంటారు. ఈ ముగ్గురూ వ్యక్తిగత మీడియా సలహాదారులు లేదా కన్సల్టెంట్స్ లేకుండా పని చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులపై ఆధారపడరు. అయితే ఢిల్లీలో పార్టీని నియంత్రిస్తున్నట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేసుకుంటాయి. కానీ గాంధీ త్రయం మాత్రం.. ఇలా డబ్బాలు కొట్టుకునే ఇన్‌ఫ్లూయెన్సర్లు, నిపుణులు లేదా విశ్లేషకులపై ఏమాత్రం ఆధారపడరు.

* పార్టీకి ఇతరులు నాయకత్వం వహించే అవకాశం ఉందా?
స్వతంత్ర భారత 74 ఏళ్ల చరిత్రలో.. గాంధీలు 59 సంవత్సరాలు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. క్యాడర్ నుంచి నాయకుల వరకు వారికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. అదే బలంతో కాంగ్రెస్ లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేస్తూ వచ్చింది. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు.. అనంతరం రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరకు.. ఏ గాంధీ కూడా పార్టీ విషయంలో విఫలం కాలేదు. లేదా అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకోలేదు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు వారిని గుడ్డిగా అనుసరిస్తారు. గాంధీలు కాకుండా పార్టీకి వేరే నాయకత్వం అనే ఆలోచనే కార్యకర్తలకు రాదు. అలా ఆలోచించడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడు ప్రియాంక, రాహుల్ సైతం ఈ గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీకి సరైన నాయకులం తామేనని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ పార్టీని నెహ్రూ కుటుంబం సైతం ఏకపక్షంగా ఏలింది. భారత తొలి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ నీడలో ఎదిగిన ఇందిరా గాంధీ.. 1959లో పార్టీ చీఫ్ అయ్యి కాంగ్రెస్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచారు. నెహ్రూ విరోధులు ఈ చర్యను విమర్శించారు. కానీ చాలామంది నాయకులు మాత్రం ఆమెను సమర్థించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) చీఫ్‌గా, ఆమె కేరళ సంక్షోభాన్ని పరిష్కరించింది. దేశంలోని మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయిన నంబూద్రిపాల్ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయించింది. భాష ఆధారంగా రాష్ట్రాల విభజన వివాదానికి సైతం ముగింపు పలకాలనుకుంది. ఇందుకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. పార్టీ చీఫ్‌గా ఇందిరా గురించి తన అభిప్రాయం ఏంటని నెహ్రూను ఒకసారి ఎవరో అడిగారు. ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఎదుర్కోవడం మంచి ఆలోచన కాదని అప్పట్లో ప్రధానిగా ఉన్న నెహ్రూ వ్యాఖ్యానించారు. 1960లో ఆమె పదవీకాలం ముగిసింది. అయితే ఇందిర పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమెను కోరింది. కానీ ఆమె మాత్రం ఇందుకు నిరాకరించింది.

* వారసత్వమే బలం
ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సైతం కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొంతకాలం పనిచేశారు. అయితే అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించనప్పటికీ.. సంస్థాగత, పరిపాలన విషయాల్లో తల్లితో సమానంగా బలమైన శక్తిగా మారారు. ఆ తరువాత 1983లో ఇందిరా ప్రధానిగా ఉన్నప్పుడు.. సంజయ్ సోదరుడు రాజీవ్ గాంధీ AICC ప్రధాన కార్యదర్శి అయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అతడికి ఇందిరా గాంధీ గది పక్కన ఒక గదిని కేటాయించారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ సైతం ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇందిర మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు తరచూ రాజీవ్ కార్యాలయం బయట వేచి చూసేవారు.

తనంతరం 2004 నుంచి 2014 వరకు రెండు లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ మార్గనిర్దేశకత్వంలో కూటమి పదేళ్లు విజయవంతంగా కొనసాగింది. అయితే ఆ సమయంలో కొందరు యూపీఏ మంత్రులు రాహుల్ నాయకత్వాన్ని సమర్థించనప్పటికీ.. కూటమి, ప్రభుత్వం మధ్య విభజన రేఖ గీసి మరీ, కాంగ్రెస్ పార్టీపై సోనియా- రాహుల్ పెత్తనం చెలాయించారు. కానీ 2014 నుంచి 2020 మధ్య సోనియా- రాహుల్ ద్వయం ఎన్నో దారుణ పరాభవాలను ఎదుర్కొంది. మధ్యలో ప్రియాంక గాంధీని రంగంలోకి దింపినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. రెండు వరుస లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నో రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి.

ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ పార్టీలో చురుకైన పాత్ర పోషించాలని, రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ప్రియాంక రాహుల్‌ను అన్ని విషయాల్లోనూ ప్రభావితం చేయగలదు. దేశవ్యాప్తంగా పార్టీ నాయకులతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ‘రాహుల్ వర్సెస్ ప్రియాంక’ ప్రచారం అసంబద్ధమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రియాంకకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యం వల్ల రాహుల్‌కే లబ్ధి కలుగుతుంది. జ్యోతిరాదిత్య సింధియా లాంటి తిరుగుబాటు అవకాశాలను తగ్గిస్తుంది. రాజస్థాన్‌లో సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్ మధ్య సుదీర్ఘ విభేదాలు కొనసాగుతుండగా.. ప్రియాంక పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలని, సచిన్ పైలట్‌కు AICCలో స్థానం కల్పించి గౌరవించాలని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు కోరుతున్నారు. పైలట్ మద్దతుదారులను మంత్రి వర్గంలో చేర్చుకోవాలని అశోక్ గెహ్లాత్‌ను ప్రియాంక ఆదేశించాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ తాత్కాలిక అధిపతిగా వ్యవహరిస్తున్న సోనియా ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరించే పరిస్థితులు లేవు. ఎప్పటికైనా రాహుల్ గాంధీనే AICC చీఫ్ పదవి వరిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మాత్రం పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. దీంతో పాటు రాహుల్.. పార్టీ నాయకులతో అంతగా సత్సంబంధాలు కొనసాగించరు. గతంలో ఇందిరా-సంజయ్-రాజీవ్ గాంధీలు మాత్రం ఈ విధానాలను ఎప్పుడూ అనుసరించలేదు. ఈ విషయంలో ప్రియాంక ఆగమనం రాహుల్‌కు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు నడిచిన పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా గాంధీ హయాంలోనూ పార్టీ నాయకులతో కాంగ్రెస్ అధినేతలు సత్సంబంధాలు నెరిపేవారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ప్రియాంక పాత్ర కీలకంగా మారుతుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Congress, Priyanka Gandhi, Rahul Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు