హోమ్ /వార్తలు /Explained /

CT scan: సీటీ స్కాన్ ఎవరికి అవసరం ? దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది? పూర్తి వివరాలు..

CT scan: సీటీ స్కాన్ ఎవరికి అవసరం ? దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది? పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమందిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా సీటీ స్కాన్‌లో వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. లక్షణాలు ఉన్న మరికొంత మంది ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నా పాజిటివ్‌ రిపోర్టు రావట్లేదు. ఇలాంటి వారికి సీటీ స్కాన్‌లో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది.

ఇంకా చదవండి ...

దేశంలో కరోనా రెండో దశ తీవ్రత కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటళ్లు నిండిపోయాయి. దీనికి తోడు ఈ దశలో కరోనా నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. కొంతమందిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా సీటీ స్కాన్‌లో వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. లక్షణాలు ఉన్న మరికొంత మంది ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నా పాజిటివ్‌ రిపోర్టు రావట్లేదు. ఇలాంటి వారికి సీటీ స్కాన్‌లో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. దీంతో వైరస్ లోడ్‌ను తెలుసుకునేందుకు చాలామంది CT స్కాన్‌ చేయించుకుంటున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఉన్న రేడియాలజీ ల్యాబ్‌లు రద్దీగా మారాయి.

కరోనా చికిత్సలో CT స్కాన్ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది వైద్యులు ఇంకా చెప్పలేకపోతున్నారు. సాధారణంగా సీటీ స్కాన్ వల్ల రోగుల శరీరం హానికరమైన రేడియేషన్‌కు ఎక్కువగా గురవుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోగి ఈ స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? చికిత్స పద్ధతులను నిర్ణయించడంలో CT స్కాన్ రిపోర్ట్ ఎంత మేరకు సహాయం చేస్తుంది? ఎన్ని రోజుల విరామంలో ఎన్నిసార్లు స్కానింగ్ అవసరం? దీంతో ఏదైనా ప్రమాదం ఉందా? వంటి ప్రశ్నలు ఎంతోమంది బాధితులను వేధిస్తున్నాయి. CT స్కాన్‌కు సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలను చూద్దాం.

* CT స్కాన్ అంటే ఏంటి?

కంప్యూటర్ టోమోగ్రఫీ అనే వైద్య పరీక్షనే సీటీ స్కాన్ అంటారు. తీవ్రత ఎక్కువగా ఉండే హై రిజల్యూషన్ సీటీ స్కాన్‌ను HRCT అంటారు. దీని ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. కానీ ఎక్కువ స్థాయిలో రేడియేషన్ వెలువడుతుంది. కోవిడ్-19 నిర్ధారణకు హెచ్‌ఆర్‌సీటీ చేయించుకోవచ్చు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో అత్యుత్తమ విధానంగా భావిస్తున్న RTPCR టెస్టుల్లో వైరస్ బయట పడకపోయినా సరే... హెచ్‌ఆర్‌సీటీలో వైరస్ లోడ్, దాని తీవ్రతను సులభంగా తెలుసుకోవచ్చు.

* కోవిడ్ రోగులందరికీ CT ఛెస్ట్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉందా?

* లేదు.

* ఎలాంటి రోగులకు సీటీ స్కాన్ చేయాలి?

ఆక్సిజన్ స్థాయి 94 శాతం కంటే తక్కువకు పడిపోయినవారికి, హార్ట్ రేటు నిమిషానికి 24 కంటే ఎక్కువగా ఉన్నవారికి, ఏడు రోజులకు కూడా జ్వరం, దగ్గు తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు సీటీ స్కాన్ అవసరమవుతుంది.

* CT స్కాన్ కంటే ఎక్స్ రే సురక్షితమా?

ఎక్స్‌ రే కంటే సీటీ స్కాన్ సురక్షితమే. CT స్కాన్‌లో ఎక్కువ రేడియేషన్‌ విడుదల అవుతుంది. ఇది ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల CT స్కాన్లలో.. కోవిడ్ కోసం HRCT ఛెస్ట్ స్కాన్‌ను (హై రిజల్యూషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ) డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. ఇది X-రేస్‌తో పోలిస్తే 50 నుంచి 100 రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.

* ప్రమాదకరం అని తెలిసినా కూడా CT స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి?

ఎక్స్‌-రే అనేది ఊపిరితిత్తుల 2D వ్యూ చూపిస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్ తీవ్రత గురించి ఒక ఆలోచనను మాత్రమే ఇస్తుంది. దీంట్లో తేలికపాటి వ్యాధి ఉన్నట్లు తెలిస్తే, బాధితులకు CT స్కాన్ అవసరం ఉండదు. ఇలాంటి వారిలో ఇన్‌ఫెక్షన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి క్రమం తప్పకుండా ఎక్స్-రేలు తీయవచ్చు. ఒకవేళ ఎక్స్‌-రేలో ఇన్‌ఫెక్షన్ తీవ్రత మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే.. వారికి CT స్కాన్ అవసరం అవుతుంది. ఇది ఊపిరితిత్తుల 3D వ్యూను చూపిస్తుంది. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్ తీవ్రత కచ్చితత్వాన్ని అంచనా వేయవచ్చు. దీని ఆధారంగానే బాధితులకు అందించాల్సిన చికిత్సను వైద్యులు అంచనా వేస్తారు.

* CTSS అంటే ఏంటి?

సీటీ స్కాన్ తీవ్రత స్కోరును CTSS (CT scan Severity Score) అంటారు. ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి ఊపిరితిత్తుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న ప్రాంతాన్ని సీటీఎస్‌ఎస్‌ స్కోరింగ్ ద్వారా తెలుసుకుంటారు. అంటే, ఊపిరితిత్తుల్లో ఎంత భాగానికి ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందనే సమాచారాన్ని ఈ స్కోర్ చెబుతుంది. సాధారణంగా కుడి ఊపిరితిత్తిలో 3 లోబ్స్ (చాంబర్లు లేదా విభాగాలు) ఉంటాయి. ఎడమ వైపు ఉండే ఊపిరితిత్తిలో 2 లోబ్స్ ఉంటాయి. సీటీ స్కాన్‌లో ఈ ఐదు లోబ్‌లను పరిశీలించి.. ఒక్కోదానికి ప్రత్యేకంగా స్కోర్ ఇస్తారు. ఈ స్కోరు ఒకటి నుంచి ఐదు వరకు ఉంటుంది. అంటే మొత్తం స్కోరు అత్యధికంగా 25గా ఉంటుంది.

ఈ ఐదు విభాగాలకు కేటాయించిన మొత్తం స్కోర్‌లను కలిపితే.. ఫైనల్ CTSS స్కోర్ వస్తుంది. దీని ద్వారా ఊపిరితిత్తులకు సోకిన ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎంత ఉందో లెక్కించవచ్చు. ఒక్కో విభాగానికి అత్యధికంగా ఇచ్చే స్కోర్ ఐదు కాబట్టి.. మొత్తం సీటీఎస్‌ఎస్‌ స్కోరును 25లో ఎంత వరకు ఉందో లెక్కిస్తారు. CTSS ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉంటే- సాధారణ ఇన్‌ఫెక్షన్‌గా గుర్తిస్తారు. ఇది తొమ్మిది నుంచి 15 వరకు ఉంటే.. వ్యాధి తీవ్రత మధ్యస్థంగా ఉందని అర్థం. స్కోరు 15కు మించితే.. ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉందని భావించాలి.

ఊపిరితిత్తుల్లో ప్రతి విభాగాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి ఇచ్చిన స్కోర్ ఒకటి ఉంటే- లోబార్ ఇన్వాల్వ్‌మెంట్ ఐదు శాతం ఉన్నట్లు అర్థం.

స్కోర్ రెండుగా నమోదైతే.. లోబార్ ఇన్వాల్వ్‌మెంట్ 5-25 శాతం ఉన్నట్లు భావించాలి

స్కోర్ మూడు అయితే.. 26-50 శాతం లోబార్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది.

స్కోర్ నాలుగు అయితే- 51-75 శాతం లోబార్ ఇన్వాల్వ్‌మెంట్.

ఐదు కంటే ఎక్కువ స్కోర్ ఉంటే.. లోబార్ ఇన్వాల్వ్‌మెంట్ 75 శాతం వరకు ఉంటుంది.

ఈ ఫైనల్ CTSS స్కోరును నాలుగుతో గుణిస్తే మొత్తం లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతో తెలుస్తుంది. అంటే ఊపిరితిత్తులకు ఎంత మేరకు ఇన్‌ఫెక్షన్ సోకిందో తెలుస్తుంది. ఉదాహరణకు.. CTSS 25 అయితే, లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ 100 శాతంగా (25x4) ఉంటుంది. అంటే.. ఊపిరితిత్తుల్లోని అన్ని విభాగాలకు ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందని అర్థం. CTSS 15 అయితే, 60 శాతం (15x4) ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ ఇందని భావించాలి. CTSS 8 అయితే, 32 శాతం (8x4) ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వ్యాపించినట్లు అర్థం.

* CORADS స్కోరు అంటే ఏంటి?

కోవిడ్-19 రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్‌ను CORADS అంటారు. వైరస్ కారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్ స్థాయి, ప్రమేయాన్ని ఇది నిర్ణయిస్తుంది. CORAD స్కోరింగ్ 1-6 లెవల్ ఆధారంగా ఇస్తారు. ఈ స్కోర్ ఒకటి అయితే.. 'COVID నెగిటివ్‌గా' లేదా ఊపిరితిత్తుల సాధారణ పనితీరును సూచిస్తుంది. స్కోరు 2-4 ఉంటే.. వైరల్ ప్రమేయం ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది. స్కోర్ 5 అయితే.. కోవిడ్-19 ఉందని అర్థం. స్కోర్ 6 ఉంటే.. ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉందని భావించాలి. RTPCR టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి CORADS స్కోర్- 6 ఇస్తారు.

* ఒకసారి సీటీ స్కాన్ చేయించుకున్న వారికి మరోసారి స్కాన్ అవసరం అవుతుందా?

చికిత్సకు రోగి స్పందించకపోతే లేదా వ్యాధి లక్షణాలు తీవ్రమవుతున్న సందర్భంలో మాత్రమే మరోసారి సీటీ స్కాన్ అవసరం అవుతుంది.

* CT స్కాన్‌ రెండోసారి తీయాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు?

రోగి చికిత్సకు మెరుగ్గా ప్రతిస్పందిస్తున్నప్పుడు, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పుడు, లక్షణాలు క్రమంగా తగ్గుతున్న సందర్భంలో.. మరోసారి CT స్కాన్ చేయాల్సిన అవసరం లేదు.

* CT స్కోరు, ఆక్సిజన్ శాచురేషన్ మధ్య సంబంధం ఏంటి?

ఊపిరితిత్తులు వ్యాధికి ఎక్కువగా ప్రభావితమైనప్పుడు.. CTSS స్కోర్ ఎక్కువగా నమోదవుతుంది. ఇలాంటప్పుడు బాధితులకు తక్కువ ఆక్సిజన్ శాచురేషన్ స్థాయి ఉంటుంది. ఒకవేళ బాధితులు అంతకు ముందే ఇతర శ్వాస కోశ వ్యాధుల బారిన పడితే.. వారి ఊపిరితిత్తులు ఎంతో కొంత దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటప్పుడు CTSS అధికంగా ఉన్నప్పటికీ, ఆక్సిజన్ శాచురేషన్ మెరుగ్గా ఉంటుంది.

* రోగి పూర్తిగా కోలుకున్నా, ఇంకా ఎక్కువ సీటీ స్కోరు ఉంటే.. దాని అర్థం ఏంటి?

కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా రోగుల ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. వీరు ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు, లేదా నెలల సమయం పడుతుంది. అందువల్ల దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు ఏమాత్రం లేకుండా, ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకుంటే.. CTSS గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రోన్ పొజిషన్, ఫిజియోథెరపీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే వ్యాయామాల ద్వారా CTSS స్కోరును మెరుగుపరచుకోవచ్చు.

* CTSS స్కోరు తక్కువగా ఉన్నవారు కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలా?

వ్యాధి లక్షణాలు, తీవ్రత ఆధారంగానే రోగులు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలా లేదా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. దీనికి CTSS స్కోరుకు పెద్దగా సంబంధం ఉండదు. అయితే క్లినికల్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, రోగి ఆక్సిజన్ స్థాయి 94 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు.. తక్కువ CTSS ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాలి. ఇదే సమయంలో CTSS ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆక్సిజన్ స్థాయి మెరుగ్గా ఉన్నవారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. కానీ డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు, సీఓపీడీ, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సీటీఎస్ఎస్ స్కోరు తక్కువగా ఉన్నా కూడా.. వారు హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

* CT స్కాన్ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉంటాయి?

సీటీ స్కాన్ వల్ల రేడియేషన్‌కు ఎక్కువగా గురవుతారు. దీనివల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

* గర్భిణులకు సీటీ స్కాన్ చేయవచ్చా?

గర్భంతో ఉన్నవారికి సీటీ స్కాన్ చేయరు. దీని ద్వారా వెలువడే రేడియేషన్, గర్భంలో పెరుగుతున్న శిశువుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న గర్భిణుల విషయంలో మాత్రం.. తల్లి ప్రాణానికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అత్యవసరమైనప్పుడు డాక్టర్లు దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు.

రచయిత: డాక్టర్ నికేత్ రాయ్, ఎంబీబీఎస్, ఎండీ; మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ అండ్ అసోసియేటెడ్ లోక్ నాయక్ హాస్పిటల్, ఢిల్లీ

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Corona treatment, Covid-19

ఉత్తమ కథలు