Vaccination: కోవిడ్ టీకాలు సురక్షితమేనా? వైరస్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకోవచ్చా?

ప్రతీకాత్మక చిత్రం

డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, కాలేయ సమస్యలు, థైరాయిడ్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వారు వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలి.

  • Share this:
కరోనా మహమ్మారి వెలుగు చూసి ఏడాదిన్నర దాటింటి. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వివిధ దశల్లో విజృంభిస్తోంది. ఈ వ్యాధిని నయం చేసే మందులపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కోవిడ్‌ వ్యాప్తిని ఎదుర్కోవడానికి ఉన్న అస్త్రం వ్యాక్సినేషన్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ లేదా సామూహిక రోగనిరోధకత వస్తుందని, ఆ తరువాత వైరస్ అచేతనంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. టీకా తీసుకున్న తరువాత, శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వైరస్‌ ప్రభావాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా కరోనా ప్రమాదకరంగా మారదు. మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలను చూద్దాం.

* టీకాలు తీసుకోవడం తప్పనిసరి కాదా?
ఏదైనా వ్యాధికి చికిత్స లేదా టీకాలు తీసుకోవడం ఎప్పుడూ తప్పనిసరి కాదు. ఇది వ్యక్తుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ వైరస్‌పై పోరాడటానికి వ్యాక్సిన్ తోడ్పడుతుంది. ఎక్కువ మందికి టీకాలు వేస్తే వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం మంచిది.

* టీకా ఎవరు తీసుకోవచ్చు?
భారత్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిపై వ్యాక్సిన్ తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రెండేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గర్భిణులు, పాలిచ్చే తల్లులను లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, కాలేయ సమస్యలు, థైరాయిడ్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వారు వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలి. అయితే ఈ వ్యాధుల గురించి, వాడుతున్న మందుల గురించి వ్యాక్సిన్ సెంటర్లలోని సిబ్బందికి ముందుగానే తెలియజేయాలి.

* ఎవరెవరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలి?
మెడిసిన్ అలర్జీ లేదా వ్యాక్సిన్ అలర్జీలు ఉన్నవారు, కోవిడ్ టీకాలు తీసుకునే ముందు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఈ విషయం చెప్పాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడు అలర్జీ, ఇతర తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నవారు.. రెండో డోసు తీసుకోకపోవడం మంచిది. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు.. ఈ సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న తరువాతే టీకా తీసుకోవాలి. థ్రోంబోసైటోపెనియా (తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్), యాంటీకోగ్యులెంట్స్ (రక్తం పల్చబడటం) వంటి రక్త సంబంధ సమస్యలు ఉన్న వ్యక్తులు.. తమ అనారోగ్యాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ముందుగానే చెప్పాలి.

* ఏ టీకా మంచిది?
భారత్‌లో ప్రజలకు ఇస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రెండూ మంచివే. సమర్థత, భద్రత విషయంలో రెండు టీకాలు మంచి ఫలితాలు నమోదు చేశాయి.

* మొదటి డోసు ఒక వ్యాక్సిన్, రెండో డోసు మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
ఒక వ్యక్తి రెండు వేర్వేరు టీకాలు తీసుకోకూడదు. ముందు తీసుకున్న వ్యాక్సిన్‌నే రెండో డోసులో కూడా తీసుకోవాలి.

* టీకాలు తీసుకున్న తరువాత డ్రైవింగ్, ఇతర పనులు చేసుకోవచ్చా?
డ్రైవింగ్, యంత్రాలను నడిపే సామర్థ్యంపై వ్యాక్సిన్లు ఎలాంటి ప్రభావం చూపవు. అందువల్ల వ్యాక్సినేషన్ అనంతరం రోజువారీ పనులు చేసుకోవచ్చు.

* ఒక వ్యక్తి తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలా?
ఒకే డోసు తీసుకున్న వారితో పోలిస్తే, వ్యాక్సిన్ రెండు డోసులు పొందిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ. అందువల్ల ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి.

* రెండు డోసుల మధ్య ఎంత విరామం ఉండాలి?
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య 12 వారాల నుంచి 16 వారాల వరకు విరామం ఉండవచ్చు. కోవాక్సిన్‌ విషయంలో ఇది 28 రోజులుగా ఉంది.

* మొదటి, రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి?
కరోనా వైరస్‌తో పోరాడటానికి అవసరమైన యాంటీ బాడీలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. రెండో డోసు తీసుకున్న తరువాత ఈ యాంటీబాడీలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకినా, అది పెద్దగా ప్రభావం చూపకుండానే తగ్గిపోతుంది. వ్యాక్సిన్ వల్ల కొద్దిమందికి తలనొప్పి, ఆకలి తగ్గడం, మైకం, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, దురద, దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి. పారాసెటమాల్ వంటి మందులతో ఇవన్నీ తగ్గిపోతాయి. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

* వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్కులు ధరించాలా?
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా తప్పకుండా ఫేస్ మాస్కులు ధరించాలి. వ్యాక్సిన్ వైరస్ నుంచి వంద శాతం రక్షణను ఇవ్వదు. అందువల్ల నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచే మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి.

* కోవిడ్ బారిన పడిన తర్వాత టీకా తీసుకోవచ్చా?
కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకవేళ మొదటి డోసు తర్వాత కరోనా సోకితే, పూర్తిగా కోలుకున్న తరువాతే రెండవ డోసు తీసుకోవాలి. ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారు కరోనా బారిన పడితే.. వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి 90 రోజుల తరువాత మొదటి డోసు, అనంతరం షెడ్యూల్ ప్రకారం రెండో డోసు తీసుకోవచ్చు.

* పొగ తాగేవారు, ఆల్కహాల్ తీసుకునేవారికి వ్యాక్సిన్ వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా?
ధూమపానం, మద్యపానం చేసేవారు కూడా టీకాలు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ల వల్ల వీరికి ప్రమాదం ఉందని చెప్పడానికి ఎలాంటి డేటా అందుబాటులో లేదు. కానీ ఈ అలవాట్లతో రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందువల్ల, వైరస్ సోకే ప్రమాదం వీరికి ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఈ అలవాట్లు మానేయడం మంచిది.
Published by:Shiva Kumar Addula
First published: