అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 న జరుపుకుంటారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనితో పాటు, ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక కారణం ఉంది. వివిధ రంగాలలో చురుకుగా ఉన్న మహిళలకు గౌరవం చూడడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం థీమ్ విషయానికి వస్తే "Women in Leadership: Achieving an Equal Future in a Covid-19 World" గా ఎంపిక చేసుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర
1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. తరువాత 1910 లో, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్హాగన్ సమావేశంలో దీనికి అంతర్జాతీయ హోదా ఇవ్వబడింది. ఆ సమయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే అప్పుడు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. అంతేకాదు..1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.
ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నిజానికి రష్యాలో మహిళలకు ఓటు హక్కు లభించిన సమయంలో, రష్యాలో జూలియన్ క్యాలెండర్, మిగితా ప్రపంచంలోని గ్రెగోరియన్ క్యాలెండర్లో చెలామణిలో ఉంది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఐక్యరాజ్యసమితి 1996 నుండి ప్రత్యేక థీమ్ తో ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది. దీని తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కొత్త థీమ్ తో జరుపుకుంటారు. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.