ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అఫ్గానిస్థాన్ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో లక్షలాది మంది ఆకలి చావుల అంచున ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ 50 వేల టన్నుల గోధుమలను అఫ్గాన్‌కు పంపాలని నిర్ణయించింది. ఇందుకు పాక్ అనుమతి కోసం వేచిచూస్తోంది. ఎందుకంటే పాక్ భూభాగం ద్వారా అయితే చౌకగా అఫ్గానిస్థాన్‌కు గోధుమలు పంపించడం వీలవుతుంది. అయితే ఈ విషయంలో పాక్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
* భారత్ నుంచి అఫ్గానిస్థాన్‌కు గోధుమలు పంపడం ఎందుకు?
అఫ్గానిస్థాన్‌లో ఇప్పుడు తీవ్ర చలికాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా ఉంది. అఫ్గాన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది ఆహార సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశ జనాభాలో సగానికిపైగా జనం ఆహార సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ సంస్థ (US’s Food and Agriculture Organisation), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (World Food Programme) సంస్థలు తెలిపాయి.
ఈ సంవత్సరాంతానికి అఫ్గానిస్థాన్‌లో 32 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడే ప్రమాదం ఉందని డబ్యూ.ఎఫ్.పీ (World Food Programme), యూనిసెఫ్ (UNICEF)అక్టోబరులో హెచ్చరించాయి. తక్షణం వారిని ఆదుకోకుంటే వీరిలో పది లక్షల మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం కూడా ఉందని ఆ సంస్థలు హెచ్చరించాయి. దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్ అనేక యుద్దాలను చవిచూసింది. దీనికితోడు కరవు, కరోనా, ఘర్షణలు,ఆర్థిక సంక్షోభంతో అక్కడి వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో కనీసం వారికి ఆహారం కూడా దొరకడం లేదు. లక్షలాది కుటుంబాలు శీతాకాలంలో ఆహారం కోసం సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇంతటి తీవ్రమైన ఆహార సంక్షోభం గడచిన పదేళ్లలో ఎక్కడా రాలేదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అఫ్గానిస్థాన్ పరిస్థితులు తెలుసుకునేందుకు యునైటెడ్ నేషన్స్ ఎన్నో సర్వేలు నిర్వహించింది. వీటి ఆధారంగా లక్షలాది మంది తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దేశంలో 2022 వరకు తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉండటంతో లక్షలాది మందిని ఆదుకునేందుకు మానవతా ప్రయోజనాలతో ముందుకు రావాలని యూఎన్ పిలుపునిచ్చింది. 2.3 కోట్ల మందికి ఆహారం అందించడానికి నెలకు రూ.1650 కోట్లు అవసరం అవుతాయని డబ్ల్యూ.ఎఫ్.పి వెల్లడించింది.
* భూమార్గం ద్వారా గోధుమలు పంపేందుకు పాక్ ఎందుకు అడ్డుకుంటోంది?
అఫ్గానిస్థాన్‌కు తక్షణ సాయంగా అక్టోబర్‌లోనే 50 వేల టన్నుల గోధుమలు పంపేందుకు భారత్ ముందుకు వచ్చింది. వాఘా, అట్టారీ మార్గం ద్వారా గోధుమలు పంపడానికి పాక్ అనుమతి కోరింది. అఫ్గానిస్థాన్‌కు గోధుమలను పాక్ భూభాగం ద్వారా పంపే విషయాన్ని భారత్ అభ్యర్థించినట్లు అంతర్జాతీయ మీడియా ముందు పాకిస్థాన్ అంగీకరించినా, నేటికీ దీనిపై పాక్ నుంచి సమాధానం రాలేదు. అఫ్గానిస్థాన్‌పై భద్రతా సమావేశానికి ముందు నవంబర్ ప్రారంభంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాలిబన్ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీని కలిశారు. ఆ సమయంలో సైతం ఈ ప్రస్తావన వచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో మానవతా ప్రయోజనాలతో పనిచేయాల్సి ఉందని, భారత్ అందించే గోధుమల రవాణా కోసం వచ్చిన అభ్యర్థనను పాకిస్థాన్ సానుకూలంగా పరిశీలిస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ముత్తాఖీతో సమావేశం అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ఉన్నాయి. తాలిబన్ ప్రభుత్వం భారత్ సాయాన్ని అంగీకరించడం.. పాకిస్థాన్ తో భారత్ ధ్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేసినప్పటికీ వాఘా సరిహద్దు ద్వారా గోధుమలు పంపిణీ చేయడానికి అంగీకరించడం.. అనే రెండు విషయాలు దీనికి ముడిపడి ఉన్నాయని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. వాఘా ద్వారా అఫ్గానిస్థాన్‌కు గోధుమలు పంపేందుకు పాక్ ప్రధాని అనుమతించారని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపినట్టు పాక్ మీడియా వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌కు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెలలో వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. అయితే ఇందులో పాల్గొనేందుకు పాకిస్థాన్, చైనా నిరాకరించాయి. రష్యా, అమెరికా అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో ఇస్లామాబాద్‌లో సమావేశం కావాలని పాక్ నిర్ణయించింది.
భూమార్గం ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ మధ్య వాణిజ్యాన్ని పాక్ అనుమతించదని నివేదికలు ఎత్తి చూపుతున్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి భారతదేశానికి వస్తువులను తరలించడానికి అనుమతించినా, భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్‌కు వస్తువులు తరలించడానికి పాక్ అనుమతించదని వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని 650 కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా అఫ్గానిస్థాన్‌కు గోధుమలు, అత్యవసర మందులు పంపడానికి చౌకైన, వేగవంతమైన మార్గం ఇదొక్కటే.
* గోధుమలు పంపడానికి మరేదైనా మార్గం ఉందా?
ఇరాన్‌లోని చౌబహర్ పోర్టు ద్వారా గత ఏడాది భారత్, అఫ్గాన్‌కు 75,000 టన్నుల గోధుమలు పంపినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత ఏడాది నవంబరులో తెలిపారు. అఫ్గానిస్థాన్‌కు అన్ని వైపులా భౌగోళికంగా భూమి ఉండటంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రోడ్డు, విమానాల ద్వారా గోధుమలు, మందులు పంపించాలంటే పాక్ అనుమతి తప్పనిసరని భారత విదేశాంగ మంత్రి గుర్తుచేశారు. కాబూల్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమెరికా నేతృత్యంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరించింది. ఈ ఏడాది ఆగస్టులో అక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అప్గాన్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవాల్సి ఉంది. భారత అధికారులకు రక్షణ కల్పిస్తామని తాలిబన్ల ప్రభుత్వం చెప్పినా అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది.
రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..
Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి
గోధుమలను అధిక ప్రొటీన్లు ఉండే బిస్కెట్లుగా మార్చడం ద్వారా బరువు తగ్గించి వైమానిక మార్గం ద్వారా పంపించడానికి భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ వాయుమార్గం ద్వారా వెళ్లడానికి కూడా పాక్ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని, అది కూడా ఆచరణీయంగా కనిపించడం లేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిన ఆగస్టు 15 నుంచి కాబూల్ భారత్ నుంచి అన్ని వాణిజ్య విమానాలు నిలిపివేసిందని తెలిపింది. అఫ్గాన్‌లో ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వంతో భారత్ ఇంకా సంబంధాలు ఏర్పరచుకోలేదని గుర్తుచేసింది. అయితే వాణిజ్య విమానాలు కార్యకలాపాలు సాగించేందుకు భారతదేశం, ఆప్ఘన్ అనుమతి పొందాల్సి ఉందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, India, Pakistan