భారతదేశాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ (missile system) అయిన ఎస్-400 ట్రయాంఫ్ (S-400 Triumf)ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజాగా రష్యా ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ఇండియాకు పంపిణీ చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత వైమానిక దళం ఇప్పటికే పంజాబ్ సెక్టార్లో మొదటి ఎస్-400 స్క్వాడ్రన్ బ్యాటరీలను రంగంలోకి దించిందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ తొలిబ్యాచ్ స్క్వాడ్రన్ బ్యాటరీలు పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోగలవని నివేదికలు చెబుతున్నాయి. మొదటి స్క్వాడ్రన్ డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అంచనా.
ప్రపంచంలోని అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకునే ఎస్-400 వ్యవస్థకు డ్రోన్ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రతిదానిని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉంటుంది. అసలు ఎస్-400 ట్రయాంఫ్ వైమానిక రక్షణ వ్యవస్థ అంటే ఏంటి? దీనికి ఎంత సామర్థ్యం ఉంది? ఇతర రక్షణ వ్యవస్థతో పోల్చితే ఇది ఎంత గొప్పగా పనిచేస్తుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎస్-400 ట్రయాంఫ్ వైమానిక రక్షణ వ్యవస్థ అంటే ఏంటి?
ఎస్-400 ట్రయాంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే ఓ క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా మోహరించవచ్చు. ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చేయగలదు. విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తక్షణమే వీటిని 1993లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మిస్సైల్ స్టోరేజ్ కంటైనర్లు, లాంచర్లు, రాడార్లు ఇలా వివిధ రకాల ఆయుధాలతో దీనిని తయారు చేశారు. 2007వ సంవత్సరంలో ఇది వినియోగంలోకి వచ్చింది.
* ఎస్-400 ట్రయాంఫ్ సామర్థ్యాలు ఏంటి?
మాస్కోకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఎస్-400 తయారు చేసింది. మల్టీఫంక్షన్ రాడార్, అటానమస్ డిటెక్షన్, టార్గెటింగ్ సిస్టమ్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, లాంచర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో ఇది వస్తుంది. ఈ క్షిపణి వ్యవస్థ 400కి.మీ పరిధిలోని ఎలాంటి వైమానిక లక్ష్యాన్ని అయినా ఛేదించగలదు. ఇది ఏకకాలంలో 36 లక్ష్యాలను అటాక్ చేయగలదు. దీనిని ఐదు నిమిషాల్లో యాక్టివేట్ చేయవచ్చు. గత రష్యన్ వాయు రక్షణ వ్యవస్థల కంటే దీని శక్తి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. వైమానిక దళం, సైన్యం, నావికాదళంలో దీన్ని ఉపయోగించవచ్చు.
ఇందులో ఉండే 48N6DM క్షిపణి ఆకాశంలో 250 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు. అలాగే ఇందులోని 40N6 క్షిపణి 400 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఎదుర్కొనగలదు. 40N6 క్షిపణి చాలా దూరంలో ఉన్న వాయు లక్ష్యాలను ఛేదించడానికి యాక్టివ్ రాడార్ హోమింగ్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల ఆటోమేటిక్ గా లక్ష్యాలను గుర్తించడం సులభతరమవుతుంది. ఎస్-400 మెరుగైన ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్మెజర్లతో జామింగ్ ప్రయత్నాలను అడ్డుకుంటుంది. దీని రాడార్లు తక్కువ స్థాయి లక్ష్యాలను కూడా గుర్తించగలవు. ఇందులో భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే 9M96E, 9M96E2 అనే క్షిపణులు ఉన్నాయి. ఇవి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వంటి వేగంగా కదిలే లక్ష్యాలను మిస్ చేయకుండా ఛేదించగలవు.
* ఇతర రక్షణ వ్యవస్థతో పోల్చితే ఇది ఎంత గొప్పగా పనిచేస్తుంది?
క్లోజ్ రేంజ్, మిడిల్ రేంజ్, లాంగ్ రేంజ్ లలో రక్షణను అందించే ఏకైక రక్షణ వ్యవస్థగా ఎస్-400 ట్రయాంఫ్ నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా తయారుచేసిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ కంటే ఇది సమర్థవంతమైనది.
* ఈ రక్షణ వ్యవస్థను ఏయే దేశాలు కలిగి ఉన్నాయి?
2015 నాటికి 20 కంటే ఎక్కువ ఎస్-400 ట్రయాంఫ్ బెటాలియన్లను రష్యన్ దళాలు ఆపరేట్ చేశాయి. 2015లో అల్జీరియా, 2016లో రష్యా మిత్రదేశమైన బెలారస్ ఈ రక్షణ వ్యవస్థను పొందాయి. చైనా 2018లో రెండు వ్యవస్థలను కొనుగోలు చేసింది. టర్కీ 2019లో మొదటి బెటాలియన్ని అందుకుంది. యూఎస్ నేతృత్వంలోని నాటో ఒక ఎస్-400 ట్రయాంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Air Force, Indian Army, Punjab, Russia