మీ ఆదాయం ఏడాదికి రూ.5 లక్షల లోపు ఉందా.. రిబేట్ ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా...

(ప్రతీకాత్మక చిత్రం)

అన్ని మినహాయింపులు, తగ్గింపులు తీసివేసిన తరువాత ట్యాక్స్ పరిధిలోకి వచ్చే తుది ఆదాయాన్ని రిబేట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తుల తుది పన్ను బాధ్యతపై (ట్యాక్స్ లయబిలిటీ) దీన్ని లెక్కిస్తారు.

  • Share this:
మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారు ఇప్పటికీ నిపుణుల సాయంతోనే ఐటీఆర్ దాఖలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లించేవారికి ఆర్థిక అంశాలపై సరైన అవగాహన ఉండట్లేదు. సాధారణంగా సంవత్సరానికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం ఉండేవారు ట్యాక్స్ పరిధిలోకి రారు. అయితే రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు రిబేట్ ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. వ్యక్తుల ఆదాయం ఆధారంగా నిర్దిష్ట మొత్తాన్ని రిబేట్ రూపంలో ట్యాక్స్ నుంచి మినహాయిస్తారు. ప్రస్తుతం వార్షికాదాయం రూ.5 లక్షలకు మించని వారికి ఈ ట్యాక్స్ రాయితీ అందుబాటులో ఉంది. సెక్షన్ 87A కింద రిబేట్‌ను పొందవచ్చు. దీనిపై ట్యాక్స్ చెల్లింపుదారులు అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

రిబేట్ నిబంధనలు ఏంటి?
భారత ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2003లో సెక్షన్ 87Aను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఎప్పటికప్పుడు మార్చారు. ప్రస్తుతం వ్యక్తిగత ట్యాక్స్ చెల్లింపుదారుల ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే అతడు చెల్లించాల్సిన ట్యాక్స్‌ నుంచి రూ. 12,500 వరకు రిబేట్ రూపంలో ట్యాక్స్ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. కానీ వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించితే సెక్షన్ 87A కింద రిబేట్ క్లెయిం చేసుకోవడానికి అర్హత కోల్పోతారు. అంటే వ్యక్తులు ఆదాయంలోని రూ.2.5 లక్షలపై (ప్రాథమిక పరిమితి) ఎలాంటి ట్యాక్స్ వర్తించదు. కానీ మిగిలిన రూ.2.5 లక్షలపై ఐదు శాతం ట్యాక్స్ (రూ.12,500) ఉంటుంది. ఈ మొత్తాన్ని రిబేట్ రూపంలో క్లెయిం చేసుకోవచ్చు.

ఈ రిబేట్ పొందడానికి అందరూ అర్హులు కాదు. భారతీయులు, ప్రవాసీయులు, హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీలు (HUF).. అందరికీ రూ. 2.50 లక్షల ప్రాథమిక ట్యాక్స్ మినహాయింపు పరిమితి వర్తిస్తుంది. కానీ సెక్షన్ 87A కింద రిబేట్ అనేది భారత్‌లో నివసించే ట్యాక్స్ చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. HUFలు, ప్రవాస భారత వ్యక్తులు రిబేట్ క్లెయిం చేసుకునేందుకు అర్హులు కాదు.

రిబేట్ అర్హతకు ఏ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి?
అన్ని మినహాయింపులు, తగ్గింపులు తీసివేసిన తరువాత ట్యాక్స్ పరిధిలోకి వచ్చే తుది ఆదాయాన్ని రిబేట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తుల తుది పన్ను బాధ్యతపై (ట్యాక్స్ లయబిలిటీ) దీన్ని లెక్కిస్తారు. సెక్షన్ 80C, సెక్షన్ 80 CCD, సెక్షన్ 80D, సెక్షన్ 80G, సెక్షన్ 80TTA, సెక్షన్ 80TTB కింద వర్తించే ట్యాక్స్ డిడక్షన్లు తీసివేసిన తరువాత వర్తించే ట్యాక్స్ లయబిలిటీ ఆధారంగా రిబేట్‌ వర్తిస్తుంది.

అన్ని రకాల ఆదాయ వనరులపై రిబేట్‌ను క్లెయిం చేసుకోవచ్చా?
అన్ని రకాల ఆదాయాలపై సెక్షన్ 87A వర్తించదు. ట్యాక్స్‌ స్లాబ్ రేటు వర్తించే సాధారణ ఆదాయం, సెక్షన్ 112 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చే ఆదాయం, సెక్షన్ 111A ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపై రిబేట్‌ను క్లెయిం చేసుకోవచ్చు. కానీ సెక్షన్ 112A పరిధిలోకి వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మాత్రం రిబేట్‌ పరిధిలోకి రాదు.

రూ.5 లక్షలకు మించకున్నా ట్యాక్స్ వర్తిస్తుందా?
వ్యక్తుల ఆదాయం రూ.5 లక్షలు మించని అన్ని సందర్భాల్లోనూ రిబేట్ వర్తిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. వ్యక్తుల ఆదాయ వనరుల్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ ఉన్న కొన్ని సందర్భాల్లో రిబేట్ పరిమితికి మించి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ చెల్లింపుదారుల ఆదాయంలో 15 శాతం (షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) లేదా 20 శాతం (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) అధిక రేటుతో పన్ను విధించే ఆదాయం ఉన్నప్పుడు.. మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించనప్పటికీ వారు నిబంధనల ప్రకారం ఇంకా కొంత ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయం రూ.5 లక్షల లోపు ఉందనుకుందాం. దీంట్లో రూ.1 లక్ష లిస్టెడ్ షేర్లపై వచ్చే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకుందాం. ప్రాథమిక పరిమితి రూ.2.5 లక్షలకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన రూ.2.5 లక్షల్లో రూ.1 లక్ష షార్ట్ టర్మ్ గెయిన్స్‌పై 15 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.15,000) వర్తిస్తుంది. మిగతా రూ.1.5 లక్షలపై ఐదు శాతం స్లాబ్ రేటు ప్రకారం రూ.7,500 ట్యాక్స్ చెల్లించాలి. ఈ సందర్భంలో వ్యక్తులు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్స్ రూ.22,500 (రూ. 7,500 +15,000) అవుతుంది. మొత్తం రిబేట్ క్లెయిం పరిమితి రూ.12500 తీసివేస్తే.. ఇంకా రూ.10,000 ట్యాక్స్ అదనంగా ట్యాక్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే వ్యక్తుల ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
First published: