Explained: భవిష్యత్తులో ఆ ప్రమాదం వల్ల ఇంటర్నెట్‌ వ్యవస్థ ధ్వంసం కానుందా..? భారత్ పరిస్థితి ఏంటి? వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం(Image credit: NASA)

Explained: ఓ ప్రమాదం వల్ల ప్రపంచంలో మొత్తం ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థేంటి? అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా..? అలాంటి ముప్పే భూమి ముంగిట పొంచి ఉంది.

  • Share this:
ఎంతో ప్రమాదకరంగా పరిణమించిన కరోనా మహమ్మారి(Corona Virus Latest Telugu News) నుంచి ప్రపంచం క్రమంగా కోలుకుంటోంది. అలాగే మిడతల దండయాత్రను తప్పించుకుంది. ఇక ఏలియన్స్ వచ్చినా మన ప్రపంచాన్ని ఏమీ చేయలేవంటూ మీమ్స్ వస్తున్నాయి. భూమి సేఫ్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓ ప్రమాదం వల్ల ప్రపంచంలో మొత్తం ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థేంటి? అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా..? అలాంటి ముప్పే భూమి ముంగిట పొంచి ఉంది. అయితే ఇంటర్నెట్‌ ఆగిపోయే ప్రమాదం ఏలియన్స్ నుంచి కాదు.. మనకు వెలుగునిస్తున్న సూర్యుడి నుంచే ఉంటుందట. సూర్య ప్రతాపం వల్ల ఏర్పడే సౌర తుఫానుతో ఇంటర్నెట్ ఎపోకలిప్స్ (ఇంటర్నెట్ విధ్వంసం) జరుగుతుందని ఓ కొత్త పరిశోధన వెల్లడించింది.

గత నెలలో జరిగిన ఏసీఎం ఎస్ఐజీసీఓఎంఎం 2021 కాన్ఫరెన్స్‌లో ప్రదర్శితమైన ఓ పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత శక్తిమంతమైన సౌరశక్తి ఇంటర్నెట్‌కు విఘాతం కలిగిస్తుందని, కమ్యూనికేషన్ శాటిలైట్లు, సబ్ మెరైన్ కేబుల్స్ ను ధ్వంసం చేస్తుందని ఆ పరిశోధన చెప్పింది. రానున్న పదేళ్లలో అంతరిక్షంలో విపరీతమైన వాతావరణం ఏర్పడే అవకాశం 1.6 నుంచి 2 శాతం ఉందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు కూడా తేల్చాయి.

* సొలార్ స్ట్రోమ్ (సౌర తుఫాను) అంటే ఏంటి..
అత్యంత ఆయస్కాంతీకరణ, శక్తిమంతమైన కణాలు సూర్యుడి నుంచి వెలువడడమే సొలార్ స్ట్రోమ్ (సౌర తుఫాను) లేదా కొరోనల్ మాస్ ఎజెక్షన్ అని ఖగోళ శాస్త్రవేత్తలు సంబోధిస్తున్నారు. ఈ సౌర తుఫాను గంటకు కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమిని చేరేందుకు 13 గంటల నుంచి ఐదు రోజుల వరకు పట్టవచ్చు.

సౌర తుఫాను నుంచి ప్రజలను భూమి వాతావరణం కాపాడగలదు. అయితే ఎర్త్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ (భూ అయాస్కాంత క్షేత్రం) వరకు సౌర తుఫాను చేరుకోగలదు. దీంతో అక్కడ ఉన్న స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ కరెంట్స్, మనుషుల సృష్టించినవి ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబుల్స్, శాటిలైట్లకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఇదే జరిగితే ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అయ్యే అవకాశం ఉంది.

1859లో 17 గంటల వ్యవధిలో సౌర తుఫాను భూమిని చేరింది. దీంతో అప్పట్లో టెలిగ్రాఫ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ఆపరేటర్స్ ఎలక్ట్రిక్ షాక్‌ను ఎదుర్కొన్నాయి. అలాగే 1921లో వచ్చిన సౌర తఫాను న్యూయార్క్ టెలిగ్రాఫ్, రైల్ రోడ్ సిస్టంపై తీవ్ర ప్రభావం చూపింది.

1989లో కెనడాపై సౌర తుఫాను ప్రభావం పడింది. ఒకవేళ 1859లో వచ్చినంత తీవ్రతతో ఇప్పుడు సౌర తుఫాను వస్తే అమెరికాలోని 20 నుంచి 40 మిలియన్ల మంది దాదాపు రెండు సంవత్సరాల వరకు విద్యుత్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే 0.6 నుంచి 2.6 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది.

* భారత్ పరిస్థితి ఏంటి?
సౌర తుఫాను ప్రభావం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత దేశంపై తక్కువగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది. సౌర తుఫానుల బలం ఎంత మేరకు ఉంటుంది, దాని శక్తి భారత్‌ను ఎంతమేరకు ప్రభావితం చేస్తుందనే విషయాలను ఊహించలేం.

ఇది కూడా చదవండి : ఐదో టెస్ట్ రద్దు ఎఫెక్ట్.. కోపంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకిచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్స్..!

కానీ దిగువ అక్షాంశాల్లో ఉన్న దేశాలు సౌర తుఫాను వల్ల చాలా తక్కువగా ప్రభావితమవుతాయని పరిశోధకులు తేల్చారు. అందువల్ల భారత్, సింగపూర్, మధ్య ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని రిసెర్చ్ అంచనా వేసింది. ఒకవేళ సౌర తుఫాను వస్తే అమెరికాకే తీవ్ర నష్టం ఉంటుందని, ఆసియాలోని చాలా దేశాలు సురక్షితంగా ఉంటాయని వెల్లడించింది.
Published by:Sridhar Reddy
First published: